
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సినిమాల విడుదల సందర్భంగా రాయితీలు, టికెట్ రేట్ల పెంపు సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో హింసను ప్రేరేపించే సినిమాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి రాయితీలు ఇవ్వడం ఏంటి? అని ప్రశ్నించారు.
సీపీఐ నారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆర్ నారాయణ మూర్తిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలి. నారాయణ మూర్తి యూనివర్సిటీ సినిమాలో పేపర్ లీకేజీల వలన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నది చూపించారు. అలాంటి ఒక సందేశాత్మక చిత్రం తీశారు. నారాయణ మూర్తికి ఏ ప్రభుత్వ సహాయం అవసరం లేదు అన్నారు. సమాజంలో హింసను ప్రేరేపించే సినిమాలకు ఏపీ, తెలంగాణ సీఎంలు రాయితీలు ఇస్తారా?
పవన్ కళ్యాణ్ సహా పలువురి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకొనేందుకు, బ్లాక్‌లో అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం ఏంటి?. ఇది దివాళాకోరు రాజకీయం. ప్రజలు దీన్ని అసహ్యించుకుంటారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలకు రాయితీలు ఇవ్వకుండా హింసను ప్రేరేపించే చిత్రాలకు రాయితీలు ఇవ్వడం దివాళాకోరుతనం అవుతుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.