ఎయిడెడ్‌ కాలేజీల్లో ‘రెగ్యులర్‌’ దందా, అధికారుల ఆశీస్సులతో

Corrupt Officials Bribes And Payoffs For Regulation In Education Department - Sakshi

సాక్షి, అమరావతి:ఎయిడెడ్‌ కాలేజీల్లో అవసరం లేకపోయినా బోధన, బోధనేతర సిబ్బందిని అన్‌ ఎయిడెడ్‌ ప్రాతిపదికన నియమించారు. ఆ సందర్భంలో పెద్దఎత్తున పైరవీలు నడిచాయి. సొమ్ములు కూడా చేతులు మారాయి. తాజాగా ఆ పోస్టులను క్రమబద్ధీకరణ (రెగ్యులర్‌) చేయిస్తామని.. నెలకు ఇచ్చే రూ.15 వేల నామమాత్రపు వేతనాన్ని రూ.లక్షకు పైగా ఇప్పించేలా చూస్తామంటూ సదరు కళాశాలల యాజమాన్యాలు వసూళ్ల పర్వానికి తెరలేపాయి. కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించైనా ఆ పోస్టులను రెగ్యులర్‌ చేయిస్తామని నమ్మబలుకుతూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఉన్నత విద్యాశాఖలోని కొందరు కిందిస్థాయి అధికారుల ఆశీస్సులతో రూ.కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నత విద్యా శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు సైతం అందుతున్నాయి. 

యూజీసీ నిబంధనల ప్రకారం జీతాలొస్తాయంటూ.. 
రాష్ట్రంలో 137 ఎయిడెడ్‌ కాలేజీలు ఉండగా.. అందులో దేవదాయ శాఖకు చెందినవి 4, మైనార్టీ స్టేటస్‌లో 16 కాలేజీలు ఉన్నాయి. మిగిలినవి వివిధ యాజమాన్యాల్లో నడుస్తున్నాయి. వీటిలో ఎయిడెడ్‌ సెక్షన్లలో మొత్తంగా 1,02,234 సీట్లు ఉండగా.. 51,085 మంది విద్యార్థులున్నట్టు యాజమాన్యాలు చూపిస్తున్నాయి. అదే అన్‌ ఎయిడెడ్‌ సెక్షన్లలో 1,54,350 సీట్లున్నాయి. ఇక్కడ కూడా సగం మాత్రమే సీట్లు భర్తీ కాగా.. మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ కాలేజీల్లోని ఎయిడెడ్‌ విభాగాల్లో 1,303 మంది బోధనా సిబ్బంది, 1,422 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. వీటిలో అన్‌ ఎయిడెడ్‌ విభాగంలో 1,621 మంది బోధనా సిబ్బంది, 909 మంది బోధనేతర సిబ్బంది కలిపి 2,530 మంది పని చేస్తున్నారు. వీరికి ఆయా యాజమాన్యాలు నెలకు రూ.15 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ పోస్టుల్ని క్రమబద్ధీకరణ చేయిస్తే యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికీ రూ.లక్షకు పైగా వేతనం అందుతుంది. దీనిని ఆశగా చూపి యాజమాన్యాలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. అన్‌ ఎయిడెడ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయించేందుకు పకడ్బందీగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. గతంలో ఇలాంటి వారిలో కొందరికి అనుకూలంగా ఉన్నత విద్యాశాఖలోని కొందరు అధికారుల సహకారంతో కోర్టు ఉత్తర్వులు జారీ చేయించి మరీ రెగ్యులర్‌ చేయించారు. ఆ ఉత్తర్వులను ఆధారం చేసుకుని ఇప్పుడు మొత్తం అందరినీ రెగ్యులర్‌ చేయిస్తామంటూ తెరవెనుక వ్యవహారం నడిపిస్తున్నారు. 

చట్టానికి వ్యతిరేకంగా.. 
ఉన్నత విద్యాసంస్థల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన యాక్ట్‌–1994కు వ్యతిరేకంగా ఈ వ్యవహారానలు నడిపిస్తున్నారు. ఆ చట్టం ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్‌లుగా తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్న వారి రెగ్యులరైజేషన్‌కు గతంలో ఒక అవకాశం ఇచ్చారు. 1993 నవంబర్‌ 25 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే రెగ్యులర్‌ చేయాలని అప్పటి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వారికి యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉండి, ఎయిడెడ్‌ పోస్టుల్లో ఖాళీలు ఉంటే రెగ్యులర్‌ చేయాలని పేర్కొన్నారు. వారినీ తప్ప వేరెవరిని రెగ్యులర్‌ చేయడానికి వీల్లేదు. అలా చేయడం చట్ట వ్యతిరేకం. కానీ.. కోర్టుల నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి గతంలో కొందరిని రెగ్యులర్‌ చేయించారు. ఇప్పుడు వాటినే చూపిస్తూ అందరినీ రెగ్యులర్‌ చేయిస్తామని కొన్ని యాజమాన్యాలు, ఉన్నత విద్యాశాఖలోని కొంతమంది అధికారులు పావులు కదుపుతున్నారు.  

చదవండి : ఉత్పత్తి ఉరకలెత్తేలా, రాష్ట్రానికి క్యూ కడుతున్న ఉక్కు కంపెనీలు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top