
ఆ బూత్‌లను మార్చలేమనే నిర్ణయానికి ఎన్నికల కమిషనర్
వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ నివేదిక మేరకు నిర్ణయం
ఇప్పటికే 70 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామన్న కలెక్టర్
అయితే ప్రజా రవాణా, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీడీపీ నేతల అరాచకంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతులెత్తేసిందా? అన్న ప్రశ్నకు అధికార వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానం వినిపిస్తోంది. ఓటింగ్ శాతాన్ని తగ్గించే కుట్రలో భాగంగా పులివెందుల మండలంలోని ఎర్రబెల్లి, నల్లగొండువారిపల్లి, నల్లపురెడ్డిపల్లిలో 6, 7, 8, 9, 10, 11 పోలింగ్ బూత్‌లను ఇష్టానుసారం మార్చేశారు. ఏ ఊరిలో వారు ఆ ఊళ్లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వీలు లేకుండా చేశారు. తద్వారా వైఎస్సార్‌సీపీకి గట్టి పట్టు ఉన్న ఈ ఊళ్లలో ఓటింగ్ శాతం తగ్గించేలా అధికార పార్టీకి నిబంధనలకు విరుద్ధంగా అధికారులు లబ్ధి చేకూర్చారు.
దీనిపై వైఎస్సార్‌సీపీ బృందం పలుమార్లు ఎస్‌ఈసీకి వినతి పత్రాలు అందజేసింది. పోలింగ్ కేంద్రాలు ఇదివరకటిలాగే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ అంశంపై జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ఎర్రబెల్లి, నల్లగొండువారిపల్లి, నల్లపురెడ్డిపల్లిలో పోలింగ్ బూత్‌లు మార్చింది వాస్తవమేనని తెలిపారు. రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఎక్కడివారు అక్కడే ఓటు వేసేలా పోలింగ్ బూత్‌లు ఉండాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోరుతుండగా, టీడీపీ అభ్యర్ధి మాత్రం తాజా మార్పు మేరకే పోలీంగ్ బూత్‌లు ఉండాలని వినతిపత్రం ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు.
ఇప్పటికే 70 శాతం ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేశామని తెలిపారు. దీంతో ప్రస్తుత పరిస్థితినే కొనసాగించేలా ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఓటర్లకు దూరంగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసిన గ్రామాలకు ప్రజా రవాణా సౌకర్యం కల్పించాలని కడప కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విషయం సోమవారం కోర్టులో విచారణకు వస్తే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిలో బూత్‌లను మార్చలేమని చెప్పనున్నట్లు సమాచారం.
