అక్టోబర్‌ చివరి నుంచి ఖరీఫ్‌ ధాన్యం సేకరణ

Collection of Kharif grain from the end of October - Sakshi

మార్చి వరకు సేకరించనున్న పౌర సరఫరాల సంస్థ 

ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

3500 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలు 

40 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం 

ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌కు రూ.163 పెంచిన ప్రభుత్వం 

సాధారణ రకానికి రూ.143 పెంపు 

‘ఏ’ గ్రేడ్‌ మద్దతు ధర క్వింటాల్‌ రూ. 2,203 

సాధారణ రకానికి రూ.2,183గా నిర్ణయం 

లక్ష్యానికి మించి ధాన్యం వచ్చినా కొనడానికి సిద్ధం

సాక్షి, అమరావతి: మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా రైతన్నకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ క్షేత్రం (ఫామ్‌ గేట్‌) నుంచే అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. అక్టోబర్‌ చివరి వారంలో ప్రారంభించి మార్చి నెలాఖరులోగా సేకరణ పూర్తి చేయనుంది. ఇటీవల ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌కు కనీస మద్దతు ధరను రూ.163 మేర పెంచి రూ.2,203 గా ఖరారు చేసింది. సాధారణ వరి రకానికి రూ.143 పెంచి రూ.2,183గా నిర్ణయించింది.

రాష్ట్రంలో వరి సాగైన విస్తీర్ణం, దిగుబడి అంచనా ప్రకారం 40 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో సుమారు 5 లక్షల టన్నులు బాయిల్డ్‌ వెరైటీలు కొనుగోలు చేయనుంది. ఈ ఖరీఫ్‌లో 3,500 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా 10,500 మంది సిబ్బంది భాగస్వామ్యంతో ధాన్యం సేకరిస్తారు.  రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని 1,670 మిల్లుల్లో మర ఆడిస్తారు. ఇందులో 53 బాయిల్డ్, 550 డ్రయర్‌ సౌకర్యాలున్న మిల్లులు ఉన్నాయి. వర్షాలకు ఎక్కడైనా ధాన్యం తడిస్తే రైతుకు నష్టం కలగకుండా దానిని కూడా కొని డ్రయర్‌ ఉన్న మిల్లులకు తరలిస్తారు. గోనె సంచులతోపాటు హమాలీలు, రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వమే అందిస్తుంది.

రైతులే గోనె సంచులు ఏర్పాటు చేసుకుంటే వాటికయ్యే ఖర్చు­ను రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. ధాన్యం తరలింపునకు 5 వేల ట్రక్కులను సిద్ధం చేస్తున్నారు. అవి నిర్దేశిత మిల్లులకు వెళ్లేలా జీపీఎస్, మొబైల్‌ ట్రాకర్ల ద్వారా పర్యవేక్షిస్తారు. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో బయట మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు తగ్గి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇలా లక్ష్యానికి మించి ధాన్యం వచ్చినా కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

కేంద్రంకంటే ముందే.. 
ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి బయోమెట్రిక్‌ ఆధారిత కొనుగోళ్లు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2020–21 ఖరీఫ్‌లోనే పారదర్శక విధానంలో ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్‌ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంట సాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ కార్డులు) ఆధారంగా చేసిన ఈ క్రాప్‌ నమోదు ప్రకారమే కొనుగోళ్లు చేపడుతున్నారు. తద్వారా దళారులు, మిల్లర్ల మోసాలను అరికట్టి రైతులకు మద్దతు దక్కేలా చేస్తున్నారు.

గతంలో దళారులు రైతుల నుంచి తక్కువ రేటుకు ధాన్యం కొని తిరిగి అదే రైతుల పేరుతో ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధరను కొట్టేసేవారు. ఇటువంటివి జరగకుండా ధాన్యం కొనుగోలు సమయంలో రైతుకు ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ (ఎఫ్‌టీఓ) సమయంలో ఆధార్‌ను తప్పనిసరి చేశారు. ధాన్యం నగదు చెల్లింపులను సైతం ఆధార్‌ సీడింగ్‌ కలిగిన రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

రైతులను మిల్లర్లు ఇబ్బందిపెట్టకుండా చర్యలు 
ధాన్యం కొనుగోళ్ల సమయంలో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకే పరిధి నుంచి ధాన్యాన్ని దూరంగా తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఆ మండలంలోని మిల్లులను ట్యాగ్‌ చేస్తాం. ఇప్పటికే జిల్లాలవారీగా సేకరణ అంచనాలను రూపొందిస్తున్నాం. గోనె సంచుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. రైతు­లకు నగదు చెల్లింపు సమయంలో బయోమెట్రిక్‌ తీసుకుంటామని చెప్పారు. – వీరపాండియన్, ఎండీ, పౌరసఫరాల సంస్థ

కస్టమ్‌ మిల్లింగ్‌పై పర్యవేక్షణ 
ఇప్పటికే 1,474 మిల్లుల్లో సీసీ కెమెరాల ద్వారా కస్టమ్‌ మిల్లింగ్‌ను పర్యవేక్షిస్తున్నాం. మిల్లుల సామర్థ్యం ఆధారంగా సీఎంఆర్‌ కేటాయిస్తున్నాం. మిల్లుల్లో విద్యుత్‌ వినియోగం లెక్కలనుబట్టి కస్టమ్‌ మిల్లింగ్‌ జరిగిందా లేదా అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో 49, మార్చిలో 33, ఏప్రిల్‌లో 118, మే – జూన్‌లో 53 మిల్లుల్లో డీవియేషన్‌ను గుర్తించాం. ఇందులో 31 మిల్లులపై చర్యలు తీసుకున్నాం. మిగిలిన వాటిపై విచారణ జరుగుతోంది. – హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ

దళారులు, మిల్లర్ల అక్రమాలకు చెక్‌ 
ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశాం. గతేడాది ఖరీఫ్‌లో 6.39 లక్షల మంది రైతుల నుంచి రూ.7,222 కోట్లు విలువైన 35.36 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నాం. ప్రస్తుత ఖరీఫ్‌లో 15.25 లక్షల హెక్టార్లలో వరి సాగవగా 80 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నారు.

ఇందులో 40 లక్షల వరకు సేకరణకు ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించారు. దీనిని కస్టమ్‌ మిల్లింగ్‌ చేస్తే 28 లక్షల టన్నులకు పైగా బియ్యం వస్తుందని  ఆశిస్తున్నాం. రైతులు మద్దతు ధరలో పైసా కూడా నష్టపోకుండా, ఆర్బీకేల్లోనే ధాన్యం విక్రయించేలా పటిష్ట చర్యలు చేపడుతున్నాం.   – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top