నామమాత్రంగా పత్తి కొనుగోలు కేంద్రాలు
దిగుబడులు మొదలైన మూడు నెలలకు ఏర్పాటు
ఇప్పటికే 10 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకాలు
క్వింటాకు రూ.1000 నుంచి రూ.1500 వరకు నష్టం
పత్తి మద్దతు ధర రూ.8,110.. మార్కెట్ ధర రూ.7వేల లోపే
నాలుగు కేంద్రాల్లో 10 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు
ఇప్పటి వరకు మొదలుకాని కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి సాగయింది కర్నూలు జిల్లాలోనే. ఈ ఖరీఫ్ సీజన్‌లో 5.62 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారు. అధిక వర్షాలు.. గులాబిరంగు పురుగుతో పాటు చీడపీడల బెడద తీవ్రం కావడంతో దిగుబడులు తగ్గిపోయాయి. సాధారణంగా ఎకరాకు 8–9 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయి. ఈ సారి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా దిగుబడులు 4–5 క్వాంటాళ్లకే పరిమితం అవుతున్నాయి.
పెట్టుబడి వ్యయానికి అనుగుణంగా క్వింటాకు ధర రూ.9వేల వరకు ఉంటే గిట్టుబాటు అవుతుంది. ఇంతవరకు అమ్ముకున్న రైతుల్లో ఏ ఒక్కరికీ రూ.7వేలలకు మించి ధర లభించలేదు. రూ.6వేల–రూ.6,500 ధరతో అమ్ముకొని రైతులు నష్టపోతున్నారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం వెంటనే మద్దతు ధరతో కొనుగోలు చేసే ప్రక్రియను చేపట్టి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సి ఉంది.
అయితే సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. పత్తి క్రయవిక్రయాలకు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు మాత్రమే ఏకైక ఆధారం. మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్ అవుతుండటంతో ధరల్లో పురోగతి లోపిస్తోంది.
మద్దతు ధర రూ.8,110.. మార్కెట్‌లో రూ.7వేల లోపే!
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే ఎకరా పత్తి సాగుకు పెట్టుబడి వ్యయం రూ.36,500 వరకు వస్తోంది. పత్తికి మద్దతు ధర రూ.8110 ఉంది. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం రూ.6వేల–రూ.7వేల ధర మాత్రమే లభిస్తోంది. రెక్కల కష్టాన్ని తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోతున్నారు.
ఈ ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తిలో దిగుబడులు ఆగస్టు మూడవ వారం నుంచే మొదలయ్యాయి. రైతులు ఆదోని మార్కెట్‌కు, పత్తి జిన్నింగ్ మిల్లులకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 10 లక్షల క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరిగాయి.
మూడు నెలలు ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు
పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ 20 రోజుల నుంచి చెబుతోంది. ఈ సారి ముందస్తు వర్షాలు పడటంతో ఆగస్టు నుంచే పత్తి దిగుబడులు మొదలయ్యాయి. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పటికే 10 లక్షల క్వింటాళ్ల పత్తిని అమ్ముకొని వేలాది మంది రైతులు నష్టపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదోనిలో 4, ఎమ్మిగనూరులో 4, మంత్రాలయంలో 1, పెంచికలపాడులో ఒకటి ప్రకారం మొత్తం 10 జిన్నింగ్ మిల్లుల్లో మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు కొనుగోళ్లు చేపట్టకపోవడం గమనార్హం.
కర్నూలు సమీపంలోని గూడూరు మండలంలో పంటల నమోదు అస్తవ్యస్తంగా తయారైంది. రైతుభరోసా కేంద్రం ఇన్‌చార్జీలు స్పందించడం లేదని తెలుస్తోంది. మండల వ్యవసాయ అధికారి పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఫిర్యాదు చేద్దామంటే ఏఓకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోతోందని రైతులు వాపోతున్నారు.
ఈ–క్రాప్ పూర్తి కాదు.. యాప్ పనిచేయదు..
» పత్తిని మద్దతు ధరతో అమ్ముకోవాలంటే పంట సాగు చేసినట్లు ఈ–క్రాప్‌లో నమోదు కావాల్సి ఉంది.
» ఈ సారి పంటల నమోదు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి.
» మేము పత్తి సాగు చేశాం.. పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేయాలని కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
» పత్తి పంటను మద్దతు ధరతో అమ్ముకోవడానికి యాప్ ఇచ్చారు.
» ఈ యాప్‌పై అవగాహన లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
» అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాలో 10 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లాలోని ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పెంచికలపాడుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. వీటిని జాయింట్ కలెక్టర్ కూడా పరిశీలించారు. రైతులు సీఎం యాప్‌లో పేర్లు నమోదు చేసుకొని మద్దతు ధరతో అమ్ముకోవచ్చు. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలి. – నారాయణమూర్తి, సహాయ సంచాలకులు, మార్కెటింగ్ శాఖ
ప్రభుత్వ తీరుతోనే నష్టపోతున్నాం
ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తిలో దిగుబడులు పడిపోయాయి. ఖరీఫ్‌లో 13 ఎకరాల్లో పత్తి సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి రూ.36 వేల వరకు వచ్చింది. అధిక వర్షాలతో కాయలన్నీ కుళ్లిపోతున్నాయి. దిగుబడి ఎకరాకు సగటున 5 క్వింటాళ్ల వరకు వస్తోంది. ప్రస్తుతం వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7వేల ధరతో కొంటున్నారు. మద్దతు ధర రూ.8,110 ఉంది. వ్యాపారులు కొంటున్న ధరతో పోలిస్తే క్వింటాపై రూ.1000 పైనే నష్టపోతున్నాం. – ఇప్పల శేషారెడ్డి, లక్ష్మీపురం గ్రామం, కల్లూరు మండలం


