వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన  | Sakshi
Sakshi News home page

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన 

Published Mon, Aug 7 2023 2:49 AM

CM YS Jagan visit to flood affected areas in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమ, మంగళవారాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో.. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే.

అయితే సహజంగా అలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఆ ప్రాంతాల్లో పర్యటించడం పరిపాటి. గత ప్రభుత్వాల్లో అలానే చేసేవారు. అలా చేస్తే అధికార యంత్రాంగం అంతా సీఎం వెంట ఉంటుందని, అప్పుడు బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించడానికి ఇబ్బంది ఎదురవుతుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించారు. హడావుడి, ఫొటో సెషన్‌ వల్ల ఒరిగేదేమీ ఉండదని భావించారు. బాధితులందరికీ సాయం అందాలంటే తను చేయాల్సింది అలా కాదని, తొలుత సహాయ కార్యక్రమాల కోసం అవసరమైన నిధులు విడుదల చేశారు.

బాధితు­ల తరలింపు, పునరావాసశిబిరాల ఏర్పాటు, ఆహారం, మంచినీరు, మందులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చే­యాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. తద్వారా ఉన్నతాధికారులు, సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల సహకారంతో సాయం అందలేదన్న మాటకు తావు లేకుండా చేశారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడింది. శిబిరాల నుంచి ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు.

అన్ని ప్రాంతాలకు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సాయం అందిన తీరు గురించి ప్రజలతో స్వయంగా మాట్లాడటానికి రెండు రోజుల పర్యటన తలపెట్టారు. ఇలా తను సీఎం అయినప్పటి నుంచి సరికొత్త సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 
 
వరద ప్రభావిత ప్రాంత ప్రజలతో నేడు మాటామంతి 
సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. కూనవరం బస్టాండ్‌ సెంటర్‌లో కూనవరం, వీఆర్‌ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు.

అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు.

అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తానేలంక రామాలయంపేట గ్రామం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.     

Advertisement
Advertisement