
ఆంధ్రప్రదేశ్ మంత్రులు లోకేశ్, పి.నారాయణల వ్యాఖ్యలు చూస్తే మతిపోతుంది. ఎవరో ఒకరు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తే సింగపూర్ తమ రాష్ట్రంలో పెట్టుబడులకు తటపటాయిస్తోందని వీరు అంటున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంకో అడుగు ముందుకేసి ఏమన్నారంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిఐడీ ద్వారా సింగపూర్‌లోని ప్రముఖులు కొందరిని బెదిరించిందీ అని! నవ్విపోదురు గాక అన్నట్టుగా లేవూ ఈ వ్యాఖ్యలు? తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎంతటికైనా సిద్ధపడతారన్నమాట వీళ్లు! కాకపోతే ఆ క్రమంలో తమ అసమర్థతను తామే బయటపెట్టుకున్న విషయాన్ని వారు మరచిపోతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తటపటాయిస్తోందంటే సింగపూర్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విశ్వసనీయతను సందేహిస్తున్నట్లే అవుతుంది కదా?
వాస్తవానికి పెట్టుబడిదారులైనా, ప్రభుత్వాలైనా అజ్ఞాత వ్యక్తుల మెయిళ్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. మెయిళ్లలోని విషయాలను విచారించి నిర్ధారించుకోవచ్చు అంతే. ఫిర్యాదులు ఉన్నా లేకపోయినా కూడా ఇది జరుగుతూంటుంది. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పేదాంట్లో నిజానిజాలెంత? అన్నది బేరీజు వేసుకుంటారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత లాభమొస్తుందనుకుంటే పెట్టుబడి పెడతారు లేదంటే లేదు. అంతే. ప్రభుత్వాల తీరుతెన్నులు, ఆయా ప్రాజెక్టుల ప్రయోజనం, పెట్టుబడులు పెడితే వచ్చే లాభనష్టాలు, ప్రభుత్వాలు కల్పించే రాయితీలు, సదుపాయాలు మొదలైన వాటిపై ఆధారపడి ఆయా సంస్థలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ వంటి వారికి తెలియకుండా ఉంటుందా!
జగన్ నిర్వాకం వల్ల సింగపూర్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్దరించడానికి వెళుతున్నారని చంద్రబాబు టూర్‌కు ముందే వ్యాఖ్యానించారు. తన పరపతి అంతా ఉపయోగించి అమరావతి ప్రాజెక్టులో సింగపూర్ వారిని మళ్లీ భాగస్వాములను చేస్తామని ప్రచారం చేసుకున్నారు. తీరా అక్కడికెళ్లాక ఏమైంది? అమరావతి ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడం లేదని ఆ దేశ మంత్రి టాన్ సే కుండబద్ధలు కొట్టారు. సాంకేతిక సహకారం మాత్రం అందిస్తామన్నారు. అది కూడా మాట వరసకు అన్నట్లే అనిపిస్తుంది. సింగపూర్ కంపెనీలు కూడా పెద్దగా ఆసక్తి చూపని విషయం ఇప్పటికే స్పష్టమైంది. లేకుంటే టీడీపీ మీడియా ఇప్పటికే ఫలానా కంపెనీ ఇంత పెట్టుబడి పెడుతుంది అంటూ ఊదరగొట్టేది. అది కాకుండా లోకేశ్ చేసిన ఆరోపణలను ప్రముఖంగా ఇచ్చారు. మురళికృష్ణ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వానికి స్థిరత్వం లేదని, ఎప్పుడైనా పడిపోవచ్చని ఫిర్యాదులు చేశారట. ఆ వ్యక్తి రాస్తే సింగపూర్ ప్రభుత్వం ఎలా నమ్ముతుంది! కూటమికి 164 సీట్లు ఉన్న సంగతి ఆ దేశంవారికి తెలియకుండా ఉంటుందా!
మరో కోణం చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలపై అభిప్రాయలు చెప్పేందుకు ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ఈ అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవచ్చు లేకపోవచ్చు కూడా. భావ ప్రకటన స్వేచ్ఛ అది. దీని గురించి మంత్రి లోకేశ్‌కు తెలుసో తెలియదో కానీ ఏ మార్గం ద్వారానైనా సరే ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం తప్పు కాదు కానీ.. దుష్ప్రచారం చేయడం తప్పు. అలాంటి తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వాలు కచ్చితంగా చర్య తీసుకుంటాయి. కూటమి నేతలు జగన్ ప్రభుత్వంపై ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారో గుర్తు లేదా? వైసీపీ ప్రభుత్వ అప్పులపై అబద్ధపు ప్రచారం చేయడమే కాకుండా.. రకరకాలుగా కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారే! అయినా ఫలితం లేకపోవడంతో అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి అప్పుల వివరాలు దాచేస్తోందంటూ చిత్రమైన ఆరోపణ కూడా చేశారు. జగన్ ప్రభుత్వం ఈ తాటాకు చప్పుళ్లకు వెరవలేదు సరికదా.. కూటమి నేతల మాదిరిగా బేలగా మాట్లాడనూ లేదు.
తాము పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ వారు పుల్లలు పెడుతున్నారన్నట్లుగా లోకేశ్ ఆరోపించారు. మురళీకృష్ణ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీతో సంబంధాలు ఉన్న వాడని ఆరోపించారు. తీరా చూస్తే ఎన్నారై అయిన ఆ వ్యక్తి ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి విజయం కోసం శ్రమించారని, డబ్బు కూడా ఖర్చు చేశాడని తేలింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎదురైనా చేదు అనుభవాలు, లోకేశ్‌ను కలిసేందుకు కూడా సిబ్బంది ముడుపులు అడగటంతో బాధతో సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్ పెట్టాడని తెలిసింది. లోకేశ్ వీటిల్లో నిజానిజాలు నిర్ధారించుకోకుండానే తండ్రి మాదిరిగానే తన వైఫల్యాలను ఇతరులపై నెట్టేసే ప్రయత్నం చేశారు.
టీడీపీ నేతలు చిలకలూరిపేట వద్ద ఉన్న తన భవనాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సెటిల్ చేసుకోవడానికి రూ.కోటి డిమాండ్ చేశారని మురళీకృష్ణ వాపోతున్నాడు. ఈ అంశంపైనే చంద్రబాబు, లోకేశ్‌లను కలవడానికి ప్రయత్నించి విఫలమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సింగపూర్ కంపెనీలు తమకు వచ్చిన ఫిర్యాదులను చూపించి చంద్రబాబును ప్రశ్నించారంటూ మీడియాలో మరో కథనం వచ్చింది.ఈ వ్యవహారంపై చంద్రబాబు కూడా లోకేశ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ వార్త చెబుతోంది. ఇది నిజమా? కాదా? అన్నది పక్కనబెడితే లోకేశ్ హుందా రాజకీయం చేయకుండా, అసత్య ప్రచారాలకు పూనుకుని దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. మురళీ కృష్ణ ఎవరో తెలిసి కూడా అతని గురించి అబద్ధం చెప్పారన్న భావనకు ఆయన అవకాశం ఇచ్చారనిపిస్తుంది. ఇక మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్య అయితే అర్థం పర్థం లేనిది.
గత ప్రభుత్వం సీఐడీ వారిని పంపించి ఎంక్వైరీ చేయించిందని, దానివల్ల ఆ దేశ ప్రభుత్వానికి, ఏపీకి సంబంధాలు దెబ్బతిన్నాయాని, వాటిని మళ్లీ పునరుద్దించడానికి చంద్రబాబు ఆధ్వర్యంలో సింగపూర్ వెళ్లామని అన్నారు. ఇన్ని విద్యా సంస్థలు నడిపే వ్యక్తి ఇలా మాట్లాడడం ఎబ్బెట్టుగా ఉంది. ఒక రాష్ట్రం అధికారులు ఇంకో దేశంలోకి వెళ్లి విచారణ చేయడం సాధ్యమా? కేంద్రంతో సంబంధం లేకుండా చేస్తారా? ఆ మాత్రం పరిజ్ఞానం కూడా ఈయనకు లేదా! ఏదో ఒకటి మాట్లాడి బట్ట కాల్చి మీద వేయడం అంటే ఇదేనేమో! నిజానికి సింగపూర్ ప్రభుత్వం గతంలో ఏపీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కేవలం ఆ దేశ కంపెనీలు అవగాహన కుదుర్చుకున్నాయి. వాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి 1700 ఎకరాల భూమి కేటాయించడమే కాకుండా, ఏపీ ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి రోడ్లు తదితర సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు.
దానిపై అనేక విమర్శలు వచ్చాయి. అయినా ఆ ప్రాజెక్టు లాభసాటి కాదని భావించి ఆ కంపెనీలు వెనక్కి తగ్గాయని చెబుతారు. మరో సంగతి చెప్పాలి. చంద్రబాబుకు సన్నిహితుడుగా భావించే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసులో జైలుకు వెళ్లింది వాస్తవమా? కాదా? అన్నదాని గురించి చంద్రబాబు, లోకేశ్, నారాయణలు ఎవరూ మాట మాత్రం కూడా ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడ్డారు. ఏది ఏమైనా ఎదుటివారిపైన రాయి వేసే ముందు అది తమకే తగులుతుందేమో అని ఆలోచించుకోవాలి. ఏతావాతా సింగపూర్ నుంచి చంద్రబాబు బృందం రిక్త హస్తాలతోనే తిరిగి వచ్చినట్లేనా? అంటే కూటమి ప్రభుత్వంపై ఆ దేశ ప్రభుత్వానికి, సంస్థలకు నమ్మకం లేనట్లు అనుకోవాలా?
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత