టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు

Published Sun, Dec 31 2023 5:15 AM

CID notice to TDP leader Kolikapudi - Sakshi

సాక్షి, అమరావతి:  సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను చంపి, ఆయన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానంటూ టీవీ5 లైవ్‌ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన టీడీపీ నాయకుడు, అమరావతి జేఏసీ కన్వినర్‌ కొలికపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కొలికపూడి నివాసానికి శనివారం ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారైనట్టు సమాచారం. కొలికపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసు అందించారు.

ఆయన్ను జనవరి 3న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. దర్శకుడిగా తాను తీసిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌తో రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ చానల్స్, వార్త పత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రామ్‌గోపాల్‌ వర్మ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్‌ అయితే ప్రజల్లో టీడీపీ చులకన అవుతుందని భావించి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

టీవీల్లో చర్చలు, సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి సమాజంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని వర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ అనుయాయుడైన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 చానల్‌ యజమాని బీఆర్‌ నాయుడు, యాంకర్‌ సాంబశివరావు తదితరులు నేరపూరిత ఆలోచనలతో కుట్రపూరితంగా ఈ నెల 27న లైవ్‌లో చర్చ పేరుతో బహిరంగంగా సుపారీ ఆఫర్‌ ఇవ్వడంపై వర్మ ఫిర్యాదు చేశారు. వర్మను చంపి, ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని, తానే వర్మ ఇంటికి వెళ్లి తగలబెడతానని కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 డిబేట్‌లో పబ్లిక్‌గా చెప్పడాన్ని వర్మ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

తనను చంపడానికి ముందుగానే ప్లాన్‌ చేసుకుని పబ్లిక్‌గా కాంట్రాక్ట్‌ ఇచ్చినట్టు దీని ద్వారా స్పష్టమవుతోందిని వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా ‘వర్మ కను గుడ్లు తెస్తే రూ.10 లక్షలు, కాళ్లు నరికి తెస్తే రూ.5 లక్షలు... 9985340280 కాల్‌ చేసి క్యాష్‌ తీసుకోండి’ అంటూ సోషల్‌ మీడియాలో సుపారీలు ప్రకటించడం గమనార్హం. ‘గురువుగారు మీ ఆఫర్‌ స్వీకరిస్తున్నాను.. వర్మ తల నరికి తెస్తాను..’ అని షేక్‌ ఫిరోజ్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియా ద్వారా దేవభక్తుని జవహర్‌లాల్‌ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మను హత్య చేసేందుకు టీవీ5 లైవ్‌లో సుపారీ ఆఫర్‌ చేసిన వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది.

టీవీ డిబేట్‌లో సుపారీ ఆఫర్‌ ఇచ్చిన టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు, అందుకు ప్రోత్సహించిన టీవీ5 చానల్‌ యాంకర్‌ సాంబశివరావు, మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఎడిటర్‌ బీఆర్‌ నాయుడు, టీవీ5 మేనేజ్‌మెంట్, డైరెక్టర్లు, షేక్‌ ఫిరోజ్‌తోపాటు మరి కొందరిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్‌లు 153(ఎ), 505(2), 506(2), రెడ్‌ విత్‌ 115, 109, 120(బి) కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement