
పచ్చ కార్యకర్తను మరిపిస్తున్న దాచేపల్లి సీఐ భాస్కరరావు
వైఎస్సార్‌సీపీ నేతలు, సానుభూతిపరులే టార్గెట్
టీడీపీ నేతలు చెప్పిన వారిపై అక్రమ కేసులు, వేధింపులు
తాజాగా బీసీ యువకుడు హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగం
టీడీపీ వారికి రూ.40 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు
ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణికీ వేధింపులు
ఆమెను కలిసేందుకు ఎవరూ వెళ్లకుండా పోలీసుస్టేషన్ గేట్‌కు బేడీలు వేసిన వైనం
సీఐ తీరుపై ప్రైవేట్ కేసులు వేసినా ఆగని బరితెగింపు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆ సీఐ ఎప్పుడూ వివాదాల్లోనే మునిగి తేలుతుంటాడు. నా రూటే సప‘రేటు’ అంటూ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో నంబర్ వన్ ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నాడు. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించటం ఆయన ఉద్యోగం. పైకి ఖాకీ యూనిఫాం వేసుకున్నా, లోపల మాత్రం పసుపు చొక్కా ధరించిన పచ్చ కార్యకర్తలా రెచ్చిపోతుంటాడు.
ఇదీ పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్‌స్టేషన్ సీఐ పొన్నూరు భాస్కరరావు వ్యవహారం. ఈయన తీరుపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఐదు నెలల క్రితం వరకు భాస్కరరావు గురజాల సీఐగా పని చేశారు. అప్పుడు ఆయనపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఎమ్మెల్యే యరపతినేని ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తి సీఐ భాస్కర్. యరపతినేని ఏం చెబితే అది చేయడమే ఈయన డ్యూటీ.
వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా ఉండే నాయకులను టార్గెట్ చేయడం, వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చావ బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎవరైనా వైఎస్సార్‌సీపీ నేతలు ఎందుకు మా వాళ్లను స్టేషన్‌కు తీసుకొచ్చారని అడగడానికి వెళితే ‘పోలీస్‌స్టేషన్‌కు మీరు రాకూడదు.. ఎందుకు వచ్చారు’ అంటూ ఆగ్రహిస్తారు. ఇలా వేధిస్తుండటంపై మీడియాలో కథనాలు రావడంతో సీఐ భాస్కర్‌ను గురజాల నుంచి బదిలీ చేశారు. అయితే యరపతినేని ఆశీస్సులతో పక్క స్టేషన్ అయిన దాచేపల్లి సీఐగా పోస్టింగ్ దక్కించుకున్నాడు.
టీడీపీ నేత ప్రోద్బలంతో అక్రమ కేసు
టీడీపీ అధికారంలోకి రావడంతో దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత ఉప్పుతల యల్లయ్య, కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులతో వేధిస్తుండటంతో తెలంగాణ వెళ్లి డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో పండుగ అని వచ్చిన బీసీ యువకుడు హరికృష్ణపై టీడీపీ నేత షేక్ జానీబాష తన అనుయాయుడితో చెప్పించిన కట్టుకథతో పోలీసులు గురువారం ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
కేసు పెట్టిన వ్యక్తికి ఎటువంటి రక్త గాయాలు లేవు, ఆసుపత్రిలో చికిత్స పొందలేదు. అయినా హరికృష్ణను పోలీసులు నిర్బంధించారు. పోలీసు వాహనంలో కాకుండా టీడీపీ నేత కారులో తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. కనీసం నడవలేని దుస్థితికి వచ్చేలా కొట్టడంతో గురువారం గురజాల కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. దీంతో గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
రూ.40 లక్షల కోసమే..!
సాధారణ ఎన్నికల రోజున జరిగిన గొడవలో హరికృష్ణపై కేసు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఆ గొడవకు సంబంధించి టీడీపీ వాళ్లకు రూ.40 లక్షలు చెల్లించాలని సీఐ భాస్కర్ నేరుగా పంచాయితీ చేశాడు. టీడీపీ నేత జానీబాషా రూ.40 లక్షలు ఇస్తేనే కేసులో రాజీకి వస్తామని ఒత్తిడి చేశారు. దీంతో ప్రతి రోజు స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెట్టారు. సీఐ తీరుతో వైఎస్సార్‌సీపీ నేతలు విసుగు చెంది కోర్టును ఆశ్రయించారు.
కోర్టు సైతం సీఐ భాస్కర్ తీరును తప్పుపట్టింది. దీంతో పగబట్టిన భాస్కర్.. అక్రమ కేసులు బనాయించి ఎలాగైనా టీడీపీ నేతలకు రూ.40 లక్షలు ఇప్పించేందుకే ఇవన్నీ చేస్తున్నాడని హరికృష్ణ తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా, సీఐ భాస్కర్ తీరుపై గురజాల, దాచేపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు హైకోర్టులో మూడు కేసులు వేశారు. కూటమి నేతలు చేస్తున్న అక్రమ వ్యాపారాలు.. రంగురాళ్ల తవ్వకాలు, గ్రానైట్, ఇసుక తరలించే ముఠాతో సీఐ చేతులు కలిపారని పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది.
సొంత స్టేషన్‌కు బేడీలు వేసిన ఘనుడు
» దాచేపల్లికి వచ్చాక కూడా ఆయనలో ఆవగింజంత మార్పు రాలేదు. కనీసం మీడియాను కూడా స్టేషన్‌లోకి రానివ్వడు. ఈయన అవినీతిపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నా చర్యలు మాత్రం శూన్యం. ఉన్నతాధికారులు తననేమీ చేయలేరని సిబ్బందితో గొప్పలు చెబుతుంటాడు.

» సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గత నెల 17వ తేదీన దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఆమెను కలవడానికి వచ్చిన బంధువులు, న్యాయవాదులను పోలీస్ స్టేషన్‌లోకి రానివ్వలేదు. పైగా పోలీస్ స్టేషన్ గేట్లు వేసి తాళం బదులుగా బేడీలు వేశారు. ఇంత జరిగినా పోలీస్ ఉన్నతాధికారులు ఇదేంటని ఒక్క మాట మాట్లాడలేదు.
»అరెస్ట్ చేసిన కృష్ణవేణిని గురజాల కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆమె సీఐపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా తీవ్రంగా హింసించారని చెప్పారు. తాము చెప్పినట్లు వినకపోతే నీపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతాయని, ఆ కేసుల్లో నిన్ను రాష్ట్రం మొత్తం తిప్పుతామని బెదిరించారని వాపోయారు. తన భర్త రాజ్ కుమార్‌పై గంజాయి కేసు పెడతామని కూడా బెదిరించినట్లు న్యాయమూర్తి ఎదుట కృష్ణవేణి కన్నీరు మున్నీరైనట్టు సమాచారం