
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యాధునిక వసతులతో కూడిన భారీ పారిశ్రామిక నగరం అభివృద్ధికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఈ పారిశ్రామిక నగరాన్ని మూడు దశల్లో నిరి్మస్తోంది. ఇందులో తొలి దశ అభివృద్ధికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కృష్ణపట్నం నోడ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (నిక్‌డిక్ట్) ఏపీఐఐసీతో కలిసి నిక్‌డిక్ట్ కృష్ణపట్నం ఇండ్రస్టియల్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (క్రిస్ సిటీ) పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది.
క్రిస్ సిటీలో భారీ పరిశ్రమలతో పాటు వాక్ టు వర్క్ విధానంలో అక్కడే నివాసముండేలా ఓ నగరాన్ని కూడా నిరి్మస్తుంది. పరిశ్రమలకు, నివాస ప్రాంతానికి కూడా అత్యాధునిక వసతులు సమకూరుస్తుంది. మొత్తం 10,834.5 ఎకరాల విస్తీర్ణంలో క్రిస్ సిటీ ఏర్పాటవుతుంది. తొలి దశలో రూ.1,503.16 కోట్లతో సుమారు 2,500 ఎకరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచి్చంది. ఈపీసీ విధానంలో క్రిస్ సిటీలో కీలక మౌలిక వసతుల కల్పనకు రూ.1,021.41 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ త్వరలో టెండర్లు పిలవనుంది. 2022–23 ఎస్‌వోఆర్ ధరల ప్రకారం టెండర్లను పిలుస్తున్నట్లు ఏపీఐఐసీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.
ఈ టెండర్లను న్యాయ పరిశీలన కోసం జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపినట్లు చెప్పారు. కాంట్రాక్టు పొందిన సంస్థ ఇక్కడ రహదారులు, విద్యుత్, నీరు, మురుగు నీరు, వరద నీరు నిర్వహణ, శుద్ధి, పరిశ్రమల వ్యర్థాలు, నివాస వ్యర్థాల శుద్ధి వంటి కనీస మౌలిక వసతులు అభివృద్ధి చేసి వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ టెండర్లపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే జ్యుడిషియల్ ప్రివ్యూకు తెలియజేయాలని ఏపీఐఐసీ పేర్కొంది.
వాక్ టు వర్క్ విధానంలో అభివృద్ధి
పనిచేసే చోటే నివాసం ఉండేలా అత్యంత పర్యావరణ అనుకూల పారిశ్రామిక నగరంగా క్రిస్ సిటీని నిర్మిస్తున్నారు. తొలి దశలో అభివృద్ధి చేసే 2,500 ఎకరాల్లో రహదారులు వంటి వసతులకు సుమారు 494 ఎకరాలు పోగా 2,006 ఎకరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 872.7 ఎకరాలు పారిశ్రామిక అవసరాల కోసం, మిగిలిన ప్రాంతాన్ని నివాసానికి అవసరమైన మౌలిక వసతుల కోసం వినియోగిస్తారు. తొలి దశ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 78,900 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
ఇందులో సుమారు 77,300 మంది ఇక్కడే నివాసముంటూ పనిచేస్తారని, దీనికి అనుగుణంగా 21,870 కుటుంబాలు నివాసం ఉండేలా గృహ సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, స్కూల్స్, హాస్పిటల్స్, రవాణా వంటి కీలక మౌలిక వసతులను కలి్పంచనున్నారు. 36 నెలల్లో తొలి దశ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మూడు దశలు పూర్తయితే ఒక్క క్రిస్ సిటీనే 4,67,800 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ నగరంలో 2,91,000 మంది నివాసముంటారని ఏపీఐఐసీ అంచనా వేస్తోంది.