సాక్షి, తాడేపల్లి: రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీలను మోసం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రిజర్వేషన్లు హైకోర్టు కొట్టేయటంతో చంద్రబాబు నైజం తెలిసింది. ఇంకెంత కాలం బీసీలను మోసం చేస్తారు చంద్రబాబూ అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే బీసీలు అవసరం లేదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ జగన్ హయాంలో మాత్రమే బీసీలకు మేలు జరిగిందని అన్నారు.
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘రిజర్వేషన్లు హైకోర్టు కొట్టేయటంతో చంద్రబాబు నైజం తెలిసింది. 50% కంటే రిజర్వేషన్ పెంచటం కుదరదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. అయినప్పటికీ బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. చంద్రబాబు వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలి. జీవోలు ఇచ్చి పాలాభిషేకం చేయించుకోవడం సిగ్గుచేటు. ఇప్పుడు ఆ బీసీలకు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు?. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అధిక పదవులను కోల్పోయారు. తమిళనాడు తరహాలో చట్టం ఎందుకు తీసుకురాలేదు?. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్తామన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చెప్తారు?.
చంద్రబాబు చేసిన మోసాలకు బీసీలు బలయ్యారు. ఆరు వారాల్లో ఎన్నికలు జరపాలని హైకోర్టు చెప్పింది. మరి ఈ ఆరు వారాల్లో బీసీలకు ఎలా న్యాయం చేస్తారు?. చంద్రబాబు బీసీలకు 34% సీట్లు ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో 52% ఉన్న బీసీలను అన్యాయం చేస్తే సహించేది లేదు. పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే బీసీలు అవసరం లేదా?. చంద్రబాబు ఎన్ని డ్రామాలు చేసినా బీసీలు ఇక నమ్మరు. వైఎస్ జగన్ హయాంలో మాత్రమే బీసీలకు మేలు జరిగింది. జడ్పీలు, మున్సిపాలిటీలు సహా రాజ్యసభ సీట్ల వరకు బీసీలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రివర్గంలో కూడా అధిక పదవులు బీసీలకే ఇచ్చారు. నిజంగా చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉంటే చట్టం చేసే అవకాశం ఉన్నా అలా ఎందుకు చేయలేదు? కేవలం జీవోలు ఇచ్చి ఎందుకు సైలెంట్ అయ్యారు?’ అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: చంద్రబాబు డ్రామా పండింది.. హైకోర్టులో ఎదురుదెబ్బ


