తప్పు చేసిన పోలీసులను బొక్కలో వేస్తాం

Chandrababu Naidu road show at nuziveedu  - Sakshi

మనుషుల కంటే కుక్కలు తెలివైనవి

అందుకే రాష్ట్రంలో డాగ్‌ స్క్వాడ్‌ తెచ్చాను 

ఆడబిడ్డలకు నాయకత్వం ఇచ్చింది టీడీపీనే 

కొల్లు రవీంద్ర అత్యాచారం చేశాడట..

నూజివీడు సభలో చంద్రబాబు 

సాక్షి ప్రతినిధి, ఏలూరు/నూజివీడు/ హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌: ‘పోలీసులకు సంస్కారం నేనే నేర్పించా.. మీపై సైకో ఆఫీసర్ల పెత్తనం ఎక్కువగా ఉంది. కొంత మంది తప్పులు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి కేసునూ సమీక్షించి తప్పు చేసిన పోలీసులను బొక్కలో వేస్తాం’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ‘ఇదేమి కర్మ – మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులో రోడ్‌షో నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా తాను చేసిందేనని చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గురించి మాట్లాడుతూ.. నోట్లో వేలు పెడితే కొరకడం కూడా చేతగాని అమాయకుడు కొల్లు రవీంద్ర అని అన్నారు. అలాంటి రవీంద్ర అత్యాచారం చేశాడంటా.. ఎవరినో చంపేశాడంట.. అని వ్యాఖ్యానించడంతో పక్కడే ఉన్న కొల్లు రవీంద్ర అవాక్కయ్యారు. ‘మనుషుల కంటే కుక్కలే చాలా తెలివైనవి. అందుకే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్‌ శాఖలో డాగ్‌ స్క్వాడ్‌ను తీసుకువచ్చాను. తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు నాయకత్వం ఇచ్చింది.

డ్వాక్రాకు శ్రీకారం చుట్టి పొదుపు ఉద్యమం తెచ్చింది నేనే. ఆడబిడ్డలను కండక్టర్లుగా కూడా చేసిన ఘనత నాదే’ అని అన్నారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 2004లో ముఖ్యమంత్రి ఆస్తి రూ.1.70 కోట్లు అయితే ఇప్పుడు రూ.510 కోట్లని, ఇదంతా షెల్‌ కంపెనీలు, హవాలా డబ్బుల ద్వారానే వచ్చిందన్నారు. గీతం యూనివర్సిటీపై కబ్జా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.  

తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం..
సీతారామపురానికి చెందిన దాదాపు 30 మంది టాటా ఏస్‌ వాహనంలో టీడీపీ జెండాలతో నూజివీడు సభకు వచ్చారు. జంక్షన్‌ రోడ్డులోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ పక్కనే ఉన్న పెట్రోలు బంకు వద్ద వారు ఒక్కసారిగా జెండాలను పైకి ఎత్తారు. జెండా పైపులకు పైన ఉన్న విద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో సీతారామపురానికి చెందిన దుడ్డి సువార్త (60)కు తీవ్ర గాయాలయ్యాయి. మరో తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు.
 
చంద్రబాబు సభ అట్టర్‌ ఫ్లాప్‌ 
చంద్రబాబు నూజివీడు బహిరంగ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఆయన వేదిక వద్దకు రాత్రి 8.50 గంటలకు వచ్చారు. అప్పటికే వచ్చిన వారిలో అత్యధికులు ఇంటిదారి పట్టారు. కొందరు కార్యకర్తలు ‘నెక్టŠస్‌ సీఎం జూనియర్‌ ఎన్టీఆర్‌’ అంటూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. చంద్రబాబు గుడివాడ నుంచి నూజివీడు వచ్చే మార్గంలో తుక్కులూరు వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు బాబును ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు.

చంద్రబాబుకు గానీ, దత్తపుత్రుడికి గానీ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యముందా అని ప్రశ్నించారు. హనుమాన్‌ జంక్షన్‌ వద్ద కూడా బాబుకు చేదు అనుభవం ఎదురైంది. ‘అయ్యా చంద్రబాబూ.. మాకెందుకీ కర్మ.. మీకెందుకు ఘన స్వాగతం’ ‘బైబై బాబు’ అనే ఫ్లెక్సీలు కట్టారు. ఇలా అడుగడునా ఫెక్సీలు దర్శనమివ్వడంతో చంద్రబాబు నొచ్చుకున్నట్లు సమాచారం. కాగా, బాపులపాడు మండలం ఆరుగొలను వద్ద టీడీపీ నేతలు.. అంబేడ్కర్‌ జయంతి నిర్వహిస్తున్న దళితులపై దాడి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top