ఈ–పంటకు నిర్లక్ష్యం చీడ! | Chandrababu Naidu govt is neglecting on farming secto | Sakshi
Sakshi News home page

ఈ–పంటకు నిర్లక్ష్యం చీడ!

Jan 18 2026 4:14 AM | Updated on Jan 18 2026 4:14 AM

Chandrababu Naidu govt is neglecting on farming secto

మూడున్నర నెలల క్రితం రబీ సీజన్‌ ప్రారంభం 

ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం 36 లక్షల ఎకరాలు 

కానీ, ఈ–పంటలో నమోదైన విస్తీర్ణం 11 లక్షల ఎకరాలే 

ఉద్యాన, పట్టు పంటల నమోదు పరిస్థితీ అంతే.. 

2.93 కోట్ల ల్యాండ్‌ పార్సిల్స్‌కుగాను ఇప్పటి వరకు కేవలం 11 లక్షలు మాత్రమే నమోదు 

పథకం నిర్విర్యమే చంద్రబాబు సర్కారు లక్ష్యం

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా, విజయవంతంగా అమలైన ‘ఈ–క్రాప్‌’ నమోదును ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. దీని నమోదు విషయంలో సర్కారు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఈ రబీ సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు 36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ, ఈ–పంటలో నమోదైంది కేవలం 11.35 లక్షల ఎకరాలే.

ఈకేవైసీ అయితే ఒక్క రైతు నుంచి కూడా నమోదుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. మరోవైపు.. ఈ సీజన్‌ నుంచి రైతులు సాగుచేసిన పంటలను రైతులే నమోదు  చేసుకోవాలంటూ చెప్పడం వల్ల ఈ–క్రాప్‌ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

లక్ష్యానికి దూరంగా ఈ–పంట నమోదు..
వాస్తవానికి.. ఏటా రబీ సీజన్‌లో నవంబరు మొదటి వారంలో ఈ–క్రాప్‌ నమోదు ప్రారంభించి జనవరి 31కల్లా పూర్తిచేసేవారు. కానీ, ఈ ఏడాది డిòసెంబరు 17న శ్రీకారం చుట్టారు. డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రకారం నూరు శాతం ల్యాండ్‌ పార్శిల్స్‌ నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏడు శాతానికి మించి నమోదు చేయలేకపోయారు. 11.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 47వేల ఎకరాల్లో ఉద్యాన, 670 ఎకరాల్లో పట్టు, 5,962 ఎకరాల్లో సామాజిక అటవీ పంటలు నమోదు చేశారు. అలాగే, ఈ సీజన్‌లో దాదాపు 45 లక్షల మంది రైతులు రబీ పంటలు సాగుచేస్తుండగా, ఇప్పటివరకు కేవలం 5.57 లక్షల మంది సాగుచేసిన పంటల వివరాలను మాత్రమే నమోదుచేశారు. ఇక డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 2.93 కోట్ల ల్యాండ్‌ పార్సిల్స్‌ ఉండగా, ఇప్పటివరకు కేవలం 11 లక్షలు మాత్రమే నమోదుచేశారు. 

నిర్వీర్యమే లక్ష్యంగా స్వీయ నమోదు..
ప్రస్తుత సీజన్‌ నుంచి తాము సాగుచేసిన పంట వివరాలను భౌగోళిక సరిహద్దులతో సహా నేరుగా రైతులే ఈ–పంట యాప్‌లో స్వయంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి.. రైతులు పొలంలో ఉన్న సమయంలో ఆర్బీకే సిబ్బంది వెళ్లి రైతుతో పాటు పంట ఫొటోలను తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే, తాము వెళ్లినప్పుడు వారు ఉండడంలేదనే సాకుతో ఈ–పంట నమోదు, ఫొటోల అప్‌లోడ్‌ బాధ్యతను రైతులకే అప్పగించారు. అలాగే, గతంలో సామాజిక తనిఖీ కింద ఆర్బీకేల్లో ప్రదర్శించిన తర్వాత, గ్రామసభల ద్వారా అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించి తుది జాబితాలను ప్రదర్శించే వారు.

అలాంటిది ఇక నుంచి www.karrhak.ap.gov.in/ ecsop, www.africuture.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌ నెంబర్‌తో ఈ–పంట నమోదు వివ­రాలను రైతులే పరిశీలించుకోవడమే కాక.. స్వీయ ధృవీకరణతో పాటు తప్పొప్పులపై ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసుకోవాలని చెప్పారు. అయితే, ఎంతమంది రైతులకు అండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్లున్నాయి? ఎంతమంది రైతులకు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంపై అవగాహన ఉందనేది ఆలోచించకుండా ఈ బాధ్యతను రైతులకు అప్పగించడంపట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.

ఈ–క్రాప్‌ స్ఫూర్తిని దెబ్బతీసేందుకే..
ఇక రైతులు తాము ఎంత విస్తీర్ణంలో ఏ పంటసాగు చేయబోతున్నామో ముందుగా సమీప ఆర్బీకే సిబ్బందికి తెలియజేయాలి. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా సీజన్‌ వారీగా ఏ సర్వే నెంబర్‌లో ఏ రైతు ఏయే పంటలు ఏ పద్ధతుల్లో సాగుచేస్తున్నారో జాయింట్‌ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు క్షేత్రస్థాయి పరిశీలనలో నమోదు చేయాలి. అలాగే..

రైతును పంట పొలం వద్ద నిలబెట్టి ఫొటోలు తీసి జియో కోఆర్డినేట్స్‌తో అప్‌లోడ్‌ చేయాలి. 
 ఆ తర్వాత ఈ వివరాలను ఆర్బీకే, రెవెన్యూ అధికారులు ధృవీకరించి రైతుల వేలిముద్రలు (ఈకేవైసీ) తీసుకున్నాక మొబైల్‌ ఫోన్లకు మెస్సేజ్‌ పంపాలి. 
ర్యాండమ్‌గా 5–10 శాతం విస్తీర్ణంలో సా­గైన పంట వివరాలను ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి ధృవీకరించిన తర్వాత రైతులకు భౌతిక రశీదులివ్వాలి. 
 ముసాయిదా జాబితాలను తొలుత సా­మాజిక తనిఖీ కింద ఆర్బీకేల్లో ప్రదర్శించి గ్రామసభల ద్వారా రైతుల అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరించి తుది జాబితాలను ప్రదర్శించాలి. 

ఇలా పక్కాగా ఈ–పంట నమోదు జరిగితే ఏదైనా విపత్తు వేళ ఎంత విస్తీర్ణంలో ఏ పంట దెబ్బతిన్నదో క్షణాల్లో గుర్తించొచ్చు. నేరుగా సదరు రైతుకు నష్టపరి­హారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ)తో పాటు పంటల బీమా పరిహారం అందించొచ్చు. పండించిన పంట ఉత్పత్తులను దళారీలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. అలాగే, సాగు­వేళ అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి ఉత్పాదకాలను అందించే అవ­కాశం ఉంటుంది. ఏపీలో అమలుచేసిన ఈ–క్రాప్‌ స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలో కేంద్రం డిజిటల్‌ క్రాప్‌ సర్వే (డీసీఎస్‌)కు శ్రీకారం చుట్టింది. డీసీఎస్‌ నిబంధనల ప్రకారం ప్రతీ ల్యాండ్‌ పార్సిల్‌ను విధిగా నమోదుచేయాలనే నిబంధన ఉంది. ఇది భారం కావడంతో ఈ–పంట నమోదు బాధ్యత నుంచే ప్రభుత్వం తప్పించుకో­వాలన్న ఎత్తుగడ వేస్తున్నట్లు కన్పిస్తోంది.

ఈ–పంట నమోదును నిర్వీర్యం చేశారు
అత్యంత పారదర్శకంగా గత ప్రభుత్వం చేపట్టిన ఈ–పంట నమోదు ప్రక్రియను ప్రస్తుత చంద్ర­బాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. వాస్తవ సాగుదారులైన కౌలుదారుల వివరాలను నమోదు చేయడం లేదు. భూ యజమానుల పేరిట నమోదు చేస్తున్నారు. తాజాగా.. స్వచ్ఛందంగా రైతులకే స్వీయ నమోదుకు అవకాశం ఇవ్వడంవల్ల అవకతవకలు చోటుచేసుకునే అవకాశముంది. – ఎం. హరిబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement