కొంప ముంచిన చీప్‌ ట్రిక్స్‌.. ఈ ‘ఖర్మ’కు కర్త, క్రియ చంద్రబాబే!

Chandrababu Kandukuru campaign taken eight people lives - Sakshi

8 మంది ప్రాణాలు బలిగొన్న చంద్రబాబు ప్రచారార్భాటం

మీటింగ్‌ పెడతామని చెప్పింది కందుకూరు ఎన్టీఆర్‌ సర్కిల్‌లో..

జనం పలుచగా కనిపించడంతో వాహనాన్ని 50 మీటర్ల దూరంలోని సందులోకి మళ్లించిన బాబు 

100 అడుగుల రోడ్డులో 62 అడుగుల మేర ఫ్లెక్సీలు 

మిగిలిన 38 అడుగుల రోడ్డులో ఊపిరాడక జనం ఉక్కిరిబిక్కిరి

ప్రాణాలు కాపాడుకునేందుకు బాబు వాహనం ఎక్కే యత్నం

హఠాత్తుగా వాహనాన్ని వెనక్కు పోనిచ్చిన డ్రైవర్‌.. ప్రాణభీతితో పక్కనున్న 15 అడుగుల రోడ్డులోకి వెళ్లిన జనం

కాలువలో పడిపోయి కొందరు, నలిగి పోయి మరికొందరు దుర్మరణం

డ్రోన్‌ కెమెరా షూటింగ్‌ కోసం కొంప ముంచిన చీప్‌ ట్రిక్స్‌

చంద్రబాబు సభ వాస్తవంగా జరగాల్సిన కూడలి ప్రదేశం ఎన్టీఆర్‌ సర్కిల్‌. కానీ జనం పలుచగా ఉండడంతో డ్రోన్‌ కెమెరాలతో తీసే ఫొటోలలో బాగా కనిపించడానికి గాను అందరినీ ఎదురుగా ఇరుకుగా ఉన్న రోడ్డులోకి తరలించారు. రోడ్‌షో వాహనాన్నీ అటువైపు మళ్లించారు. ఉక్కిరిబిక్కిరైన జనంలో కొందరు ఆ వాహనాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. సిబ్బంది వారిని కిందకు తోసేశారు. ఆ గందరగోళంలో ఏం జరుగుతుందో తెలియని జనం హాహాకారాలు చేస్తూ ఒక్క సారిగా కిందకు పడిపోయారు. చంద్రబాబు ప్రచార కండూతి అలా 8 మంది ప్రాణాలు బలిగొనడానికి కారణమయ్యింది.  

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రచారార్భాటం మరో­సారి సామాన్యుల ప్రాణాలు హరించింది. లేని ప్రజాదరణను ఉన్నట్టుగా కనికట్టు చేసేందుకు వేసిన చవకబారు ఎత్తుగడ అమాయకుల పాలిట యమపాశమైంది. చిన్నపాటి సభకు వచ్చిన జనాన్ని అంతకంటే ఎక్కువగా చూపించేందుకు చేసిన చీప్‌ ట్రిక్‌ 8 మందిని బలితీసుకుంది.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ బహిరంగ సభ నిర్వహించేందుకు తొలుత నిర్ణయించిన విశాలమైన ఎన్టీఆర్‌ సర్కిల్‌కు చేరుకున్న చంద్రబాబుకు అక్కడ జనం పలుచగా కనిపించారు. దీంతో డ్రోన్‌ కెమెరాల షూటింగ్‌లో జనం కిక్కిరిసినట్టు కనిపిస్తారన్న ఎత్తుగడతో బాబు వెంటనే తన వాహనాన్ని ఎదురుగా ఉన్న ఇరుకు ప్రదేశంలోకి పోనిచ్చారు.

ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఉన్నవారిని కూడా ఆ ఇరుకు సందు వద్దకు తరలించారు. దీంతో అప్పటికే ఆ ఇరుకు రోడ్డులో ఉన్న వారు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. ఒకరి మీద ఒకరు పడిపోయి, అమా­యక జనం హాహాకారాలు చేస్తుంటే.. చంద్రబాబు వాహనం ఉన్నట్లుండి కొంచెం వెనక్కి వెళ్లింది. అక్కడ మరింత గందరగోళం చోటుచేసుకుంది. ఏం జరుగుతుందో తెలియక ప్రాణ భయంతో ఎవరంతకు వారు అక్కడినుంచి బయట పడాలనే ఆతృతే 8మంది మృతికి కారణమైంది.   

ఎన్టీఆర్‌ సర్కిల్‌లో సభ ఎందుకు పెట్టలేదు? 
ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం కందుకూరులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో బుధవారం రాత్రి చంద్రబాబు  బహిరంగ సభ నిర్వహించాలి. ఈ మేరకు చంద్రబాబు ప్రైవేటు కార్యదర్శి ఆర్‌.కృష్ణ కాపర్థి ముందుగా విడుదల చేసిన పర్యటన షెడ్యూల్‌లో స్పష్టంగా తెలిపారు. దాంతో పోలీసులు ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

అక్కడ నాలుగు వైపులా కాస్త విశాలంగా ఉంటుంది. దాంతో బహిరంగ సభ నిర్వహణ సజావుగా సాగుతుందని అంతా భావించారు. కందుకూరు­లోని టీడీపీ శ్రేణులు ముందుగానే ఎన్టీఆర్‌ సర్కిల్‌కు చేరుకున్నాయి. కానీ తన ప్రచార వాహనంలో బుధవారం రాత్రి 7.30 గంటలకు కందుకూరు ఎన్టీఆర్‌ సర్కిల్‌కు చేరుకున్న చంద్రబాబు.. అక్కడ జనం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

కందుకూరులో జనం ఎక్కువగా రారని టీడీపీకి ముందుగానే తెలుసు. అందుకే ఇతర ప్రాంతాల నుంచి తరలించిన జనం చంద్రబాబు వాహనాన్ని అనుసరిస్తూ వచ్చేలా చేశారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌లో సభ నిర్వహిస్తే జనం తక్కువగా ఉన్నారనే విషయం వెల్లడవుతుందని చంద్రబాబు భావించారు.

అక్కడకు 50 మీటర్ల దూరంలో రోడ్డు కాస్త ఇరుకుగా ఉన్నట్టు గమనించిన చంద్రబాబు.. తన వాహనాన్ని అక్కడకు తీసుకువెళ్లాలని చివరి నిమిషంలో డ్రైవర్‌ను ఆదేశించినట్టు సమాచారం. దాంతో ఎన్టీఆర్‌ సర్కిల్‌లో నిలపాల్సిన వాహనాన్ని డ్రైవర్‌ మరో 50 మీటర్లు ముందుకు తీసుకువెళ్లి ఇరుకుగా ఉన్న రోడ్డులో నిలిపారు.  

పూల మాల వేసేందుకు నిలిపినా సరిపోయేది 
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూల మాల వేసి నివాళి అర్పించాలి. విగ్రహం వద్ద వాహనం నిలిపి ఉంటే అక్కడ ఉన్న జనంతోపాటు వాహనం వెంట ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనం నలువైపులా సర్దుకునేందుకు అవకాశం ఉండేది. అనంతరం చంద్రబాబు వాహనాన్ని ఎదురుగా 50 మీటర్లు ముందుకు పోనిచ్చినా సరిపోయేది.

అప్పటికే ఎక్కడికక్కడ సర్దుకున్న జనం.. ఉన్న చోటు నుంచే చంద్రబాబు ప్రసంగాన్ని వినేవారు. కానీ అలా చేస్తే వాహనం చుట్టూ జనం భారీగా ఉన్నట్టు కనిపించరని చంద్రబాబు భావించారు. అందుకే ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేయడాన్ని కూడా రద్దు చేసుకుని, తన వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.  

మిగిలింది 38 అడుగులే  
నిజానికి చంద్రబాబు వాహనం నిలిపింది 100 అడుగుల రోడ్డు. కానీ ఆయన పర్యటన కోసం టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలతో ఆ రోడ్డును ఆక్రమించేశారు. రోడ్డుకు అటూ 30 అడుగులు, ఇటు 30 అడుగుల మేర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటితోపాటు పెద్ద పెద్ద సౌండ్‌ బాక్సులు పెట్టారు. దాంతో రాకపోకలకు కేవలం 38 అడుగుల రోడ్డే మిగిలింది. (కందుకూరు మున్సిపల్‌ అధికారులు గురువారం ఆ రోడ్డులో కొలతలు కొలిచారు.

ఫ్లెక్సీలు, సౌండ్‌ బాక్సులు పోగా మిగిలింది 38 అడుగుల రోడ్డే) అందులో కూడా టీడీపీ నేతలు అడ్డదిడ్డంగా బైకులు పార్క్‌ చేశారు. అలాంటి ప్రాంతంలోకి చంద్రబాబు వాహనం వచ్చి నిలుచొంది. చంద్రబాబు వాహనం ఎన్టీఆర్‌ సర్కిల్‌ను దాటి ఎదురుగా ప్రయాణించడంతో ఆ ప్రదేశంలో ఉన్న జనం వాహనంతోపాటు ముందుకు కదిలారు. అప్పటికే అక్కడ ఉన్న జనంతోపాటు వాహనాన్ని అనుసరించి వచ్చిన వారు, వెనుక ఉన్న వారితో ఆ ప్రాంతం ఇబ్బందికరంగా మారింది.
ఘటన సమయంలో ప్రాణ భయంతో చంద్రబాబు వాహనం పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న జనం 

దుర్ఘటనకు దారితీసిందిలా..
కేవలం 38 అడుగుల రోడ్డులో చంద్రబాబు వాహ­నం నిలపడంతో అప్పటికే ఉన్న జనానికి వాహనంతో పాటు వచ్చిన వారు తోడయ్యారు. ఒక్క­సారిగా జనం గుమిగూడటంతో ఊపిరి తీసుకునేందుకు కూడా సాధ్యం కాక హాహాకారాలు చేశా­రు. ప్రాణభయంతో అక్కడి నుంచి బయట పడ­టానికి ఎవరికివారు యత్నించారు.

ఇందులో భాగంగా కొందరు చంద్రబాబు వాహనం ఎక్కేందుకు యత్నించగా, చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది అనుమతించలేదు. పరిస్థితిని గమనించి, చంద్రబాబు తక్షణమే స్పందించనూ లేదు. పైగా డ్రైవర్‌ వాహనాన్ని కొంచెం వెనక్కు జరపడంతో వెనుక ఉన్న వారు బెంబేలెత్తిపోయారు. ఏం జరుగుతుందో తెలీక భయంతో కేకలు వేశారు.

కందుకూరులో చంద్రబాబు సభ నిర్వహించాల్సిన ఎన్టీఆర్‌ సర్కిల్‌(కింద) చివరి నిముషంలో 50 అడుగులు ముందుకు వెళ్ళి సభ నిర్వహించిన ప్రదేశం(పైన) 

ప్రా­ణా­లు కాపాడుకునేందుకు ఒక్కసారిగా వారూ వేగంగా వెనక్కి జరగడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. కొందరు ఆ ప్రదేశంలో పార్క్‌ చేసిన బైకులపై పడ్డారు. దీంతో జనం ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతూ సమీపంలోని గుండంకట్ట వీధిలోకి చేరారు. ఆ వీధి కేవలం 15 అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. పక్కనే కాలువ ఉంది.

చంద్రబాబు వాహనం చుట్టూ ఉన్న జనం అప్పటికే ఆ వీధిలోకి చొచ్చుకు రావడంతో పలువురు కాలువలో పడిపోయారు. మరికొందరు నలిగిపోయారు. దీంతో మొత్తంగా 8 మంది మృత్యువాత పడగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

నాడు గోదావరి పుష్కరాల్లో 29 మంది దుర్మరణం 
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరంలో గోదావరి పుష్క­రాల సమయంలోనూ అదే రీతిలో వ్యవహరించి 29 మంది మృతికి కారణమయ్యారు. తాను పుష్కర స్నానం చేస్తు­న్న­ప్పుడు చుట్టూ భారీగా జనం ఉన్న­ట్టుగా వీడియోలు చిత్రీకరించాలని ఆయన భావించారు. అందుకోసం సినీ దర్శకుడు బోయపాటి నేతృత్వంలో ఏకంగా సినిమా షూటింగ్‌ స్థాయిలో హడావుడి చేశారు.

అంత భారీ స్థాయిలో జనం రావడం కష్టమని భావించి, పుష్కర ఘాట్ల గేట్లను కొన్ని గంటలపాటు మూసి వేశారు. దాంతో గేట్ల వద్దకు జనం భారీగా చేరుకోగానే, ఒక్కసారిగా గేట్లు తీశారు. వారంతా నీటిలో స్నానం చేయడానికి పరుగెత్తి వస్తుంటే.. తనను చూసేందుకే వారు అలా వస్తున్నారనేలా చిత్రీకరించాలన్నది బాబు ఎత్తుగడ. దాంతో తొక్కిస­లాట జరిగి 29 మంది దుర్మరణం చెందారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top