సాక్షి, తాడేపల్లి: బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. బీసీలకు మేలు చేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రమేనని.. గతంలోనే 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. ఈ రోజు మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేశారని ధ్వజమెత్తారు.
భరత్ మాట్లాడుతూ.. చంద్రబాబు బిర్రు ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసు వేయించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేశారు. బిర్రు ప్రతాప్ రెడ్డికి టీడీపీతో సంబంధం లేదని చంద్రబాబు చెప్పగలరా?చంద్రబాబు హయాంలో బిర్రు ప్రతాప్ రెడ్డికి ప్రభుత్వంలో కీలకమైన పోస్టులు కట్టబెట్టారు. చంద్రబాబు, నారా లోకేష్‌లతో బిర్రు ప్రతాప్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయిటీడీపీతో సంబంధాలున్న వ్యక్తి కోర్టులో కేసు వేస్తే, ఆ పార్టీ అప్పుడే ఎందుకు అడ్డుకోలేదు? హైకోర్టులో కేసు విచారణ సమయంలో టీడీపీ ఎందుకు ఇంప్లీడ్ కాలేదు? అని చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు.
హైకోర్టు తీర్పు తర్వాత రామ్మోహన్ నాయుడుతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించడం రాజకీయ నాటకం కాదా? బీసీలకు అన్యాయం చేసి, తిరిగి వైఎస్సార్‌సీపీపై నిందలు వేయడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో ఆరు బీసీలకు కేటాయించాం. 14 మున్సిపల్ కార్పొరేషన్లలో తొమ్మిది మేయర్ పదవులు బీసీలకు ఇచ్చాం.మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో 67 శాతం బీసీలకు అవకాశాలు కల్పించాం. 137 ప్రభుత్వ కార్పొరేషన్లలో 53 కార్పొరేషన్లకు బీసీలను చైర్మన్లుగా నియమించాం.బీసీల సాధికారత కోసం ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని బీసీలకు రాజకీయ పదవుల కేటాయింపులో వైఎస్సార్‌సీపీతో పోటీ పడగలరా చంద్రబాబు కాని అతని కుమారుడు లోకేష్ గానీ పోటీ పడగలరా అని నిలదీశారు.
బీసీలకు నిజంగా న్యాయం చేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర బీసీ జనగణన చేపట్టాలి. బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి. కేంద్రంలో టీడీపీ మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు బీసీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణకు ఎందుకు ప్రయత్నించరు?బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ కోసం చంద్రబాబు కృషి చేయాలని బీసీలకు ఎవరు మేలు చేశారో, ఎవరు అన్యాయం చేశారో ప్రజలందరికీ తెలుసని మార్గాని భరత్ అన్నారు.
ఇదీ చదవండి:చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఈడీ


