బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ.. | Chandrababu Govt Removed Pension Of Old Woman In Pithapuram | Sakshi
Sakshi News home page

బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ..

Jun 3 2025 7:16 PM | Updated on Jun 3 2025 8:09 PM

Chandrababu Govt Removed Pension Of Old Woman In Pithapuram

సాక్షి, కాకినాడ జిల్లా: ‘కాలు కదపలేను నోరు విడిచి అడగలేను శరీరం సహకరించడం లేదు. అయినా నాకు వచ్చే వృద్ధాప్య పింఛనే ఇప్పటి వరకూ నన్ను బతికించింది. గతంలో వలంటీర్‌ వచ్చి నాకు ప్రతి నెలా పింఛన్‌ ఇచ్చేవాడు. ఇప్పుడు తెచ్చి ఇచ్చే వారే లేరు. ఎవరినైనా అడుగుదామంటే ఎక్కడికీ వెళ్లలేను. ఇప్పుడు నా పింఛన్‌ ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికి ఉన్నట్టు నిరూపించుకోమంటున్నారు. పింఛన్‌ లేకపోతే నాకు దిక్కు లేదు. నా మొర వినే వారు కనిపించడం లేదు’ అంటూ కన్నీటి పర్యంతమవుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్‌ కాలనీకి చెందిన వృద్ధురాలు చోడిశెట్టి సుబ్బారావు (85).

‘గతంలో ఎప్పుడూ ఏ ఇబ్బందీ లేకుండా వలంటీరే అన్నీ చూసుకునే వాడు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. వృద్ధాప్యం వల్ల నా చర్మం పటుత్వం తప్పింది. వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారాయి. ఐరిస్‌ పడటం లేదంటున్నారు. ఏది పడినా పడక పోయినా నేను బతికే ఉన్నాను బాబోయ్‌ అంటున్నా నమ్మకం లేదంటున్నారు. ఇలా కారణాలు చెప్పి నా పింఛన్‌ ఆపేశారు. దానికి ప్రత్యామ్నాయం మాత్రం చెప్పడం లేదు. మరి నేను బతికేదెలా? ఇక నువ్వు బతకడం అనవసరం అన్నట్టుగా చెబుతున్నారు.

ఇన్నేళ్లూ లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకొచ్చింది? నేను బతికే ఉన్నాను కదా! నాకు పింఛనే ఆధారం, బతుకుతెరువు అంటూ కాళ్లు పట్టుకుంటున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ ఆమె కనికరించమని కన్నీటితో అధికారులను వేడుకుంటోంది. తన తల్లి పింఛను కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సుబ్బారావు కుమార్తె పార్వతి చెప్పారు. తన తల్లికి నెలనెలా పెన్షన్‌ డబ్బులతో మందులు కొంటున్నానని, ఆమె పింఛను గురించి అడిగితే అక్కడికెళ్లు.. ఇక్కడికెళ్లు అంటూ తెగ తిప్పారని, ఆడదానిని తానేం చేయగలనని, అందరికీ పింఛను ఇచ్చి తమను ఇబ్బంది పెడతారా అని రోదించారు. అందరూ ఏదో కక్ష కట్టినట్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

👉వీడియో:

Pitapuram

Advertisement
 
Advertisement
Advertisement