ఆ కంపెనీ రెండు లీజులు రద్దు చేస్తున్నారని ఎల్లో మీడియాకు లీకులు
నిజానికి భారతి సిమెంట్స్ లీజులున్న భూములు ప్రైవేటువి
20 ఏళ్ల క్రితమే ఆ కంపెనీ కొనుగోలు చేసిన భూములవి
ఇప్పడు లీజులు రద్దు చేస్తే ఆ భూములు కంపెనీవి కాకుండా పోతాయా?
ఇలా కక్ష సాధింపునకు పాల్పడితే పరిశ్రమలు ఎలా వస్తాయంటున్న పారిశ్రామికవేత్తలు
సాక్షి, అమరావతి: భారతి సిమెంట్స్ కంపెనీపై సీఎం చంద్రబాబు కక్ష సాధింపునకు దిగడంపై పారిశ్రామిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతలపై ఇష్టానుసారం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న బాబు ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేసి భారతి సిమెంట్ కంపెనీ లీజులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాటి రద్దుకు సన్నాహాలు చేస్తోంది.
లీజులు రద్దు చేస్తున్నారంటూ తన కరపత్రిక ఈనాడుకు లీకులు ఇచ్చి కథనాలు రాయిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలంలో భారతి సిమెంట్స్ కంపెనీకి 509.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలో 235.56 ఎకరాలు గతంలోనే లీజులు మంజూరయ్యాయి. తప్పుడు ఆరోపణలతో ఈ లీజులను రద్దు చేసి, దెబ్బ కొట్టాలని చంద్రబాబు కుట్ర పన్నారు. ఇందుకోసం అధికారంలోకి రాగానే 15 ఏళ్లకుపైగా సుదీర్ఘ చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలు పూర్తయిన తర్వాత పొందిన లీజులపై ఎటువంటి కారణం లేకుండానే విచారణకు ఆదేశించారు.
ఆ నివేదికను తనకు కావాల్సిన విధంగా తయారు చేయించుకుని, తద్వారా భారతి సిమెంట్స్ కంపెనీకి త్వరలో నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టీడీపీ కరపత్రికలో శనివారం కథనం రాయించారు. నోటీసులకు కంపెనీ వివరణ ఇచ్చిన తర్వాత.. ఆ వివరణ ఎలా ఉన్నప్పటికీ, సున్నపురాయి లీజులు రద్దు చేస్తారంటూ సదరు పత్రికకు లీకులిచ్చారు. వివరణతో సంబంధం లేకుండా లీజులు రద్దు చేస్తారని చెప్పడం ద్వారా చంద్రబాబు వాటి రద్దుకు కంకణం కట్టుకున్నారని స్పష్టమవుతోంది.
అది 20 ఏళ్ల క్రితం కొన్న ప్రైవేటు భూమి
నిజానికి సున్నపురాయి లీజులు ఉన్న ఆ భూమిని 20 ఏళ్ల క్రితం ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఇప్పుడు లీజులు రద్దు చేస్తే, ఆ భూమి కంపెనీది కాకుండా పోతుందా? అని నిపుణులు ప్రశి్నస్తున్నారు. పరిశ్రమలు వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, కానీ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయని పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వ్యూహాత్మకంగా భారతి సిమెంట్స్ లీజు మాత్రమే కాకుండా రామ్‌కో, ఏసీసీకి లీజులను కూడా రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ప్రచారం చేసుకుంటూ మరోవైపు ఉన్న పరిశ్రమలపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడం చంద్రబాబుకే చెల్లిందని, ఇలాగైతే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


