సకాలంలో అందని వైద్యం
108 వాహనానికి ఫోన్ చేస్తే రెండు గంటల తరువాత వస్తామని సమాధానం
ఆటోలో పెదబయలు పీహెచ్‌సీకి తరలింపు
పరిస్థితి విషమించడంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి రిఫర్
పాడేరు ఆస్పత్రికి వెళ్లేందుకూ అందుబాటులో లేని 108
సంక్రాంతి పండగ వేళ కౌరుపల్లి గ్రామంలో పెను విషాదం
చంద్రబాబు అధికారం చేపట్టాక ఆశ్రమ పాఠశాలల్లో మరణ మృదంగం
పెదబయలు(అల్లూరి సీతారామరాజు జిల్లా): చంద్రబాబు అధికారం చేపట్టాక ఆశ్రమ పాఠశాలల్లో మరణమృదంగం మోగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరుసగా విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. కారణాలు అన్వేషించి మరణాలకు అడ్డుకట్ట వేయడం లేదు. ఫలితంగా మరో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని బలైంది. పండగ రోజే తీవ్ర అనారోగ్యానికి గురై సకాలంలో వైద్యం అందక మరణించింది. తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలి్చంది. పెదబయలు మండలం సీకరి పంచాయతీ కౌరుపల్లి గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన పండగ వేళ పెను విషాదం నింపింది. విద్యార్థిని తల్లిదండ్రులు కొర్రా భాస్కరరావు, లక్ష్మి దంపతుల కథనం ప్రకారం.. కొర్ర పూజిత(14) పెదబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2లో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 8న సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది.
గొంతులో నొప్పి, దగ్గు వస్తోందని చెప్పడంతో 10న తల్లిదండ్రులు పెదబయలు పీహెచ్‌సీకి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. హెచ్‌బీ 6.2 ఉందని, మందులు ఇచ్చారు. ముంచంగిపుట్టు ఏరియా ఆస్పతికి వెళ్లాలని సూచించడంతో అక్కడ మళ్లీ పరీక్షలు చేసి తేడా ఏమీలేదని చెప్పారు. దీంతో పూజితను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. ఈ నెల 14న పూజితకు గొంతు నొప్పి ఎక్కువైంది. శ్వాస తీసుకోవడానికీ ఇబ్బంది పడింది. దీంతో తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే రెండుగంటలు పడుతుందని సిబ్బంది సమాధానం చెప్పారు. దీంతో ఎంపీటీసీ ద్వారా తల్లిదండ్రులు 108కి ఫోన్ చేయించారు. గంటలో వస్తామని సిబ్బంది బదులివ్వడంతో నిరీక్షించారు.
ఎంతకూ 108 రాకపోవడంతో ఆటోలో 8 కిలోమీటర్ల దూరంలోని పెదబయలు పీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది పరీక్షలు చేసి వెంటనే పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. అక్కడ కూడా 108 అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆస్పత్రి సిబ్బంది పీహెచ్‌సీ అంబులెన్సులో పూజితను తరలించారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందిస్తుండగా పరిస్థితి వికటించి పూజిత మరణించింది. 108 అంబులెన్సు సకాలంలో వచ్చి ఉంటే పూజిత ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లారుముద్దుగా చూసుకున్న బిడ్డ ఇలా వైద్యం అందక బలైపోతుందని ఊహించలేదని గుండెలవిసేలా రోదించారు.
పాఠశాలలో ఆరోగ్యంగానే ఉంది..
ఈ విషయంపై గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల హెచ్‌ఎం చిట్టమమ్మను సాక్షి వివరణ కోరగా పాఠశాలలో ఉన్నప్పుడు ఆరోగ్యంగానే ఉండేదని తప్పించుకున్నారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి సత్యశ్రీని అడగ్గా గొంతులో ఇన్‌ఫెక్షన్ ఉందని, అయితే తల్లిదండ్రులు ఆస్పత్రిలో వైద్యం చేయించకుండా ఇంటి వద్ద పసరు వేయించి జాప్యం చేశారని, అందువల్లే పరిస్థితి విషమించిందని చెప్పుకొచ్చారు. అయితే తొలుత ఆస్పత్రికి వచ్చినప్పుడు సరైన వైద్యం అందించాలి కదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 108 సకాలంలో వచ్చి ఉంటే తమ బిడ్డ బతికేదని పేర్కొంటున్నారు. అధికారులు, సర్కారే తమ కుమార్తె మరణానికి కారణమని స్పష్టం చేస్తున్నారు.


