
నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నాటకీయంగా వ్యవహరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్! ప్రజా వ్యతిరేకత వస్తుందనుకుంటే.. ఆ నిర్ణయానికి తానూ అనుకూలం కాదన్న బిల్డప్ ఇస్తారు. ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తున్నట్లు ప్రచారం కల్పిస్తారు. కొన్ని రోజుల క్రితం టీవీ ఛానళ్లలో చంద్రబాబు పేరుతో వచ్చిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఎక్సైజ్ శాఖ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని అన్నట్లు ఛానెళ్ల స్క్రోలింగ్‌లలో కనిపించింది. ఎందుకబ్బా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనుకుంటూ ఉండగానే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు చంద్రబాబు స్టైల్!
ప్రజా ఆరోగ్యం ముఖ్యమని అనుకుంటే పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తారా? ఇది ఏపీ ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా మంచిదో చంద్రబాబే చెప్పాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సొంతంగా మద్యం షాపులను నిర్వహించి బెల్ట్ షాపులు లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం రావడంతోనే మద్యం అమ్మకాలు మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. అదనంగా వెయ్యి దుకాణాలు అనుమతించడంతోపాటు 99 శాతం టీడీపీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలకే దక్కేలా చేసింది. ఇక బెల్ట్ షాపులు సరేసరి. బెల్ట్ షాపు పెడితే తాట తీస్తానని, రూ.ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు కానీ.. ఆచరణలో జరిగింది మాత్రం శూన్యం. అధికార కూటమి స్థానిక ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో వేలాది బెల్ట్ షాపుల నిర్వహణకు వేలం పాటలు కూడా వేశారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు పర్మిట్ రూమ్‌లు తీసుకు వస్తున్నారు.
చంద్రబాబు అంతకుముందు చేసిన ప్రకటనేమిటి? ఇప్పుడు జరిగిందేమిటి? ఆదాయం ముఖ్యం కాదంటూనే వాటిని పెంచుకునేలా మద్యం విధానాన్ని తయారు చేశారన్నది వాస్తవం. పర్మిట్ రూమ్‌ల ద్వారా సుమారు 180 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా రూ.26 వేల కోట్ల ఆదాయం వస్తుంటే దానిని రూ.35 వేల కోట్లకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంత ఆదాయం పెరుగుతుందన్నది వేరే విషయం. కాని దీనికి ప్రభుత్వం కాని, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా కాని ఇచ్చిన వాదన చూడండి. ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమం చేసిన ఈనాడు దినపత్రిక ఇప్పుడు మద్యం వ్యాపారానికి అండగా ఉన్నట్లుగా కథనాలు ఇస్తుండడం విశేషం.
రోడ్లపై మద్యం తాగకుండా పర్మిట్ రూమ్‌లు తెచ్చారట.బహిరంగ ప్రదేశాలలో మద్యపానంతో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయట. ఈ క్రమంలో 2.7 లక్షల కేసులు నమోదు అయ్యాయట. దానిని నియంత్రించేందుకు పర్మిట్ రూమ్‌లు అనుమతిచ్చేలా నిర్ణయం చేశారట. అంతే తప్ప మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఇవ్వడం వల్ల మరింతగా మద్యపానం చేస్తారని, కుటుంబాలు నాశనం అవుతాయని వీరు రాయడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పర్మిట్ రూమ్‌లకు సంబంధించి హెడింగ్ కూడా పెట్టకుండా జాగ్రత్తపడింది..
కొత్త పాలసీలో 840 బార్లు వస్తున్నాయి. ప్రస్తుతం 3736 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా ఈ పర్మిట్ రూమ్‌లు వస్తున్నాయి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే బహిరంగంగా మద్యం తాగడం వల్ల కేసులు వస్తున్నాయట. ఒకే. అది నిజమే అనుకుందాం. ఆ రకంగా శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు ఒప్పుకున్నట్లే కదా! పోనీ పర్మిట్ రూమ్‌లలో తాగిన మందుబాబులు రోడ్లపైకి వచ్చి మళ్లీ అల్లరి చేయరని ఎలా గ్యారంటీ ఇస్తారో తెలియదు. కాగా రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయంలో కూడా విఫలమైంది. బాటిల్‌పై ఉన్న ధరకన్నా రూ.పది ఇరవై అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కొందరిని పోలీసులు కూడా పట్టుకున్నారు.
నాణ్యమైన మద్యం ఇస్తామంటూ చిత్రమైన ప్రచారం చేసిన ఘనత కూడా చంద్రబాబు బృందానిదే. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరమని చెప్పవలసిన ప్రభుత్వం అలా చేయకపోగా, ఇప్పుడేమో ఊరూరికి బార్, వైన్ షాపు, పర్మిట్ రూమ్, బెల్ట్ షాపు అన్న చందంగా వ్యవహరించడం దురదృష్టకరం. మద్యం వల్ల కుటంబాలు నాశనం అవుతాయి. అందులోను మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. తాగిన మైంలోనే మహిళలపై అకృత్యాలు జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మద్యం విషయంలో ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
2014-19 మధ్యలోనూ ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నామంటూ ఫైల్ పై సంతకం చేశారు. కాని ఆ తర్వాత మాత్రం వేలాది బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడిచిపోయాయి. అవి సుమారు 40 వేలకు పైగా అప్పట్లో చేరాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటన్నిటిని దాదాపు లేకుండా చేయడమే కాకుండా, షాపులను తగ్గించి, ఊరికి బయట అవి ఉండేలా చర్యలు తీసుకుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యథాప్రకారం మద్యాన్ని విస్తారంగా పారిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన ఎన్.టి.రామారావు తన హామీ ప్రకారం మద్యాన్ని నిషేధించారు.
ఆ టైమ్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరైనా అక్రమ మద్య వ్యాపారం చేస్తుంటే, వారిపై సైతం కేసులు పెట్టడానికి వెనుకాడవద్దని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఆయన ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తొలుత తాము మరింత గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఆ తర్వాత అసలు సినిమా చూపించారు. టీడీపీ ఎమ్మల్యేలు ఇష్టం వచ్చినట్లు అక్రమ మద్య వ్యాపారం చేసినా చూసిచూడనట్లు పోయారు. పైగా దీనిపై అసెంబ్లీలో ఒక నివేదిక పెట్టారు. అక్రమ మద్యాన్ని అరికట్టలేక పోతున్నామని ప్రకటించారు.
అలా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ తెలిపి కొందరి పేర్లు వెల్లడించడం సంచలనమైంది. తదుపరి మద్య నిషేధం ఉంచాలా ?వద్దా ? అన్నదానిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నిర్వహించారు. ఆ పిమ్మట మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. పైకి తనకు ఇష్టం లేకపోయినా మద్య వ్యాపారాన్ని అనుమతించాల్సి వస్తున్నట్లు పిక్చర్ ఇస్తారన్నమాట. అప్పట్లో మద్యం స్కామ్ లు జరిగాయని విపక్షం ఆరోపించేది. అది వేరే కథ. ఇంకో మాట చెప్పాలి. సంపూర్ణ మద్య నిషేధం చేయాల్సిందే అంటూ ఉద్యమం చేసిన ఈనాడు గ్రూప్ అదినేత రామోజీరావు మద్య నిషేధం ఎత్తివేసిన తర్వాత ఒక సంపాదకీయం రాసేసి చేతులు దులుపుకున్నారు.
అందులో కూడా చంద్రబాబును పెద్దగా తప్పు పట్టుకపోవడంపై రామోజీని పలువురు విమర్శించేవారు. రామోజీ ఫిలిం సిటీ, డాల్ఫిన్ హోటల్ తదితర వ్యాపారాలు కలిగిన ఈనాడు మీడియా కూడా చంద్రబాబు మాదిరే డబుల్ గేమ్ ఆడిందన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చేవి. అప్పటి మాదిరే ఇప్పుడు కూడా పర్మిట్ రూమ్‌లు, మద్యం షాపుల దందాను టీడీపీ మీడియా సమర్థిస్తున్న తీరు అసహ్యంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా తనకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డు పెట్టుకుని ఈ రకంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని పారించడం ప్రజల కోణంలో దుర్మార్గమే అవుతుంది.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత