యూరియా అమ్మకాలకు పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కాకినాడలో ధర్నా చేస్తున్న రైతులు
యూరియా కోసం సీజన్‌లో రైతన్నల అగచాట్లు
ఓటీపీలు రాక.. వేలిముద్రలు మ్యాచ్ కాక తిప్పలు
రోజుల తరబడి ఆర్‌ఎస్‌కేల వద్ద పడిగాపులు
బుకింగ్ కోసమే గంటల తరబడి నిరీక్షణ
కౌలు రైతుల పరిస్థితి దయనీయం
దేవదాయ, అసైన్డ్, వక్ఫ్ భూ సాగుదారులకు అగమ్యగోచరంగా ‘ఓటీపీ’.. ఏజెన్సీ, మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్యతో అందని ఎరువులు
ఎమ్మార్పీకి మించి డీలర్ల అమ్మకాలు..
కాడి పారేసి చోద్యం చూస్తున్న బాబు సర్కారు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వ్యయ ప్రయాసలు లేకుండా ఆర్బీకేల ద్వారా ఇంటి ముంగిటికే ఎరువులు
క్యూలైన్లలో నిల్చోవాల్సిన అగత్యం లేదు..
బ్లాక్ మార్కెట్ బెడద లేదు.. 34.11 లక్షల మంది రైతులకు 13.75 లక్షల టన్నుల ఎరువుల సరఫరా
లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా చార్జీల రూపంలో ప్రతి రైతుకు బస్తాకు రూ.20–30 చొప్పున ఆదా.. ఐదేళ్లలో అన్నదాతలకు మొత్తం రూ.వంద కోట్లకుపైగా ఆదా
ఓటీపీ.. ‘దైవాధీనం’!
మా గ్రామంలో దాదాపు 120 ఎకరాలకు పైగా దేవదాయ భూమిని 40 ఏళ్లుగా 150 మంది రైతులు సాగు చేస్తున్నారు. చాలా మందికి కౌలు కార్డులు లేవు. యూరియా కోసం వెళితే ఓటీపీ ఎవరి పేరిట వస్తుందో చెప్పలేకపోతున్నారు. ఆర్‌ఎస్‌కేకు వెళ్తే రెండ్రోజులు ఆగండి.. మాట్లాడి చెబుతాం అంటున్నారు.
–కలారి రామారావు, పెదకల్లేపల్లి, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా
సాక్షి, అమరావతి: వర్షాలు వచ్చేశాయ్.. సీజన్ మొదలైంది.. ఏరువాక వచ్చేస్తోంది.. కానీ దుక్కి దున్నాల్సిన రైతన్న దిక్కు తోచక దిక్కులు చూస్తున్నాడు. అదునులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి ఏరువాక సాగేలా రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు కాడి వదిలేసింది. ఎరువుల సరఫరా, వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు తెచ్చిన ‘యాప్’తో వ్యవసాయదారులు నానా అగచాట్లు పడుతున్నారు. యాప్ ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేయాలని అన్నదాతలు ఆందోళనలకు దిగుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా గ్రామంలోనే ఎరువులు, నాణ్యమైన విత్తనాలతోపాటు సాగు ఉత్పాదకాలను అందించి ఆదుకున్నారని రైతన్నలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు దూరమై.. ఇన్‌పుట్ సబ్సిడీ అందక.. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతుంటే.. చంద్రబాబు సర్కారు ఎరువుల పంపిణీ బాధ్యతను సైతం గాలికొదిలేసి యాప్‌ల పేరుతో తమను యాతనకు గురి చేస్తోందని మండిపడుతున్నారు.
సర్వర్ డౌన్.. యాప్ హ్యాంగ్
ఎరువుల పంపిణీని డిజిటలైజ్ చేసేందుకు జాతీయ సమీకృత ఎరువుల నిర్వహణ మాడ్యూల్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం) యాప్ ద్వారా కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎరువుల పంపిణీని చేపట్టగా.. మిగిలిన 26 జిల్లాల్లో ఏపీ వ్యవసాయ ఇన్‌పుట్స్ నిర్వహణ వ్యవస్థ (ఏఐఎంఎస్) యాప్ ద్వారా ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. యాప్‌ల వినియోగంపై నూటికి 90 శాతం మంది రైతన్నలకు అవగాహన లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రారంభించి 3 వారాలు గడుస్తున్నా యాప్‌లో సాంకేతిక, పరిపాలనా సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. రైతుల మొబైల్ నెట్‌వర్క్ అంతంత మాత్రంగా ఉండగా ఆర్‌ఎస్‌కేల్లో (రైతు సేవా కేంద్రాలు) సర్వర్ డౌన్/యాప్ హ్యాంగ్ సమస్యలతో రేపు రండి.. మాపు రండి అంటూ పంపేస్తున్నారు.
యాప్‌లో రైతు వివరాలు, ఈ–క్రాప్, వెబ్‌ల్యాండ్, ఆధార్, మొబైల్ నంబర్ అనుసంధానం కాకపోవడం, సకాలంలో ఓటీపీలు రాక, వేలిముద్రలు మ్యాచ్‌కాక తరచూ ఓటీపీలు, వేలిముద్రలు విఫలమవడం, బిల్లింగ్ ఆలస్యమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మొబైల్ ఓటీపీ, ఎంపిన్, ఫొటో, జియో ట్యాగింగ్, ఫీల్డ్ వెరిఫికేషన్ లాంటి దశలు రైతులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. సొంత భూమి ఉన్న రైతులకు రికార్డుల్లో చిన్న పొరపాటు ఉన్నా ఎరువుల కొనుగోలు ఆగిపోతోంది. ఫలితంగా కట్ట యూరియా కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
కౌలు రైతుల పాట్లు వర్ణనాతీతం
యాప్ ద్వారా ఎరువులు పొందేందుకు కౌలు రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సీసీఆర్సీ కార్డు, ఈక్రాప్ లింక్ కాకపోవడం, సరైన సాగు వివరాలు నమోదు కాకపోవడం, భూ యజమాని అనుమతి లేకపోవడం, రికార్డుల్లో భూ యజమాని పేరు సరిగ్గా లేకపోవడం, మ్యుటేషన్ కాకపోవడం, భూ రికార్డులలో మ్యాపింగ్ కాకపోవడం లాంటి సమస్యలు కౌలు రైతులను వేధిస్తున్నాయి. ఓటీపీలు భూ యజమానుల ఫోన్‌కు వస్తుండటం, వారు అందుబాటులో లేకపోవడం, ఓటీపీ అప్‌లోడ్‌కు కేవలం 30 సెకన్లు మాత్రమే సమయం ఉండడం పెద్ద సమస్యగా మారింది. దీంతో 2–3 సార్లు ఓటీపీ జనరేట్ అవుతున్నా సకాలంలో అప్‌లోడ్ చేయలేకపోవడంతో చివరికి బుకింగ్ రద్దై మళ్లీ మొదటి నుంచి రైతు వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది.
మరోవైపు రైతులు ఎంచుకున్న డీలర్ పాయింట్ల వద్ద భౌతికంగా ఎరువులు ఉన్నా యాప్‌లో స్టాక్ అప్‌డేట్ కాకపోవడంతో ‘నో స్టాక్’ అని బుకింగ్ సమయంలో వస్తోంది. మొబైల్ నెట్‌వర్క్ పెద్దగా లేని ఏజెన్సీ, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ కత్తిమీద సాములా తయారైంది. సర్వర్ డౌన్ అయింది.. తరువాత రండి అంటూ తిప్పి పంపేస్తున్నారు. దేవదాయ, అటవీ, వక్ఫ్, అసైన్డ్, సొసైటీ లంక భూములు సాగుచేసే రైతులైతే బుకింగ్ కోసం అల్లాడుతున్నారు. ఎవరి పేరిట ఓటీపీ జనరేట్ అవుతోందో అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఎమ్మార్పీకి మించి అమ్మకాలు
కొంతమంది డీలర్లు అధికారులతో కుమ్మక్కై దొడ్డిదారిన యూరియా బస్తా రూ.350 నుంచి రూ.500, డీఏపీ రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు, జీ.సిగడం మండలాల్లో పలువురు డీలర్లు గురువారం రోజు ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరపడమే కాదు.. రసీదులు అడిగితే రైతులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లా కొడమూరు మండలం రాజుపాలెంలో సుమారు 50 మంది రైతులు స్థానిక ఆర్‌ఎస్‌కేకు వెళ్తే సర్వర్ డౌన్ అనే సాకుతో తిప్పి పంపేశారు.
తంటాలు పడి ఎరువులు బుక్ చేసుకున్నా మాగాణి, మెట్ట ప్రాంతాలు, పంట రకాలతో సంబంధం లేకుండా ఎకరాకు యూరియా, డీఏపీ రెండు బస్తాలకు మించి ఇవ్వడం లేదు. ఏ పంటకు, ఏ దశలో, ఏ ఎరువు ఎంత మోతాదులో అవసరమవుతుందో పంటల వారీగా అంచనా వివరాలను యాప్‌లో పొందుపరిచారు. అంతకు మించి ఒక్క బస్తా కూడా అదనంగా సరఫరా చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. నాట్లు వేసిన 15–20 రోజుల్లో యూరియా అవసరం. కానీ అదునుకు యూరియా దొరకని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఈ దురవస్థ ఏమిటని వాపోతున్నారు.
కాంప్లెక్స్ ఎరువుల మోత.. రైతన్నలకు వాత
కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులకు పెనుభారంగా మారుతున్నాయి. 2023–24 సీజన్‌తో పోలిస్తే బస్తాపై రూ.750కి పైగా పెరిగాయి. సూక్ష్మసేద్యంలో వినియోగించే డ్రిప్ ఎరువుల ధరలు గతేడాది 25–50 శాతం మేర పెరిగాయి. ముడిసరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో ఈ ఏడాది మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. దీనివల్ల సీజన్‌లో కనీసం రూ.700 కోట్లకు పైగా రైతులపై అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
నాడు.. ఇంటికే ఎరువులు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య రైతన్నలకు వ్యయప్రయాసలు లేకుండా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఎరువులు సరఫరా చేసింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆర్బీకేల ద్వారా ఎరువుల అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో 10,611 ఆర్బీకేలకు లైసెన్సులు జారీ చేసింది. పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు కంపెనీల నుంచే నేరుగా ఆర్బీకేలకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా 34.11 లక్షల మంది రైతులకు 13.75 లక్షల టన్నుల ఎరువులను గ్రామం పొలిమేర దాటాల్సిన అవసరం లేకుండా ఇంటి ముంగిటికే సరఫరా చేసింది. ఫలితంగా లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా చార్జీల రూపంలో ప్రతి రైతుకు బస్తాకు రూ.20–30 చొప్పున ఆదా అయ్యింది. ఇలా ఐదేళ్లలో అన్నదాతలకు మొత్తం రూ.వంద కోట్లకుపైగా ఆదా జరిగింది. అన్నిటికి మించి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అగత్యం తప్పింది. బ్లాక్ మార్కెట్ బెడద లేకుండా పోయింది. అలాంటిది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పొలం పనులు వదిలేసి మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు యాప్‌ల పేరుతో వారిని ముప్పుతిప్పలు పెడుతోంది.
తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది
కంపెనీలు, డీలర్ల స్థాయిలో జరిగే ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టకుండా రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోంది. ఎరువులు దొరకడం లేదని కౌలు రైతులు సాగు చేయడం మానేస్తే లక్షలాది ఎకరాలు బీడు వారతాయి. యాప్ విధానం వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃసమీక్షించి భూమి సాగు చేసే వారికి డిమాండ్ మేరకు ఎరువులు సరఫరా చేయాలి.
– ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్
తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవం
కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌సహా ముఖ్యమంత్రుల హాజరు
సాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యామ్‌కు నూతనంగా అమర్చిన 33 గేట్ల ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌సహా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సమీపంలోని మునీరాబాద్‌లో జరిగిన సభలో కేంద్ర మంత్రి పాటిల్ మాట్లాడుతూ పేరుకుపోయిన పూడికను తొలగిస్తే డ్యామ్‌లో 30 శాతం నీటి నిలువ పెరుగుతుందని తెలిపారు. పూడిక తొలగింపునకు సాంకేతిక సహకారాన్ని కేంద్రం అందిస్తుందని పేర్కొన్న ఆయన, ఇక తదుపరి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అంగీకరించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. నదుల అనుసంధానం జరగాలన్న కేంద్రం సంకల్పానికి ఇది మరింత బలం చేకూరుస్తుందన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో నదుల అనుసంధానం విజయవంతం అవుతుందన్న విశ్వాసం ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం గేట్లను పునరుద్ధరించడం లక్షలాది మంది రైతుల కన్నీరు తుడిచే గొప్ప పరిష్కారంగా అభివర్ణించారు. ఇది మూడు తరాల సమస్యకు పరిష్కారమని అన్నారు. మూడు రాష్ట్రాల రాష్ట్ర రైతుల హితం కోసం తుంగభద్ర డ్యామ్‌లో నీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పరస్పరం పొగడ్తల వర్షం!!
చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకోవడం వారిద్దరి మధ్య గురుశిష్యుల బంధాన్ని మరోసారి బయటపెట్టింది. ‘రేవంత్ రెడ్డి నా శిష్యుడు. డ్యాషింగ్, డైనమిక్ సీఎం. అన్ని విషయాలపై తరచూ చర్చించుకుంటాం. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయం. రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజీ పడరు. చురుకైన నాయకుడు’ అని చంద్రబాబు పొగిడితే, ‘చంద్రబాబు నాయుడు రాజకీయంగా నాకు గురువు. పాలనలో ఆయన అనుభవం, దేశానికి ఆదర్శం. సాంకేతిక పరిపాలనలో చంద్రబాబు మార్పులు తెచ్చారు. ఆయన దూరదృష్టి దేశానికి ఆదర్శం. రాజకీయ జీవితంలో చంద్రబాబు నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, డీకేలు కూడా ఒకరికొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు.


