దూరవిద్యను దూరంచేద్దాం.. ఆర్థికంగా దెబ్బతీద్దాం | Chandrababu Govt Conspiracy on Andhra University | Sakshi
Sakshi News home page

దూరవిద్యను దూరంచేద్దాం.. ఆర్థికంగా దెబ్బతీద్దాం

Jun 22 2026 5:24 AM | Updated on Jun 22 2026 5:24 AM

Chandrababu Govt Conspiracy on Andhra University

ఆంధ్ర విశ్వవిద్యాలయంపై చంద్రబాబు సర్కార్‌ కుట్ర 

దూరవిద్యలో ఒక్కో విభాగాన్ని క్రమంగా  తొలగిస్తున్న వర్సిటీ

రెండేళ్లుగా దూరవిద్య పరీక్షల నిర్వహణలో ఘోర వైఫల్యం 

యూజీసీ, డెబ్‌ నిబంధనలకు పాతరేస్తూ కోర్సుల నిర్వహణ 

ఇదే కొసాగిస్తే త్వరలో అనుమతులు రద్దయి దూరవిద్య మూతపడే అవకాశం 

తద్వారా ఏయూ మొత్తాన్ని నిర్వీర్యంచేసే  పన్నాగం 

ముఖ్యనేత బంధువు కార్పొరేట్‌ సంస్థ ప్రయోజనాలే లక్ష్యం 

ఈ దిశగా పాలకులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విమర్శలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యా వ్యవస్థకు తలమానికంగా, మార్గదర్శిగా ఉన్నత విలువలతో నడయాడిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని (ఏయూ) చాపకింద నీరులా ప్రభుత్వం కబళించే కుటిల తంత్రం పన్నుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి నేతల కుట్రలు, వర్సిటీ పాలకుల అసమర్థత కలసి వందేళ్ల చరిత్ర కలిగిన మహోన్నత విద్యా నిలయం వైభవాన్ని కోల్పోతోందని వర్సిటీ వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. 

ఇందులో భాగంగా  ఏయూ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దూరవిద్య (సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌–సీడీఓఈ) కేంద్రాన్ని తొలుత కూకటి వేళ్లతో సహా పెకలించి ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి.  విశాఖ సాగర తీరంలోని ముఖ్యనేత బంధువుకు చెందిన ఓ బడా కార్పొరేట్‌ సంస్థకు ఆర్థికంగా మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం ఏయూను బలిపశువును చేస్తోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.  ఇందులో భాగంగా ఏయూ దూరవిద్య విభాగంలో ఒక్కొక్కటిగా విభాగాలను తొలగిస్తున్నారని,  కొన్ని కోర్సులకు మంగళం పాడేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా వర్గాల సమాచారం ప్రకారం  ఏయూ దూరవిద్య కుంటుపడటానికి చేస్తున్న కుతంత్రాలను పరిశీలిస్తే.. 

అసమర్థ వైస్‌ చాన్సలర్, దూరవిద్య డైరెక్టర్‌ 
జాతీయ విద్యా సంస్థల నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని వీసీగా పెట్టుకుని దూరవిద్యను నాశనం చేసేందుకు ప్రభుత్వం పాచికలు వేస్తోంది. సదరు వీసీ అసమర్థ చేష్టలతో దూరవిద్య భ్రష్టు పట్టింది. ఇక యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) నిబంధనలకు అనుగుణంగా హ్యుమనిటీస్‌ కోర్సుల బ్యాక్‌గ్రౌండ్‌ కలిగిన వ్యక్తులను దూరవిద్య కేంద్రం డైరెక్టర్లుగా నియమించాలని,  అయితే ఏయూలో మాత్రం ఒక ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ (కెమికల్‌ ఇంజనీరింగ్‌)కు రెండోసారి కూడా డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించడం దారుణమని వర్సిటీ వర్గాలు భగ్గుమంటున్నాయి.

పైగా సదరు వ్యక్తికి దూరవిద్య డైరెక్టర్‌తో పాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌గా.. రెండు పోస్టులు కట్టబెట్టడంలో మతలబు ఏమిటని నిలదీస్తున్నాయి.  కేవలం దూర విద్యను దివాళా తీయించేందుకే సదరు వ్యక్తిని తీసుకొచ్చి డైరెక్టర్‌గా కూర్చోబెట్టారని.. ఫలితంగా పాలకుల ఆదేశాలతో దూరవిద్య విభాగాలను విధ్వంసం చేస్తున్నట్టు మండిపడుతున్నాయి. పైగా సదరు ప్రొఫెసర్‌ తన పేరుతో దూరవిద్యలో ఒకలా సంతకాలు చేస్తూ, అడ్మిషన్‌ డైరెక్టర్‌గా మరోలా సంతకం చేస్తున్నట్టు వినికిడి. ఇలా ఒక వ్యక్తి ఒకే వర్సిటీలో రెండు పోస్టుల్లో కొనసాగుతూ రెండు వేర్వేరు రకాలుగా సంతకాలు చేస్తుండటంపైనా విమర్శలున్నాయి. దూరవిద్య కుదేలవడానికి సదరు డైరెక్టర్‌ చేయాల్సిందంతా చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

పరీక్ష కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ 
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏయూ దూరవిద్య పరీక్షల నిర్వహణలో గతేడాది అపఖ్యాతి మూటగట్టుకుంది. పరీక్ష కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా ప్రశ్నాపత్రాల రూపకల్పనలో బయటి వ్యక్తుల ప్రమేయాన్ని జొప్పించడంతో పాటు సకాలంలో పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు పంపడంలో విఫలమైంది. చివరికి పరీక్ష ప్రారంభానికి ముందు వాట్సాప్, ఈ–మెయిల్‌ ద్వారా పంపించి వాటిని ప్రింట్లు తీసి విద్యార్థులకు పంపిణీ చేసిన దుస్థితిలో పరీక్షలు నిర్వహించింది. ఇక దూరవిద్యలో ప్రత్యేకంగా ఉండే ప్రశ్నాపత్రాల తయారు చేసే కాని్ఫడెన్షియల్‌ సెక్షన్‌ను తొలగించి రెగ్యులర్‌ వర్సిటీ విభాగంలో కలిపేశారు.  ఎగ్జామినేషన్‌ సెంటర్లతో నేరుగా సంప్రదింపులు చేసి ముడుపులు చెల్లిస్తే ప్రాక్టికల్స్‌ చేయకపోయినా మార్కులు వేసేస్తున్న దుస్థితికి 
శ్రీకారం చుట్టారు. 

వార్షికంగా ఒకటే నోటిఫికేషన్‌ 
ఏటా రెండు సార్లు  అడ్మిషన్ల నోటిఫికేషన్‌లు (అకడమిక్, క్యాలెండర్‌ ఇయర్‌) ఇవ్వాల్సి ఉండగా ఒక్కసారి మాత్రమే ఇవ్వడంతో ఏకంగా రూ.40 కోట్లకుపైగా వర్సిటీ ఖజానాకు గండిపడింది. పైగా ఆన్‌లైన్‌లో కోర్సులు నిర్వర్తించే ప్రైవేటు ఏజెన్సీలతో కుమ్మకై వర్సిటీ ఖజానాను దెబ్బతీయడంతో పాటు పేద విద్యార్థులతో వేల రూపాయల ఫీజులు కట్టేలా పరోక్ష చర్యలు తీసుకుంది. ఆన్‌లైన్‌ కోర్సుల ఫీజులు సాధారణ దూరవిద్య కోర్సు కంటే రెట్టింపు ఉండటం గమనార్హం. మరోవైపు అర్ధశతాబ్దం నుంచి కొనసాగిన స్టడీ సెంటర్స్‌ (సపోర్టు సెంటర్లు) లను మూసివేశారు. ఫలితంగా పరీక్ష నిర్వహణ గాడితప్పింది.  

ఆర్థిక విభాగాన్ని లేపేశారు  
సాధారణంగా బిల్లుల మంజూరులో ఆయా సబ్జెక్టు విభాగానికి చెందిన కో–ఆర్డినేటర్లు స్రూ్కటినీ చేసిన తర్వాత  అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌(ఏఆర్‌), డిప్యూటీ రిజి్రస్టార్‌(డీఆర్‌) ధ్రువీకరిస్తే చివరికి డైరెక్టర్‌ బిల్లులను క్లియర్‌ చేస్తూ సంతకం పెడతారు. అయితే, అకౌంట్స్‌ విభాగాన్ని లేపేసి డైరెక్టర్‌ దూరవిద్య ఏఆర్, డీఆర్‌లతో కలిసి స్క్రూటినీని గాలికొదిలేసి విచ్చలవిడిగా సంతకాలు చేసి కోట్లాది రూపాయిల బిల్లులను ఇచ్చేస్తూ కమిషన్లు దండుకుంటున్నట్టు వర్సిటీలోనే బహిరంగంగా వినిపిస్తోంది. పైగా సదరు ఏఆర్, డీఆర్‌లను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా దూరవిద్యకు పంపిస్తే ఇక్కడ డైరెక్టర్‌తో కలిసి ఖజానాకు గండికొడుతున్నట్టు సమాచారం.  

జీరో ఫ్యాకల్టీ కుతంత్రాలు 
ప్రత్యక్ష తరగతుల ద్వారానే కాకుండా దూరవిద్యలోనూ కోట్లాది మందికి వారి సామర్థ్యాలకు తగ్గట్టుగా డిగ్రీలు అందించి సమాజంలో ఉన్నత విద్యా వంతులుగా, దేశ సేవకులుగా వారిని ఏయూ తీర్చిదిద్దింది.  సాంప్రదాయ విద్యతో సమానంగా మన్ననలు పొందుతోంది. యూజీసీ, డెబ్‌ నిబంధనలను అనుసరిస్తూ ఫ్యాకలీ్ట, విభాగాల నిర్వహణతోనే అనుమతులు తెచ్చుకుంటుంది. కానీ, కూటమి పాలకులు ఏయూను దెబ్బతీసేందుకు దూరవిద్యలో యూజీ, డెబ్‌ నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్‌ వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఫ్యాకల్టీ లేకుంటే దూరవిద్య నిర్వహణకు డెబ్‌ అనుమతించదు. దానికి తగ్గట్టు స్టడీ సెంటర్లు కూడా కొనసాగించాలి. కనీసం విద్యార్థికి 10–20 రోజులైనా తరగతులు నిర్వహించాలి. ఇలాంటి నిబంధనలను గాలికొదిలేసిన డైరెక్టర్‌ ఫ్యాకల్టీ అందర్నీ వివిధ డిపార్ట్‌మెంట్లకు పంపించేయడంతో దూరవిద్యను జీరో ఫ్యాకల్టీ చేసి.. పూర్తిగా మూసివేసేలా పథకం పన్నినట్టు వర్సిటీ కోడైకూస్తోంది. అందుకే ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన వర్సిటీ పోస్టుల నోటిఫికేషన్‌లో దూరవిద్యలో ఒక్క పోస్టు కూడా లేకపోవడం నిదర్శనం. ఇలా నిబంధనలను అనుసరించకుండా దూరవిద్యను కొనసాగిస్తే ఎవరైనా డెబ్‌కు, యూజీసీకి ఫిర్యాదు చేస్తే అనుమతులు రద్దు చేస్తారని, ఇదే కూటమి ప్రభుత్వం కోరుకుంటోందని వర్సిటీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement