ప్రచారం ఘనం.. చిత్తశుద్ధి శూన్యం | Chandrababu government is rushing in the name of Yoga Andhra | Sakshi
Sakshi News home page

ప్రచారం ఘనం.. చిత్తశుద్ధి శూన్యం

Jun 16 2025 3:50 AM | Updated on Jun 16 2025 3:50 AM

Chandrababu government is rushing in the name of Yoga Andhra

యోగాంధ్ర పేరిట బాబు ప్రభుత్వం హడావుడి 

2కోట్ల మంది రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నారంటూ గొప్పలు 

ప్రజల అనుమతి లేకుండానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌లు

సాక్షి, అమరావతి: గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారుండరు. ఏ ప్రభుత్వ కార్యక్రమం, పథకమైనా సరే ఆయన చేసే ప్రచారానికి, అమలుకు ఏమా­త్రం పొంతన ఉండదు. విజయవాడ వరదల సమయంలో డ్రోన్‌లతో బాధితులకు ఆహారం అందించినట్టు ఏఐ ఫొటోలు సృష్టించి ప్రజలను బురిడీ కొట్టించిన ఘటనే ఇందుకు నిదర్శనం. అదే తరహాలో రూ.కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి యోగా­ంధ్ర పేరిట ప్రజలను మభ్య పెట్టే మరో కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలకు బాబు పిలుపునిచ్చారు. ప్రతి గడపకు సిబ్బంది వెళ్లి యోగాపై అవగాహన కల్పిస్తున్నారని, ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటున్నారని వెల్లడించారు. 2 కోట్ల రిజిస్ట్రేషన్‌లు లక్ష్యం కాగా, ఇప్పటికే లక్ష్యాన్ని దాటి 3 కోట్ల దిశగా కొనసాగుతున్నట్టు ఇటీవలే వైద్య శాఖ ప్రకటించింది. కానీ వాస్తవాలను పరిశీలిస్తే..   

రికార్డుల కోసం అడ్డదారులు.. 
రెండు కోట్ల రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేసి, 21వ తేదీన వారందరితో యోగా చేయించినట్టు రికార్డు సృష్టించడం కోసం ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. కార్యాలయాల్లో కూర్చొని ప్రజలకు సమాచా­రం ఇవ్వకుండా, ఆమోదం తీసుకోకుండానే యోగా­ంధ్రలో ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. 

యోగా అంటే ఏంటో కూడా తెలియని రెండు, మూడేళ్ల చిన్నారులు, కదల్లేని స్థితిలో ఉండే వృద్ధుల పేరిట రిజిస్ట్రేషన్‌లను ప్రభుత్వ యంత్రాంగం చేపడుతోంది. దీంతో ఆ వ్యక్తుల పేరిట ఐడీ, క్యూఆర్‌ కోడ్‌ జనరేట్‌ అవుతున్నాయి. ‘యోగాంధ్ర–2025లో పాల్గొనాలన్న ఆసక్తికి హృదయపూర్వక అభినందనలు’ అంటూ ప్రజలకు వాట్సప్‌లో సందేశాలొస్తున్నాయి. దీంతో మేమెప్పుడు  నమో దు చేసుకున్నామని జనం ఆశ్చర్యపోతున్నారు. 

కాకి లెక్కలతో ‘అవినీతి’ ఆసనాలు 
రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నవారందరూ యోగా కార్య­క్ర­మంలో రాష్ట్రవ్యాప్తంగా పాల్గొంటారని, వారికి టీ షర్ట్స్, మ్యాట్స్, వసతుల కల్పన పేరిట రూ.­కోట్లలో ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయి­ంచారు. రాష్ట్రస్థాయి బడ్జెట్‌తో కలుపుకుని రూ.30 కోట్లపైనే ఖర్చు చేస్తున్నారు. కాకిలెక్కల రిజిస్ట్రేషన్లను చూపి, అందరూ యోగాకు హాజరైనట్టు చిత్రీకరించాలని ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో సౌక­ర్యాల కల్పన పేరిట ప్రభుత్వ పెద్దలు అవినీతి ఆసనాలు వేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement