డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేసిన చంద్రబాబు | Chandrababu cheated Dwakra womens | Sakshi
Sakshi News home page

డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేసిన చంద్రబాబు

Jun 30 2026 4:33 AM | Updated on Jun 30 2026 4:36 AM

Chandrababu cheated Dwakra womens

వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతామన్న హామీని అమలుచేయలేదు 

వడ్డీ రాయితీ కోసం ఒక్క రూపాయి ఇవ్వలేదు 

ఇది మహిళలను మోసం చేయడం కాదా? 

వైఎస్‌ జగన్‌ చెప్పిన ఈ విషయాలన్నీ వాస్తవాలే.. ఇందులో పక్కదారి పట్టించడానికి ఏముంది? 

సీఎం చంద్రబాబును నిలదీసిన ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 

సాక్షి, అమరావతి: టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి.. ఓట్లు వేయించుకుని.. ఆ హామీని అమలు చేయకుండా రాష్ట్రంలోని మహిళలను మోసం చేశారన్నది నిజం కాదా? అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నిలదీశారు. ఇదే అంశంపై వైఎస్‌ జగన్‌ లేవనెత్తిన అంశాల్లో ఏ ఒక్కదానిపైనైనా చర్చించడానికి, వైఎస్‌ జగన్‌ చెప్పిన లెక్కలు తప్పు అని చెప్పడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ సోమవారం ఒక ప్రకటనలో సవాల్‌ విసిరారు. ఆ ప్రకటనలో బుగ్గన ఏమన్నారంటే..  

తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభు­త్వం ఎలాంటి అబద్ధాలయినా చెబుతుంది, ఎలాంటి మోసాలైనా చేస్తుందనడానికి మరో ఉదాహరణ ఇది. స్వయం సహాయక సంఘాల్లోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ రాయితీ గురించి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా గట్టిగా నిలబడాలంటే వాటికి ఇచ్చే వడ్డీ రాయితీ అత్యంత కీలకమని అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అదే దిశగా వడ్డీ రాయితీ కోసం రూ.4,969 కోట్లు ఖ­ర్చు చేసిందని ఆయన ఆ పోస్టులో తెలిపారు. అలాగే ఆసరా కా­­ర్యక్రమం కింద భారీగా రూ.25,571 కోట్లు, చేయూ­త కింద రూ.19,189 కోట్లు లబ్దిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారని, మహిళలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చిన మరెన్నో కార్యక్రమాలను అమలు చేసి, స్వయం సహాయక సంఘాలతో పాటు మహిళలను ఆర్థికంగా బలోపే­తం చేశామని ఆయన అందులో పేర్కొన్నా రు. ఇవన్నీ వాస్తవ విషయాలు. ఇందులో ప్రజలను తప్పుదారి పట్టించడం ఎక్కడుంది? వైఎస్‌ జగన్‌ లేవనెత్తిన అంశాల్లో ఏ ఒక్కదానిపైనైనా చర్చించడానికి, ఆ లెక్కలు తప్పు అని చెప్పడానికి మీ ప్రభు­త్వం సిద్ధంగా ఉందా అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. 

» టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో ‘స్వయం సహాయక సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ పథకం వర్తించే రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి, ఆ హామీ ఆధారంగా ఓట్లు పొందారన్నది వాస్తవం కాదా? ఆ హామీ ఎందుకు అమలు చేయలేదు?

» 2024–25, 2025–26 సంవత్సరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా, మహిళలను మోసం చేశారన్నది నిజం కాదా?

» 2024–25, 2025–26 సంవత్సరాల్లో స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి తగ్గుకుంటూ వచ్చిందన్నది నిజం కాదా? 

» 2025–26లో రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయాలు ప్రతికూల వృద్ధిని.. అంటే –3.22% వృద్ధిని నమోదు చేశాయన్నది నిజం కాదా? వైఎస్‌ జగన్‌ లేవనెత్తిన అంశాలు ఇవే. కనీసం వీటికి అయినా ప్రభుత్వం సమాధానం ఇచ్చిందా? వీటికి సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడం ద్వారా, ఈ ఆరోపణలు నిజమేనని మీ ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టు కాదా? ఇవి వాస్తవాలని అంగీకరిస్తున్న పక్షంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉందంటూ గణాంకాలు చెప్తున్న నేపథ్యంలో మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటారా?’   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement