తొలి నుంచీ నమ్మించి దగా
2014 ఎన్నికల్లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బుట్టదాఖలు.. వంద ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని శఠగోపం
2014 హామీలు అమలు చేయలేదు.. 2024 ఎన్నికల్లోనూ అదే మోసం
మళ్లీ బీసీ డిక్లరేషన్‌లో 50 ఏళ్లకే పింఛన్ పేరుతో వంచన
బీసీ రక్షణ చట్టం రెండేళ్లుగా సాగదీత
బీసీ సబ్‌ప్లాన్‌తో ఐదేళ్లకు రూ.లక్షన్నర కోట్లు అంటూ గొప్పలు
స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్ హామీకీ తూట్లు
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా ఉంటానంటూ ఎన్నికల ముందు నమ్మబలికి అధికారంలోకి రాగానే హామీలు అమలు చేయకుండా వారి వెన్నువిరిచేలా వ్యవహరించడం చంద్రబాబు నైజం. తొలి నుంచీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ టీడీపీ బీసీల పార్టీ అంటూ వారిని భ్రమల్లో ముంచి అధికారంలోకి వచ్చాక దగా చేయడం బాబుకు అలవాటు.
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబుకు బీసీల జీవితాలను మెరుగు పరిచేలా చేసిన ఒక్క పనీ చెప్పుకోవడానికి లేదు. గతంలో కత్తెరలు, మిషన్లు వంటి పనిముట్లు అరకొరగా ఇచ్చే ఆదరణ పథకం తప్ప.. బీసీల ఉన్నతికి ఉపయోగపడే ఒక్క చర్య కూడా బాబు తీసుకోలేదు. పైగా హామీల గురించి ప్రశ్నించిన వెనుకబడిన వర్గాలను ఏం తమాషాలు చేస్తున్నారా.. పిచ్చాటలు ఆడారంటే మీ తోకలు కత్తిరిస్తా.. మీ తాట తీస్తా.. అంటూ అవమానకరంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది.
బీసీ డిక్లరేషన్.. అదే మోసం రిపీట్..
2014 ఎన్నికల ముందు 2012 జూలై 12న బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బీసీలను దారుణంగా దగా చేశారు. 19 ప్రధాన హామీలతోపాటు చేతి వృత్తులు, కులాల వారీగామొత్తం 119 హామీలిచ్చిన చంద్రబాబు 2014 నుంచి ఐదేళ్లపాటు అధికారం అనుభవించి ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదన్నది వాస్తవం. డిక్లరేషన్ అమలు అంటూ ఏకంగా 56 కమిటీలు వేసి కాలయాపన చేశారన్నది జగమెరిగిన సత్యం.
కత్తెరలు, ఇస్త్రీ పెట్టేలు ఇచ్చి అదే ఆదరణ అంటూ డబ్బాలు కొట్టుకున్నారు. బీసీలకు వంద ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని 2012 బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన చంద్రబాబు 2014లో సగం సీట్లూ ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో కేవలం 43 సీట్లతో సరిపెట్టారు. 2024లోనూ బీసీ డిక్లరేషన్ పేరుతో నయవంచన చేశారు. ఆ ఎన్నికల్లోనూ బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వలేదు. 2024 డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకూ తిలోదకాలు ఇచ్చారు. రెండేళ్ల పదవీకాలం పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీ ఒక్కటీ నెరవేర్చలేదు.
బీసీ సబ్‌ప్లాన్.. నిధుల కేటాయింపులో చీటింగ్..
బీసీలకు సబ్‌ప్లాన్ పెట్టి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామంటూ 2014, 2024 ఎన్నికల్లో హామీలు ఇచ్చిన చంద్రబాబు దగా చేశారు. 2014 ఎన్నికల్లో ఏడాదికి రూ.10వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50వేల కోట్లు కేటాయిస్తానని చెప్పి అందులో సగం నిధులూ కేటాయించలేదు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామనే హామీ ఇచ్చి గత రెండేళ్ల కాలంలో బడ్జెట్‌ల్లో బీసీ సంక్షేమంలో రూ.11,426 కోట్లు కోత పెట్టి దగా చేశారు. అంటే 2024–25లో రూ.18,593.45కోట్లు కేటాయించి రూ.15,400.88 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.23,256.79కోట్లు కేటాయించి రూ.15,023.37 మాత్రమే ఖర్చు చేశారు.
కురుబలకు గొర్రెలు లేవు.. చేనేతకు జీఎస్టీ రాలేదు..
రాష్ట్రంలో వృత్తిదారులనూ చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. యాదవ, కురుబలకు అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్‌లకు బీమా సౌకర్యం రెండేళ్లుగా మాటలకే పరిమితమైంది. చేనేతకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ రాలేదు. రాష్ట్రంలో చేనేతకు ఉచిత విద్యుత్ పథకంలో నెలకు హ్యాండ్లూమ్స్‌కు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500యూనిట్లు ఉచితం అనేది దాదాపు రెండేళ్ల తర్వాత ఏప్రిల్ నుంచి అమలులోకి తెచ్చారు. అదీ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన 1,03,534 అర్హుల్లో 57,247మందికే పరిమితం చేయడం దుర్మార్గం.
వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్, రాయల్టీ , సీనరీ చార్జీల్లో మినహాయింపు ఉత్తర్వులకే పరిమితం కావడంతో రాష్ట్రంలో అమలుకావడంలేదు. రజకులకు దోబీ ఘాట్ల నిర్మాణంలేదు, స్వర్ణకారులకు అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మత్స్యకారులకు ఆర్థిక సాయం అంతంతమాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మే 18న 1,52,248 మంది మత్స్యకారులను అర్హులుగా ప్రకటించి మే 19న 1,30,796 మందికి రూ.20వేలు చొప్పున విడుదల చేసినట్టు ప్రకటించారు.
అంటే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలోనే రకరకాల సాకులు చూపి 21,452 మందికి మత్స్యకార భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. నాయీబ్రాహ్మణులకు ఆలయాల్లో నెలకు రూ.25వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు ఆదాయం తగ్గితే మిగిలిన మొత్తం ఆ ఆలయాల నుంచి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసి చేతులుదులుపుకున్నారు. గీతకార్మికులకు కేటాయించిన పది శాతం మద్యం షాపులనూ అధికార పక్షానికి చెందిన బినామీలే దక్కించుకుని దగా చేశారు.
బీసీ రిజర్వేషన్లపై దొంగాట..
రిజర్వేషన్ల విషయమై గత ఎన్నికల్లో బీసీలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందిన చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అదే విషయమై దొంగాట ఆడుతున్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రచార్భాటం చేసుకోవడం మినహా ఆ దిశగా చేసిన ప్రయత్నాలు లేవు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, పట్టణ అభివద్ధి సంస్థలు, మార్కెటింగ్ కమిటీలు తదితర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోను, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, పాలక మండళ్లలో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు హామీ ఆచరణకు నోచుకోకపోవడంతో బీసీల పట్ల ఆయనకు కించిత్ చిత్తశుద్ధి కూడా లేదని తేటతెల్లమవుతోంది.
బీసీలకు వైఎస్ జగన్ పెద్దపీట
పదవుల్లో సామాజిక న్యాయం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఫిబ్రవరి 15న ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసి చూపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదని.. వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్ది చూపించారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చేయి పట్టుకుని ముందుకు నడిపించి సరికొత్త చరిత్రను సృష్టించారు. సామాజిక న్యాయం అమలులో దేశానికే దిక్సూచిగా నిలిచారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో టీడీపీ నాయకుడితో కేసు వేయించి చంద్రబాబు ద్రోహం చేస్తే.. అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన వైఎస్ జగన్ బీసీల పక్షపాతిగా మన్ననలు అందుకున్నారు.అప్పటి వరకు ఓసీలకే పరిమితం అనుకున్న మైలవరం ఎమ్మెల్యే, నరసారావుపేట ఎంపీ సీట్లు సైతం 2024 ఎన్నికల్లో బీసీలకు కేటాయించి సామాజిక విప్లవానికి సరికొత్త భాష్యం చెప్పారు.
ఓసీ మహిళకు రిజర్వ్ అయిన విజయవాడ నగర మేయర్ పదవిని రాయన భాగ్యలక్ష్మికి, కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని ఉప్పాల హారికకు ఇచ్చి బీసీ మహిళలకు గొప్ప అవకాశాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కింది. బీసీలకు అసెంబ్లీ స్పీకర్, ఉపముఖ్యమంత్రి పదవులతోపాటు 11 మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఇచ్చారు. 38 మంది ఎమ్మెల్సీల్లో 18 బీసీలకే ఇచ్చారు. 9మంది నగర మేయర్లతోపాటు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో దాదాపు 70శాతం వరకు బీసీలకే అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారు.
50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు
దేశంలోనే మొదటిసారిగా చట్టం చేసి మరీ 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు బీసీలకు వైఎస్ జగన్ కట్టబెట్టారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతోపాటు డైరెక్టరేట్‌ని ఏర్పాటు చేశారు. ఆర్థిక సహకార సంస్థనూ ఏర్పాటు చేశారు. 139 కులాలకు 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి వారి ఉన్నతికి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు.
బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. జన గణనలో కుల గణన కోసం జాతీయ స్థాయిలో బీసీ సంఘాలు ఉద్యమించినా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కింది. ఆ తర్వాత కేంద్రం అందుకు సానుకూల నిర్ణయాన్నీ ప్రకటించడం గమనార్హం. ఎవరూ అడగకుండానే ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని తెచ్చి బీమా వర్తింపజేయడం ద్వారా కల్లు గీత కార్మికులకు వైఎస్ జగన్ నిజమైన భరోసా అందించారు.
చేనేత కార్మికుల పెన్షన్ రూ.వెయ్యి చేస్తానని చివర్లో లబ్దిదారులను కుదించి బాబు మోసం చేస్తే.. జగన్ మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేతన్న నేస్తంతో ఏటా రూ.24వేలు సాయంతోపాటు పెన్షన్ వయో పరిమితిని కుదించి అర్హులైన చేనేతలందరికీ న్యాయం చేశారు. నవరత్నాలతో బీసీలకు డీబీటీ ద్వారా రూ.1,22,451.82 కోట్లు, నాన్–డీబీటీ ద్వారా రూ.50,657.39కోట్లు మొత్తం (డీబీటీ, నాన్–డీబీటీ) రూ.1,73,109.21కోట్లు అందించి జగన్ బీసీ సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టించారు.
50 ఏళ్లకే పింఛన్ వంచన.. ఆదరణ ఆర్భాటంతో సరి..
బీసీలకు 50ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ రెండేళ్లుగా అమలుకు నోచుకోలేదు. బీసీ రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లకు ముసాయిదా రూపొందించినట్టు ప్రకటించి సరిపెట్టారు. అది పూర్తిస్థాయిలో చట్టం రూపంలో ఎప్పటికి వస్తుందన్నది అనుమానమే. రూ.5వేల కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామన్న హామీ రెండేళ్లుగా సమీక్షలతోనే సరిపోయింది. ఆచరణలో కాలయాపన చేయడంతో బీసీ వృత్తిదారులను నుంచి తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది.
స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్, తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం వంటి హామీలు ప్రకటనతో సరిపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. దామాషా ప్రకారం కార్పొరేషన్‌లకు నిధులు కేటాయింపులు లేవు. స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10వేల కోట్లు వ్యయం మేనిఫెస్టోకే పరిమితమైంది.
ఆదరణ లేదు.. ఆదుకున్నది లేదు..
ఎన్నికల ముందు బీసీ వృత్తిదారులకు మాయ మాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. రెండేళ్లుగా బీసీ వృత్తిదారులకు ఆదరణ పథకం లేదు.. సంక్షేమ పథకాలతో ఆదుకున్నదీ లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లతో ఆదరణ 3.0ద్వారా అధునాతన వృత్తి పరికరాలు అందిస్తామని చెప్పారు. రెండేళ్లలో బడ్జెట్‌లో రూ.రెండు వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం రూ.వెయ్యి కోట్లు కేటాయించినా అందులోనూ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. బీసీ వృత్తిదారులకు రూ.10వేల కోట్లతో ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. బీసీ కులాలకు రక్షణ చట్టం తెస్తామని ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు. కూటమి పాలనలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. –మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ వృత్తి సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్రకన్వీనర్
ఉపాధి లేదు.. నిరుద్యోగ భృతి రాదు..
ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం హామీలు గుప్పించిన చంద్రబాబు రాష్ట్రంలో యువత, విద్యార్థులను దారుణంగా మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దగా చేశారు. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేలు ఇస్తామని రెండేళ్లయినా ఒక్క రూపాయీ విదల్చలేదు. బాబు ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ, పుస్తకాలు ఇతర ఖర్చులకు రూ.లక్షలు ఖర్చు పెట్టేందుకు మధ్యతరగతి ప్రజలూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి సామాన్యులకూ కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలి.
గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన విద్యా హక్కు చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో చదువులు పూర్తైన విద్యార్థులకు కాలేజీల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. సర్టిఫికెట్లు రాకపోవడంతో వారికి ఉద్యోగం వచ్చినా చేరలేని దయనీయ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. –ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్, బీసీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్
40ఏళ్లుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు
ఫార్టీ ఇయర్స్ ఇండస్త్రీ అని చెప్పుకొనే చంద్రబాబు 40ఏళ్లకుపైగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు ఊదరగొడతారు. ఆయనను నమ్మి ఓట్లేస్తే.. అధికారంలోకి వచ్చాక దగా చేయడం అలవాటుగా మారింది. 2024 ఎన్నికల్లోనూ బీసీ ఓట్ల కోసం చంద్రబాబు బీసీ రక్షణ చట్టం తెస్తానని, బీసీ ఉప ప్రణాళిక అమలు చేస్తానని, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానని అనేక హామీలు ఇచ్చి అమలులో కాలయాపన చేస్తున్నారు. బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. – బీసీ రమేష్‌గౌడ్, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


