నేడు పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శుక్రవారం అన్నమయ్య జిల్లా కలికిరిలో 3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా నిమ్మనపల్లెలో 2.9, చిత్తూరు జిల్లా పలమనేరులో 2.4, కార్వేటినగరంలో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, ఆవర్తనం ప్రభావంతో శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారమున్నట్లు పేర్కొంది. గంటకు 40– 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు శుక్రవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండ విజృంభించింది. ప్రకాశం జిల్లా కారేడులో 43.1 డిగ్రీలు, నెల్లూరు జిల్లా గూడూరులో 43, మన్యం జిల్లా భామినిలో 41.7, అనకాపల్లి జిల్లా చీడికాడలో 41.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తిరుపతిలో కుండపోత వర్షం..
అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ఉకిరిబిక్కిరికి గురైన తిరుపతి జిల్లా ప్రజలను వరుణుడు కరుణించాడు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో మురుగు కాలువలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు పెద్ద ఎత్తున చేరడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.


