క్రాంతికుమార్‌ మృతిపై సీబీఐ విచారణ జరపాలి | CBI should investigate Krantikumars death says ysrcp | Sakshi
Sakshi News home page

క్రాంతికుమార్‌ మృతిపై సీబీఐ విచారణ జరపాలి

Jun 21 2026 3:51 AM | Updated on Jun 21 2026 3:54 AM

CBI should investigate Krantikumars death says ysrcp

దళితులపై వరుస దాడులు దారుణం  

చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌ క్షమాపణలు చెప్పాలి 

వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్‌  

క్రాంతి కుటుంబ సభ్యులకు పరామర్శ  

లబ్బీపేట/కృష్ణలంక (విజయవాడ తూర్పు): దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్‌ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించడంతోపాటు, అతని కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. క్రాంతికుమార్‌ మృతితో దిక్కులేకుండా పోయిన ఆయన బిడ్డలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం వల్లే రాష్ట్రంలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని రెచ్చి పోతున్నారని, బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోంమంత్రి అనిత  క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

ప్రజలను కాపాడాల్సిన పోలీసులే రెచ్చిపోయి హింసిస్తుంటే,  సామాన్యులు తమ కష్టాలను ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులకు తాళలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పేరుపోగు క్రాంతికుమార్‌ కుటుంబాన్ని శనివారం వైఎస్సార్‌సీపీ నాయకుల బృందం పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.  రాష్ట్రంలో కృష్ణలంక లాంటి పోలీస్‌ స్టేషన్లు ఎన్నో ఉన్నాయని, ఇప్పటికైనా వేధింపులు, దాడులకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

ఒక దళిత మహిళ అయ్యుండి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి హోంమంత్రి అనితకి తీరికలేదా అని నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలకు క్రాంతికుమార్‌ తండ్రి, ఏపీ ఎమ్మార్ఫీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఘటన పూర్వాపరాలను వివరించారు. పోలీసుల వేధింపుల వల్ల తన కొడుకు ప్రాణాలొదిలాడని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ కులంలో పుట్టడమే తప్పయిపోయిందని తన కొడుకు చాలా ఆవేదన చెందాడని కంటతడిపెట్టారు. ప్రజాఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్న తన కొడుక్కే ఇలా జరిగిందంటే ఇక నోరులేని సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ నాగరాజు వంటివారు పోలీసు వ్యవస్థకే మాయని మచ్చని విమర్శించారు. ఘటనపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.  

దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు క్రాంతికుమార్‌  కుటుంబ సభ్యులను పరామర్శించామని చెప్పారు. దళిత యువకులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, వారిపై అక్రమంగా గంజాయి కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరిచి వేధిస్తున్నారని విమర్శించారు. బూట్‌ పాలిష్‌ చేయాలంటూ క్రాంతిని వేధించిన సీఐ నాగరాజు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘చర్మం వలచడం కూడా దళితుల వృత్తే  అనే విషయం గుర్తుంచుకోవాలి’’ అని పోలీసులను హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు,  దాష్టీకాలు పెరిగిపోయాయని, వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సర్కారు సాగిస్తున్న మారణకాండకు కృష్ణలంక పరిధిలో జరిగిన సాయికృష్ణ, క్రాంతికుమార్‌ మరణాలే సాక్ష్యమని స్పష్టం చేశారు. హోం మంత్రి అనిత తక్షణమే స్పందించి క్రాంతి కుమార్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, మేకప్, లాకప్‌ ప్రభుత్వమని విమర్శించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement