సీఎం వైఎస్ జగన్ హయాంలో భారీగా పెరిగిన తలసరి ఆదాయం
ఐదేళ్లలో పెరిగిన తలసరి ఆదాయం రూ.88,448
చంద్రబాబు పాలనలో రూ.60,128 మాత్రమే
దేశ జాతీయ సగటును మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి తలసరి ఆదాయమే కొలమానం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోకన్నా గత ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువగా ఉంది. రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ, దాన్ని అధిగమించి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.88,448 పెరిగింది.
కోవిడ్ సంక్షోభం లేకపోయినప్పటికీ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల రూ.60,128 మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం చివరి ఏడాది 2018–19 లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్రమే ఉండగా, సీఎం జగన్ పాలనలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,42,479కి పెరిగింది. అంతేకాకుండా 2019–20 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్లలో జాతీయ సగటును మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల నమోదైంది.
2019–20లో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,34,432 ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,14,000కు చేరింది. ఇదే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,60,341 ఉండగా 2023–24 నాటికి రూ.2,42,479 కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 తో దేశంలో 17వ స్థానంలో ఉంది. కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం వరుసగా పెరుగుతూ 2022–23 నా టికి దేశంలోనే 9వ స్థానంలో రాష్ట్రం నిలిచింది.
తలసరి ఆదాయం అంటే.. 
తలసరి ఆదాయం అనేది రాష్ట్ర జనాభా ఆర్థిక శ్రేయస్సు ముఖ్యమైన సూచిక. ఇది వ్యక్తులు, కుటుంబాలపై ఆచరణాత్మక ప్రభావాలను కలిగి ఉంటుంది. తలసరి ఆదాయం అంటే సాధారణంగా ప్రజలు వస్తువులు, సేవలపై ఖర్చు చేయడానికి డబ్బుని కలిగి ఉండటం. ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఏదైనా రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కొలమానం తలసరి ఆదాయమే.  
జగన్ సర్కారు కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించిందిలా.. 
రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాల పథకాలను యథాతథంగా అమలు చేసింది. ఈ సమయంలో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది. జీవనోపాధి కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకొంది. వ్యవసాయంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంది. ప్రజల ఆదాయ మార్గాలను పెంచేందుకు అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగే వాతావరణాన్ని కలి్పంచింది. ఫలితంగా కోవిడ్ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువగా నమోదైంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
