విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు.
‘‘విద‍్యాశాఖను చెడగొట్టాలని లోకేశ్‌కు ఆ శాఖ అప్పగించారా? ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ‍్బందులు పడుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉందా? కూటమి ప్రభుత్వ వెన్నుపోట్లపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాం.
భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలు మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది. రెండేళ్లలో ఏదో సాధించినట్లు వెన్ను పోటీ పార్టీ చెప్పుకుంటోంది. ఇచ్చిన హామీలను ఈ రెండేళ్లలో ఒక్కటైనా నెరవేర్చారా? సూపర్-6, సూపర్-7 పథకాలు అన్నారు.. ఏమయ్యాయి?’’ అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
‘‘ఏపీలో ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు చాలా బేల మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నడపమంటే మాపై ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు మా నాయకులు, ప్రజలు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోరాటంలో పాల్గొన్నారు.. పార్టీ నాయకులు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను.
ఆడబిడ్డ నిధి పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. బంగారు కుటుంబం అన్నారు.. ఇత్తడి కుటుంబం కూడా లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలకు ఇంతటి ప్రజాధరణ వచ్చింది. అన్నిటి ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వత్తాసు పలుకుతున్న దళారులు బాగుపడుతున్నారు.
సామాన్యులు కొనే నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లోకేశ్ ఛాలెంజ్ లు దేనికి విద్యా శాఖను బాగు చెయ్యడానికా? నాశనం చెయ్యడానికా..? పాఠశాలల ప్రారంభం నాటికే పేద పిల్లలకు బూట్లు, పుస్తకాలు, బట్టలు, బ్యాగ్ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ రంగానికీ మంచి జరగడం లేదు.
రైతుకు మద్దతుగా ధర లేదు. జొన్న, మామిడి వంటి వాటికి కూడా ధర లేదు. మా హయాంలో ఆక్వా రంగానికి ఇబ్బంది లేకుండా చేశాం. ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా కుదేలు అయ్యింది.. ఆక్వా రంగంలో ఉన్న వారు కూడా రోడ్డెకుతున్నారు. ఇది వెన్నుపోటు పార్టీ విధానం’’ అన్నారు.
మాధవ్‌వి తప్పుడు వ్యాఖ్యలు.. ఇక పవన్‌వి..
ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. ‘‘మీ కేంద్ర మంత్రే మా వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామి మాటలు అబద్దమా..? లక్షలాది మంది ప్రజల సాక్షిగా ప్రధానిని స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడిగారు.. పవన్ కల్యాణ్.. ఒకరోజు తెలంగాణ.. మరో రోజు ఏపీ అంటారు.
పవన్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పు మీరు రెండేళ్లలో చేశారు. మా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేశారు. మళ‍్లీ నోటిఫికేషన్ ఇచ్చి డీఎస్సీ సక్రమంగా నిర్వహించలేదు. డీఎస్సీని నిర్వహించలేని ప్రభుత్వం ఇది. గ్రామ సచివాలయ ఉద్యోగాలు పాదర్శకంగా ఇచ్చాం.. నేనే మానిటరింగ్ మినిస్టర్ గా ఉన్నాను గర్వంగా చెబుతున్నా. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడా యూరియా దొరకడం లేదు.
ఒడిశా నుంచి యూరియా తెచ్చుకొని దాచుకుంటున్నారు. అది కూడా అధిక ధర రూ. 600 కు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా రైతులు చెప్పిన వాస్తవాలు ఇవి. భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగిపోతుందని రైతులు భయపడుతున్నారు. ఇది ముమ్మాటికీ వెన్నుపోటు ప్రభుత్వం.. టీడీపీది వెన్నుపోటు పార్టీ’’ అని తెలిపారు.


