ఉద్దానంలో పెద్దపులి

Big tiger in Uddanam area of Srikakulam district - Sakshi

శ్రీకాకుళం జిల్లా సహలాల పుట్టుగ, కొండిపుట్టుగలో పశువులపై దాడి  

భయాందోళనలో ప్రజలు 

కంచిలి/కవిటి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పెద్దపులి మంగళవారం రాత్రి పశువులపై పంజా విసిరింది. కవిటి మండలం సహలాల పుట్టుగ­లో ఓ ఆవుపై దాడిచేసి చంపేసింది. అదే మండలంలోని కొండిపుట్టుగలో ఓ గేదె దూడను హతమార్చింది. గుజ్జుపుట్టుగలో ఓ ఆవు దూడ తలపై దాడి­చేసి గాయపరిచింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కవిటి–నెలవంక మార్గంలో శీ­మూ­రు–నెలవంక గ్రామాల మధ్య రోడ్డు దాటుతూ బస్సు ప్రయాణికులకు కనిపించింది.

ఈ ఘటనలతో ఉద్దానం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కంచిలి మండలం మండపల్లిలో ఆవుపై దాడిచేసి­న పులి, కవిటి మండలంలో కనిపించిన పులి ఒక్క­టేనా.. వేర్వేరా అనే విషయం తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు ఒక పులి మాత్రమే తిరుగుతోందంటున్నారు. పులికి ఒక రోజులో గరిష్టంగా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఘటనపై పలాస ఆర్డీవో భరత్‌నాయక్‌ మాట్లాడుతూ.. పులి సంచారంపై రెవెన్యూ, పోలీస్, అటవీ, పంచాయతీ అధికారులతో ఇప్పటికే సమీక్షించామన్నారు. పులి సంచరిస్తున్న గ్రామాలతోపాటు సమీప గ్రామాల ప్రజలు రాత్రిపూట బయట తిరగొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తోడు లేకుండా బయటకు రావొద్దన్నారు.
 
ఒడిశా నుంచి రాక! 
పెద్దపులి ఒడిశాలోని గజపతి జిల్లా గండాహతి అటవీ ప్రాంతం నుంచి అక్టోబర్‌ 21న శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు వరి పొలాల్లో సంచరించినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తరువాత పలాస మండలం టబ్బు­గాం, మందస మండలం కొండలోగాం, పట్టులోగాం గ్రామాల్లో తిరిగిందని తెలిపారు. 27న రాత్రి కంచిలి మండలం మండపల్లి పంచాయతీ పరిధి అమ్మవారిపుట్టుగ వచ్చిన పులిని 28న గ్రామస్తులు గుర్తించారు. అక్కడి నుంచి ఆందోళన మొదలైంది. నవంబర్‌ 1న కంచిలి మండలం మండపల్లి పరిసరాలు, సోంపేట కొబ్బరితోటల్లో సంచరించిందని స్థానికు­లు చెప్పడంతో అటవీ అధికారులు పరిశీలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top