
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మధురవాడలో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకే కేటాయించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది.
ఇదే సమయంలో టీసీఎస్, లులు కంపెనీలకు భూ కేటాయింపులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కూడా కాగ్నిజెంట్‌కు సంబంధించిన పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అన్నింటినీ కలిపి విచారిస్తామని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
99 పైసలకే 22 ఎకరాల భూ కేటాయింపులపై పిల్...
కాగ్నిజెంట్ కంపెనీకి భూ కేటాయింపులను సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ రైట్స్ విశాఖ జిల్లా అధ్యక్షురాలు నక్కా నమ్మిగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, విశాఖ నడిబొడ్డున రూ.1,109 కోట్ల విలువ చేసే 22 ఎకరాల భూమిని ప్రభుత్వం కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చిందన్నారు. సేల్‌డీడ్ ద్వారా కాగ్నిజెంట్‌కు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. లీజు విధానంలో మాత్రమే భూ కేటాయింపులు జరపాల్సి ఉంటుందని తెలిపారు.