టీటీడీ ప్లాన్–ఏపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి
భక్తులను తనిఖీ చేయడం అభ్యంతరకరం
ఇది గౌరవంగా, హుందాగా జీవించే హక్కును హరించడమే
మీరు ఆపకపోతే భక్తులను పరకామణి సేవకు వాడొద్దని ఆదేశాలిస్తాం
కానుకల లెక్కింపు కోసం టేబుళ్లు వాడాలన్న ఆదేశాలపై స్పష్టత లేదు
ఈ రెండు వ్యవహారాల్లో స్పష్టత ఇవ్వండి
విచారణ గురువారానికి వాయిదా
సాక్షి, అమరావతి: శ్రీవారి పరకామణిలో చేపట్టే సంస్కరణలపై టీటీడీ సమర్పించిన ప్లాన్–ఏపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల్లో తాము పలు అంశాల్లో సంస్కరణలు అవసరమని చెబుతూ సలహాలు, సూచనలు కోరితే.. టీటీడీ మాత్రం ఎలాంటి సలహాలను తెలియజేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. తాము లేవనెత్తిన ఏ అంశానికీ సమాధానం ఇవ్వలేదని తప్పు పట్టింది. శ్రీవారి పరకామణిలో కానుకల లెక్కింపును సేవగా భావించి వచ్చే భక్తులను అమానవీయ రీతిలో తనిఖీలు చేయడంపై హైకోర్టు మరోసారి అభ్యంతరం తెలిపింది.
తనిఖీలపై భక్తిరీత్యా భక్తులు అభ్యంతరం చెప్పకపోవచ్చని, కానీ.. ఇది రాజ్యాంగం కల్పించిన ‘గౌరవంగా, హుందాగా జీవించే హక్కు’ను కాలరాయడమేనని స్పష్టం చేసింది. ఈ హక్కును ఎవరూ కాలరాయలేరని తేల్చి చెప్పింది. ఒకవేళ తనిఖీల్ని ఆపకుంటే.. పరకామణిలో భక్తుల చేత కానుకల లెక్కింపును ఆపేస్తూ ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది.
కానుకలు లెక్కించే చోట టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలపైనా టీటీడీ తన నివేదికలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదంది. అందువల్ల భక్తులను అమానవీయ రీతిలో తనిఖీ చేయడం, లెక్కింపు కోసం టేబుళ్ల ఏర్పాటుపై స్పష్టత తీసుకుని పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ అధికారులపై క్రమశిక్షణ చర్యలు అవసరం
పరకామణిలో రూ.72 వేల విలువైన 900 డాలర్ల చోరీ నేపథ్యంలో హైకోర్టు ఇటీవల పలు సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీకి ఆదేశాలిచ్చింది. పరకామణిలో తక్షణ సంస్కరణల నిమిత్తం ప్లాన్–ఏ సమర్పించాలని టీటీడీని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వ్యవహారంపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మరోసారి విచారణ జరిపారు.
టీటీడీ సమరి్పంచిన ప్లాన్–ఏను పరిశీలించానని, గత విచారణ సమయంలో తాను లేవనెత్తిన అంశాలు, ఆదేశాల గురించి అందులో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఇది తమను అసంతృప్తికి గురి చేసిందన్నారు. పరకామణిలో చోరీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. నిందితుడు రవికుమార్‌తో కొందరు పోలీసులు కుమ్మక్కైనట్టు సీఐడీ నివేదికను పరిశీలిస్తే తెలిసిందన్నారు. చోరీ కేసు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్న వ్యవహారంపై తప్ప మిగిలిన అన్ని అంశాల్లో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని, చట్ట ప్రకారం ముందుకెళ్లొచ్చని సీఐడీ, ఏసీబీ అదనపు డీజీలకు న్యాయమూర్తి స్పష్టం చేశారు.


