విశాఖ బోటు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపు | Sakshi
Sakshi News home page

విశాఖ బోటు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపు

Published Thu, Nov 23 2023 11:58 AM

Ap Govt Compensation Visakha Fishing Harbour Boat Accident Victims - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది. ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే బాధితులకు పరిహారం చెక్కులను అందజేసింది.

ఈ నెల 19వ తేదీ రాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా, మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలుసు­కున్న సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేసి మత్స్యకారులకు నేనున్నానంటూ... భరోసానిచ్చారు. బాధిత మత్స్యకారులకు 80శాతం పరిహా­రం ఇస్తామని ప్రకటించారు. సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పినట్లుగానే ప్రమాదం జరిగిన 48గంటలు గడవక ముందే జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ అకౌంట్‌కు పరిహారం డబ్బులను సీఎం కార్యాల­యం జమ చేసింది.

పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000, పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించింది. బోట్లు దగ్ధమవడంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న హమాలీలు, చిరువ్యాపారులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో బోటుకు 10మంది చొప్పున పరిగణనలోకి తీసుకుని మొత్తం 490 మందికి ఒక్కొక్కరికీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.10వేలు చొప్పున అందించారు.

ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, మత్స్యకారులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటోందని ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా సాయం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన మత్సకారుల డీజిల్‌ బకాయిలు కూడా చెల్లిస్తామని, త్వరలో ఆ బకాయిలు రూ.4 కోట్లు 15 రోజుల్లో విడుదల చేయాలని సీఎం ఆదేశించారన్నారు.

‘‘విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. పరిహారం ఇస్తున్న దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఎం ఇవేం పట్టించుకోకుండా అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా విలువలో 80 శాతం చెల్లింపు చేయాలని చెప్పారు

కలాసీలకు పరిహారం ఇవ్వాలని చెబితే వెంటనే పది వేలు చొప్పున ఇవ్వాలని సీఎం చెప్పారు. ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. స్టీల్ బోట్లు తయారీకి ఇప్పుడు 60 శాతం సబ్సిడీ ఇస్తోంది.ఇప్పుడు దరఖాస్తు చేస్తే లాంగ్ లైనర్ల కోసం 75 శాతం వరకు ఇస్తామని’’ మంత్రి పేర్కొన్నారు.

సీఎం గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు: ఎంపీ మోపిదేవి
విశాఖ హార్బర్ ప్రమాదం మానవ తప్పిదం.. కానీ సీఎం జగన్‌ తన ఉదారత చాటుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పరిహారం ఇవ్వడంలో సీఎం గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారన్నారు.

150 కోట్లతో హార్బర్ ఆధునీకరణ గొప్ప నిర్ణయం. ఇన్ని జట్టీలు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగలేదు. ఫిషింగ్ జట్టీల ఏర్పాటు తో ఆర్థిక ప్రగతి వుంటుంది. ఈ రోజు ఇచ్చిన పరిహారం అంచనాలకు తగ్గట్టు అధికారులు ఇచ్చారు. ఈ పరిహారం వృధా చేయకుండా లాంగ్ లైనర్ బోట్లను కొనుగోలు చేయాలన్నారు. బోట్ల కొనుగోలుకు బ్యాంకులు సహకరించేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని, రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు వస్తారు.. వారికి నమ్మకండి’’ అంటూ మోపిదేవి సూచించారు.

మత్స్యకారులకు అండగా ఉంటాం: వైవీ సుబ్బారెడ్డి
మత్స్యకారులకు సీఎం అండగా నిలిచారని, విపత్తుల సహాయం చేయడం సహజం.. కానీ ఇది విపత్తు కాదు.. ప్రమాదంలో బోట్లు తగలబడినా ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన గంటల్లోనే విలువలో 80 శాతం పరిహారం సీఎం ఇవ్వడం గొప్ప విషయం. కలాసీలకు 10 వేలు పరిహారం ఇవ్వడం చారిత్రక నిర్ణయం. ఈ పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు.. బోట్లు తిరిగి నడిపే వరకు అండగా వుంటాం. గత ప్రభుత్వం బోట్ల మరమ్మత్తులకు 6 లక్షలు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం హామీ అమలు జరిగేలా ప్రయత్నిస్తాం’’ అని సుబ్బారెడ్డి అన్నారు.

Advertisement
Advertisement