ఏపీలో గొప్ప చర్యలు: కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్‌

AP education system is commendable - Sakshi

కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్‌ జెఫ్రీ సాచ్‌ ప్రశంస 

విద్యారంగం అభివృద్ధికి గొప్ప చర్యలు చేపట్టడంపై కితాబు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్‌ విద్యా విధానాన్ని అనుసరించడం, పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయమని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ జెఫ్రీ సాచ్‌ అన్నారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు హాజరైన ఏపీ విద్యార్థులు కొలంబియా యూనివర్సిటీలోని ఎస్‌డీజీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో కూడా ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి జెఫ్రీ సాచ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా యూఎన్‌ఓ స్పెషల్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ షకిన్‌కుమార్‌ ఏపీ విద్యార్థులను జెఫ్రీ సాచ్‌కు పరిచయం చేశారు. ఆయన విద్యార్థుల కోసం కొంత సమయాన్ని కేటాయించి వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విద్యార్థులు తమ కుటుంబ నేపథ్యాలను.. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, విద్యా సంక్షేమ పథకాలు.. అవి పేద విద్యార్థుల ప్రగతికి ఎలా దోహదం చేస్తున్నాయో వివరించారు.  

ఏపీలో గొప్ప చర్యలు 
అనంతరం జెఫ్రీ సాచ్‌ మాట్లాడుతూ..  ప్రపంచంలోని ప్రతి బిడ్డా చదువుకోవాలని, ఆయా దేశాల ప్రభుత్వాలు విద్యకోసం అధిక నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్కరణల కోసం తాను 25 ఏళ్లుగా పోరాడుతున్నానని, ఏపీలో గొప్ప చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి, డిజిటల్‌ విద్య, ట్యాబ్స్‌ పంపిణీ, ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు, టోఫెల్‌ శిక్షణపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. పిల్లలు ప్రతి ఒక్కరూ బడికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందన్నారు. తన ఆకాంక్షలకు అనుగుణంగా పిల్లలను బడికి పంపించే తల్లుల అకౌంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నగదు జమ (అమ్మ ఒడి) చేయడాన్ని ప్రొఫెసర్‌ జెఫ్రీ అభినందించారు.

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్న విషయాన్ని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకు రాగా.. ఇది ఎంతో గొప్ప చర్యగా ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. ఇప్పుడు వర్సిటీ వేదికపై ప్రసంగించిన విద్యార్థులంతా ఈ పథకం ద్వారా కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ పాల్గొన్నారు.   

ప్రపంచం మెచ్చిన మేధావి ప్రొఫెసర్‌ జెఫ్రీ సాచ్‌ 
ప్రొఫెసర్‌ జెఫ్రీ సాచ్‌ కొలంబియా యూనివర్సిటీలో అత్యున్నత అకడమిక్‌ ర్యాంక్‌ గల ప్రొఫెసర్‌ హోదాలో ఉన్నారు. వివిధ పుస్తకాలు రచించిన ఆయన టైమ్‌ మ్యాగజైన్‌లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన ప్రపంచ నాయకుల్లో రెండుసార్లు పేరు పొందటంతోపాటు 42 గౌరవ డాక్టరేట్లను సైతం అందుకున్నారు. గతంలో హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలందించిన ఈయన కొలంబియా వర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా విద్యా సంస్కరణల కోసం కృషి చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్‌ కోఫీ అన్నన్, బాన్‌ కీ మూన్‌తో పాటు ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ అన్‌టోనియో గుటెరస్‌కు ప్రత్యేక సలహాదారుగా కొనసాగుతున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు గౌరవించే ప్రొఫెసర్‌ జెఫ్రీ సాచ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యా సంస్కరణలను అభినందించడం విశేషం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top