AP Budget 2022: ఏపీ బడ్జెట్‌ సమావేశాలు, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది: గవర్నర్‌

AP Assembly Budget Session 2022 Telugu Live Updates - Sakshi

అప్‌డేట్స్‌:

ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం
ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఉద్యోగుల వయో పరిమితి వయస్సు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్విభజనపై కేబినెట్‌ చర్చించింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 25 వరకూ కొనసాగించాలని నిర్ణయం
దివంగత గౌతమ్‌ రెడ్డి మృతికి గౌరవ సూచకంగా ఈనెల 9వ తేదీన సభకు సెలవు

► వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కేబినెట్ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రులు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. 

గవర్నర్‌ను దూషిస్తూ, గవర్నర్‌ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి గవర్నర్‌పై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని అచ్చెన్నాయుడికి సీఎం జగన్‌ హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదనే సంగతిని సీఎం జగన్‌ గుర్తుచేశారు. గవర్నర్‌ వయసులో పెద్దవారని, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ తెలిపారు.

స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం
► హాజరైన సీఎం జగన్‌, మంత్రులు బుగ్గన, కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ 
టీడీపీ నుంచి హాజరైన అచ్చెన్నాయుడు

భోగాపురం ఎయిర్‌పోర్టును వేగవంతం చేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు రూ. 2363.2 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించామని అన్నారు. వైఎస్సార్‌ జగన్‌ బడుగు వికాసం కింద షెడ్యూల్‌ కులాల పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక నైపుణ్యం కోసం రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోనే తొసారిగా మైక్రోసాఫ్టు అప్‌స్కి‍ల్లింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. 2.98 లక్షలకు గాను 2.87 లక్షల ఫిర్యాదులు పరిష్కరించామని గవర్నర్‌ తన ప్రసంగంలో వివరించారు. ​

► వైఎస్సార్‌ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. వైఎస్సార్‌ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. కాపు నేస్తం కింది ఇప్పటివరకు రూ. 981.88 కోట్లు అందించామని తెలిపారు. ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున సాయం చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్ల వ్యయంతో 3 వేల కిలో మీటర్ల పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. 

► పోలవరం ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి జీవనాడిగా ఉందిని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. 2023 జూన్‌ నాటికి పోలవరం పూ​ర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.  

రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ. 20, 162 కోట్ల సాయం చేశామని పేర్కొన్నారు. 

► 9 గంటల ఉచిత విద్యుత్‌ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజంన చేకూర్చినట్లు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2021-2022లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులుకు ప్రయోజనం చేకూర్చామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ. 577 కోట్ల సాయం చేసినట్ల తెలిపారు. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించినట్లు పేర్కొన్నారు.

► జగనన్న తోడు ప్రథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం అందజేసినట్లు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. వైఎస్సార్‌ వాహన మిత్ర కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ. 770 కోట్ల సాయం చేశామని చెప్పారు. వైఎస్సార్‌ ఆసరా కింద స్వయం సహాయక సంఘాలకు 12,758 కోట్ల సాయం, వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.2,354 కోట్లు అందించామని అన్నారు. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ చేశామని తెలిపారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ప్రతిపాదించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు.

► ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2020-2021 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధించిందని అన్నారు. మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని చెప్పారు. 

► రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. 

గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శంగా పనిచేస్తున్నాయని గవర్నర్‌ తెలిపారు. కోవిడ్‌ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు.

► గవర్నర్‌ను దూషిస్తూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. గవర్నర్‌ ప్రసంగ ప్రతులను చించి గవర్నర్‌పై విసిరేసిన టీడీపీ సభ్యులు.
► ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి  గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తున్నారు.

ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ విశ్వభూషన్ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్‌ సమావేశాలు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగంతో సోమవారం ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు.

కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్‌ సమావేశాల సమయంలో వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ వాయిదా పడనుంది. గవర్నర్‌ ప్రసంగం అనంతరం బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. 

బీఏసీ సమావేశం ముగిశాక వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి ఆమోదించనుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతోపాటు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top