ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్‌ వద్దు

Andhra Pradesh High Court Suspension of Inter-Board Proceedings - Sakshi

ఇంటర్‌ బోర్డు ప్రొసీడింగ్స్‌ నిలిపివేత

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అకస్మాత్తుగా నిర్ణయం మార్చడం వల్ల విద్యార్థులకు అసౌకర్యం

నాన్‌ జంబ్లింగ్‌లో ప్రాక్టికల్స్‌ నిర్వహించవచ్చని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌ పరీక్షలు జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించడానికి ఇంటర్మీడియెట్‌ బోర్డు ఈ నెల 3న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పాత విధానంలోనే ఏ కాలేజి విద్యార్థులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్‌ నిర్వహించవచ్చని మౌఖికంగా స్పష్టంచేశారు. విద్యార్థులు, విద్యా సంస్థల ప్రయోజనాలను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

పాత విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం వల్ల విద్యార్థులు అసౌకర్యానికి గురవుతారని వివరించారు. పాత విధానాన్ని మార్చడానికి అధికారులు ఎలాంటి సహేతుక కారణాలు చూపలేదని న్యాయమూర్తి ఆక్షేపించారు. ఇంటర్‌ బోర్డు ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ అఫిలియేటెడ్‌ ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ, న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపించారు. మొదట నాన్‌ జంబ్లింగ్‌ విధానంలోనే ప్రాక్టికల్స్‌కు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని తెలిపారు.

ప్రాక్టికల్స్‌ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో అకస్మాత్తుగా జంబ్లింగ్‌ విధానంలోకి మార్చారని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది రఘువీర్, ఇంటర్‌ బోర్డు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కోవిడ్‌ వ్యాప్తి కనిష్ట స్థాయికి చేరుకోవడంతో నాన్‌ జంబ్లింగ్‌ స్థానంలో జంబ్లింగ్‌ తీసుకొచ్చామన్నారు. చట్ట నిబంధనలకు లోబడే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని కాలేజీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యతిరేకించడంలేదని తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, నాన్‌ జంబ్లింగ్‌ విధానాన్ని మార్చి జంబ్లింగ్‌ విధానంలో ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించాలని ఎందుకు నిర్ణయించారో సహేతుక కారణాలను అధికారులు వెల్లడించలేదన్నారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది రఘువీర్‌ స్పందిస్తూ, ఈ ఉత్తర్వుల వల్ల ఈ నెల 11న జరగాల్సిన ప్రాక్టికల్స్‌కు ఆటంకం కలుగుతుందన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, జంబ్లింగ్‌ విధానాన్ని మాత్రమే నిలిపివేశామని, పాత పద్ధతిలో ప్రాక్టికల్స్‌ నిర్వహించుకోవచ్చునని  చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top