వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు

Andhra Pradesh High Court On Narayana Educational Institutions - Sakshi

నారాయణ విద్యా సంస్థపై పలు కేసుల పెండింగ్‌ 

మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో పిటిషనర్లు అసలు నిందితులే కాదు

అలాంటప్పుడు ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు వేయడంలో అర్థం లేదు

ఆ వ్యాజ్యాలను కొట్టేయాలన్న అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి 

తగిన ఉత్తర్వుల నిమిత్తం హైకోర్టు విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు సింధూర, శరణి, అల్లుడు కె.పునీత్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లకు అసలు విచారణార్హతే లేదని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు.

నారాయణ విద్యా సంస్థపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ వివరాలన్నింటినీ కోర్టు ముందుంచుతామని ఆయన వివరించారు. ప్రశ్నాపత్రం మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో పిటిషనర్లు అసలు నిందితులు కాదని, అలాంటప్పుడు వారు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించడంలో అర్థం లేదన్నారు. కేవలం ఆందోళన ఆధారంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు. 

ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు..
పదవ తరగతి ప్రశ్నపత్రం మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో పోలీసులు తమను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు సునీత, పొంగూరు శరణి, అల్లుడు కె.పునీత్, నారాయణ మామ రాపూరు కోటేశ్వరరావు, నారాయణ ఎడ్యుకేషనల్‌ సొసైటీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ జె.కొండలరావు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ మాలేపాటి కిషోర్, సొసైటీ సభ్యులు వీపీఎన్‌ఆర్‌ ప్రసాద్, మరో ఆరుగురు హైకోర్టులో వేర్వేరుగా గత ఆదివారం పిటిషన్లు దాఖలు చేశారు. హౌస్‌ మోషన్‌ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపిన న్యాయమూర్తి, పిటిషనర్ల విషయంలో ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసుకు ఐపీసీ వర్తించదు..
బుధవారం ఈ వ్యాజ్యాలు న్యాయమూర్తి జస్టిస్‌ కుంభజడల మన్మధరావు ఎదుట విచారణకు రాగా పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రత్యేక చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు తిరిగి ఐపీసీ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని ఇదే హైకోర్టు చెప్పిందన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రాల మాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించి ఏపీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (మాల్‌ ప్రాక్టీస్, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక ) చట్టం కింద కేసు నమోదు చేశారని, ఇది ప్రత్యేక చట్టమని తెలిపారు.

అందువల్ల ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టడానికి వీల్లేదన్నారు. సెక్షన్‌ 41ఎ ప్రకారం నడుచుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. దీనిని పోలీసుల తరఫున హాజరైన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దుష్యంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు. అదనపు పీపీ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, కౌంటర్‌ను పరిశీలించాక పిటిషన్లపై నిర్ణయం వెలువరిస్తామని తెలుపుతూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top