ఉన్నత విద్యే లక్ష్యం | Andhra Pradesh Govt Focus On Students Higher Education | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యే లక్ష్యం

May 8 2023 5:18 AM | Updated on May 8 2023 2:58 PM

Andhra Pradesh Govt Focus On Students Higher Education - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత సత్ఫలితాలిస్తోంది. పాఠశాల విద్యతోనే పిల్లలు చదువు మానేయకుండా ఉన్నత విద్య వైపు దృష్టి సారించేలా పలు పథకాలు, కార్యక్రమాలు చేపడుతోంది. బడి ఈడు పిల్లలందరినీ ఒక పక్క బడిబాట పట్టిస్తూనే మరో పక్క ఆ పిల్లలందరూ సెకండరీ, ఉన్నత విద్యను అభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. తద్వారా పరిమాణాత్మక, గుణాత్మక మెరుగుదల కళ్లకు కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.­జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సెకండరీ, ఉన్నత విద్య ఎన్‌రోల్‌ మెంట్‌పై సమీక్షలో చర్చకు వచ్చిన గణాంకాలే ఇందుకు నిదర్శనం.

రాష్ట్రంలో 2019–20 నుంచి 2022–23 వరకు ఏటేటా ఉన్నత విద్యలో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2018–19లో చంద్రబాబు హయాంలో సెకండరీ విద్యలో (9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) చేరికలు బాగా తక్కువగా ఉండగా, సీఎం జగన్‌ హయాంలో 2019–20 నుంచి ఏటేటా పెరుగుతూ 2022–23 నాటికి 89.63 శాతానికి పెరిగాయి. 2018–19లో చంద్రబాబు హయాంలో పదవ తరగతి తర్వాత ఇంటర్‌ విద్యను అభ్యసించడానికి చేరిన వారి సంఖ్య కేవలం 46.88 శాతమే. సీఎం జగన్‌ హయాంలో 2019–20 నుంచి ఆ సంఖ్య ఏటేటా పెరుగుతూ 2022–23 నాటికి 69.87 శాతానికి చేరింది. 

ప్రతి దశలో పర్యవేక్షణ
► పిల్లలు పదవ తరగతి తర్వాత ఇంటర్‌.. ఆ తర్వాత డిగ్రీ అభ్యసించడానికి ప్రధాన కారణం ప్రస్తుత ప్రభుత్వ చర్యలే. అందరినీ బడిబాట పట్టించడంతో పాటు ఆ పిల్లలందరూ డీగ్రీలు చదివేలాగ సూక్ష్మ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. పదవ తరగతి పాస్‌ అయిన విద్యార్థులందరూ తదుపరి ఉన్నత విద్యలో చేరుతున్నారా లేదా అనే విషయాన్ని వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తోంది. ఇందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఆ యాప్‌ ద్వారా 2022లో పదవ తరగతి పరీక్ష పాస్‌ అయిన విద్యార్థులు తదుపరి విద్యలో ఎంత మంది చేరలేదు.. ఎందుకు చేరలేదనే సమాచారాన్ని సేకరించారు. 

► ఈ సర్వేను మరింత పకడ్బందీగా నిర్వహించడంలో భాగంగా ప్రత్యేక ఫార్మెట్‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాలని చెప్పారు. తద్వారా మరింత కచ్చితమైన సమాచారం వస్తుందని చెప్పారు. వివిధ శాఖల నుంచి ముందుగానే డేటాను తెప్పించుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. వలంటీర్ల ద్వారా సర్వే కచ్చితంగా ఉండేలా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. 

► 2004 సెప్టెంబర్‌ 1 నుంచి 2006 ఆగస్టు 31 వరకు పుట్టిన వారి ఆధారంగా 9వ తరగతి, పదవ తరగతి గ్రాస్‌ ఎన్‌రోల్‌ మెంట్‌ను గణించాలని, 2006 సెప్టెంబర్‌ 1 నుంచి 2008 ఆగస్టు 31 వరకు పుట్టిన వారి ఆధారంగా ఉన్నత విద్య గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ గణించాలని, ఇందు కోసం జనాభా జాతీయ కమిషన్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జనాభా అంచానాపై విడుదల చేసిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని సీఎస్‌ సూచించారు.

ఆ ఆరు పథకాల వల్లే విద్యా ప్రగతి
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో అద్భుత పురోగతి సాధించిందని నాబార్డు ప్రశంసించింది. 2023–24 రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, దీంతో ప్రాథమిక విద్య నుంచి సెకండరీ, ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో భారీగా పెరిగిందని నాబార్డు రాష్ట్ర ఫోకస్‌ పత్రం పేర్కొంది.

విద్యా రంగంలో రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శక కార్యక్రమాల ప్రభావం ప్రతిబింబించిందని తెలిపింది. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మారుస్తూ విద్యార్థులు, టీచర్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తోందని చెప్పింది. 94.56 శాతం పాఠశాలల్లో కరెంటు, తాగునీరుతో సహా మౌలిక సదుపాయాలున్నాయని, నూరు శాతం శిక్షణ పొందిన ఉపాధ్యాయులున్నారని పేర్కొంది. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని చెప్పింది.

జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, నాడు–నేడు పథకాలు.. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడానికేనని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో జనాభాలో కేవలం 2 శాతం కంటే తక్కువ మంది పిల్లలు మాత్రమే పాఠశాల విద్యకు దూరమైన్నట్లు 2021 డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ రిపోర్ట్‌ పేర్కొందని వివరించింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని తేల్చి చెప్పింది.   
2022లో సర్వే ఇలా..
2022లో 5,38,038 లక్షల మంది పదవ తరగతి పాస్‌ అవ్వగా, వారిలో 4,94,702 మంది తదుపరి కోర్సులు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇతర డిప్లమా కోర్సులు, ఐఐఐటీలు, ఓపెన్‌ స్కూల్స్‌లో చేరారని వలంటీర్ల సర్వే ద్వారా గుర్తించారు. మిగతా 43,336 మంది ఆరోగ్య సమస్యలు, అకడమిక్‌ సమస్యలు, వివాహం, ప్రత్యేక అవసరాలు తదితర కారణాల వల్ల తదనంతర కోర్సుల్లో చేరలేదని లెక్క తేల్చారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఇతరత్రా సౌకర్యాలు వివరించి వీరిలో కొందరిని తదనంతర కోర్సుల్లో చేర్చారు. ఇకపై ఇలాంటి వారి సంఖ్య ఇంకా తగ్గించేందుకు వలంటీర్ల సర్వేను మరింత శాస్త్రీయంగా చేపట్టనున్నారు. 

ఉన్నత విద్యలో చేరికలను మరింతగా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా పదవ తరగతి పాస్‌ అయిన విద్యార్థులందరూ ఐటీఐ, పాలిటెక్నికల్‌ లేదా రెగ్యులర్‌ ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో చేరేలా పర్యవేక్షించాలి. పది తర్వాత ఏ కోర్సులోనూ చేరని విద్యార్థులుంటే వారిని తదుపరి కోర్సుల్లో చేర్పించడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలి. నాణ్యమైన ఉన్నత విద్యకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏ విధంగా అండగా నిలుస్తున్నారో వారికి వివరించాలి. ప్రత్యేక నైపుణ్యంతో కూడిన ఉన్నత చదువుల వల్ల పేదల తల రాతలు మారతాయనే విషయాన్ని బాగా ఎక్కించాలి. ఈ విషయాలన్నింటిలో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి.
– ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షలో సీఎస్‌ జవహర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement