
కడలూరు సోనాబోట్లపై ఏపీ మత్స్యకారుల దండయాత్ర
కడలిలో తమిళనాడు కడలూరు బోట్ల ఆగడాలు
నిత్యం 80 బోట్లతో దాడులు
విలువైన మత్స్య సంపద దోపిడీతో పాటు వలలు ధ్వంసం
మారణాయుధాలతో మత్స్యకారులపై దాడులు
స్పందించని కూటమి ప్రభుత్వం
ఈనెల 11, 19 తేదీల్లో రెండు సార్లు వేట నిషేధం
కడలూరు బోట్లపై దాడికి వెళ్లి తరిమికొట్టిన మత్స్యకారులు
సోనాబోటు స్వాదీనం.. జువ్వలదిన్నె హార్బర్‌కు తరలింపు
నెల కిందట ఒక బోటు స్వాదీనం
కడలిలో తమిళ తంబీల ఆగడాలు ఇక చెల్లవంటున్నారు జిల్లా మత్స్యకారులు. నడిసంద్రంలో సమరానికి సై అంటున్నారు. మా ప్రాంతంలోకి వచ్చి మత్స్య సంపదను దోచుకుపోవడమే కాకుండా రూ.లక్షలు విలువజేసే వలలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోం.. ఇటువైపు కన్నెత్తి చూస్తే ఎదురుదాడులు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల మత్స్యకారులు సమావేశమై సోనాబోట్ల అంతుచూడాలని నిర్ణయించుకున్నారు. చేపల వేటతో పాటు నిబంధనలు ధిక్కరించే తమిళ జాలర్లను కూడా వేటాడేస్తామంటూ కదనరంగంలోకి దిగారు. ఇప్పటికే రెండు సోనాబోట్లను స్వాదీనం చేసుకున్నారు.
ఒంగోలు, టాస్‌్కఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లా తడ వరకూ సుమారు 281 కిలోమీటర్లు తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో మత్స్యకారులు ప్రాణాలు పణంగా పెట్టి చిన్న బోట్లతో వేట సాగిస్తున్నారు. మత్స్య సంపదను తెచ్చుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వీరిపై మెకనైజ్డ్ (సోనా) బోట్లతో తమిళ జాలర్లు సమూహంలా వచ్చి మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. రూ.లక్షల విలువైన వలలను ధ్వంసం చేస్తున్నారు. మత్స్య సంపదను దోచుకెళ్లిపోతున్నారు.
తమిళనాడుకు చెందిన కడలూరు జాలర్లతో మన మత్స్యకారుల సమరం నిత్యకృత్యంగా మారింది. చేపల కోసం వేట చేయడం ఒక ఎత్తైతే, సముద్రంలో తమిళ జాలర్ల నుంచి కాపాడుకోవడం మరో ఎత్తుగా మారింది. చిన్న ఇంజిన్ ఉన్న బోట్లతో సముద్రంలో తీరం నుంచి 8 కి.మీ. లోపలే వేట సాగించుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్లి వేట సాగించుకోవచ్చు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన జాలర్లు ఒడ్డు నుంచి 23 కి.మీ. అవతలి జలాల్లో మాత్రమే చేపల వేట చేసుకోవాల్సి ఉంటుంది. ఒడ్డు నుంచి సముద్రంలో 8 కి.మీ. వరకు మెకనైజ్డ్ బోట్లతో చేపల వేట చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. తమిళనాడులో వేల సంఖ్యలో ఈ రకం బోట్లు ఉన్నాయి. వీటిలో కనీసం 5 నుంచి 10 మంది వరకు మత్స్యకారులు ఉంటారు. అధునాతన వలలు, మారణాయుధాలతో మన ప్రాంతం వైపు వచ్చి దాడులు చేస్తున్నారు. వీరి నుంచి రక్షించాలని అధికారులను, పాలకులను కోరుతూ వస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు..
స్వీయ వేట నిషేధం..
మత్స్యకారులు ఎన్నోసార్లు జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవటంతో చివరకు మత్స్యకారులు తమ సమస్యను తామే పరిష్కరించుకోవటానికి నడుం బిగించారు. చిన్నబోటుతో చేపల వేటకు వెళితే సముద్రంలో 60 నుంచి 80 వరకు సోనాబోట్లు చేపల వేట సాగిస్తూ మత్స్య సంపద కొల్లగొట్టడంతో పాటు లక్షలాది రూపాయల వలలు ధ్వంసం చేసేవని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోనాబోట్ల కట్టడికి మన జిల్లాతోపాటు, పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన మత్స్యకార కాపులు ఈ నెల 11వ తేదీన సమావేశమయ్యారు.
మూడు రోజుల పాటు వేట నిషేధం అని ప్రకటించారు. 12వ తేదీ రాత్రి గతంలో తాము వేటాడి నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బర్‌లో ఉంచిన కడలూరుకు చెందిన సోనాబోటును తీసుకుని సుమారు 80 మంది జాలర్లు కర్రలు, కేట్‌బాల్స్, టపాసులు తీసుకుని తీరంలో సోనాబోట్ల వేట ప్రారంభించారు. ఆంధ్రా మత్స్యకారులు తమపై దాడికి వస్తున్నారని సమాచారం రావటంతో జాగ్రత్త పడ్డ కడలూరు జాలర్లు పారిపోయారు.
నిషేధకాలం పూర్తయిన తరువాత నాలుగు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేట కొనసాగించగా ఈనెల 18వ తేదీ గురువారం రాత్రి సోనాబోట్లు తీరానికి దగ్గరగా వచ్చి లక్షలాది రూపాయలు వలలు తెంచుకుని చేపల వేట సాగించారు. ఈసారి కడలూరు బోట్లను వదిలేది లేదని నిశ్చయించుకున్నారు. తిరిగి 19వ తేదీ చేపల వేట నిషేధం అని మత్స్యకార గ్రామాల్లో రెండవసారి దండోరా వేయించారు.
ఏడాదిన్నరగా నిరీక్షణ..
కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మత్స్యకారుల సమస్యను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి దృష్టికి తీసుకుని వెళ్లారని, సీఎం చంద్రబాబు కూడా స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్న విషయం అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అయినా సంవత్సరం దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల విజ్ఞప్తితో అద్దెకు స్పీడ్‌బోటు తీసుకుని కొద్దిరోజుల పాటు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం మత్స్యకారుల బాధలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో విసుగు చెందిన మత్స్యకారులు సమస్యను వారే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు.
సోనాబోట్లపై ఎదురుదాడి..
గురువారం రాత్రి తమిళ జాలర్లు దాడులు చేయడమే కాకుండా మన ప్రాంత మత్స్యకారులను అవమానించే రీతిలో వ్యవహరించారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు సమీపంలోని కొనపూడి సముద్రతీరంలో సోనాబోట్లతో చేపల వేట సాగిస్తున్న సమాచారం అందింది. వెంటనే రెండు జిల్లాల మత్స్యకారులు అక్కడకు బయలు దేరారు. వారిని అడ్డుకున్నారు. బోటును స్వాధీనం చేసుకుని విజయం సాధించారు. ఆ బోట్లలో మారణాయుధాలతో పాటు, 15 మంది వరకూ తమిళ మత్స్యకారులు ఉన్నట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా గత నెలలో సైతం తమిళజాలర్లను తరిమికొట్టి ఒక సోనాబోటును స్వా«దీనం చేసుకుని జువ్వలదిన్నె హార్బర్‌లో ఉంచారు. సుమారు నెల రోజులు దాటినా ఇంత వరకు తమిళనాడు మత్స్యకారులు ఎవరూ ఈ బోటు కోసం వచ్చిన దాఖలాలు లేవని తెలిసింది. తాజాగా మరో బోటును కూడా స్వా«దీనం చేసుకుని దాన్ని కూడా జువ్వలదిన్నెకు తరలించినట్టు సమాచారం. ఇకపై ఎవరు సహకరించినా, సహకరించకపోయినా వెనక్కి తగ్గేదే లేదని ఇకపై తమిళనాడు సోనాబోట్లకు చుక్కలు చూపిస్తామని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు.