రాష్ట్ర బాలలహక్కుల కమిషన్ నియామకంపై చంద్రబాబు సర్కారు సాగతీత
అధికార పార్టీ నేతలతో నింపేందుకేనని విమర్శలు
డిసెంబర్ 3 నుంచి ఇంటర్వ్యూలు అంటూ తాజాగా లీకులు
ఈ ఏడాది ఏప్రిల్ 19తో ముగిసిన రాష్ట్ర కమిషన్ పదవీకాలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాలలహక్కుల పరిరక్షణ అంటే చంద్రబాబు సర్కారుకు లెక్కలేదు. రాజ్యాంగబద్ధమైన ఆంధ్రప్రదేశ్ బాలలహక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీ ఎస్పీపీసీఆర్) నియామకానికి ఈ ప్రభుత్వం రాజకీయ గ్రహణం పట్టించింది. ఈ కమిషన్ పదవీకాలం పూర్తయి ఏడునెలలైనా.. భర్తీచేయడంలో మీనవేషాలు లెక్కిస్తోంది. అధికార పార్టీల క్యాడర్‌తో వాటిని నింపేందుకు నేతల పైరవీలు సాగుతున్నాయి.
పార్టీ పెద్దల నుంచి వచ్చిన షార్ట్ లిస్ట్ (ఎంపిక జాబితా)లో ఉన్న వారికి ఫోన్లు చేసి ఎవరు ఏ పోస్టుకు దరఖాస్తు చేశారని ఆరా తీస్తున్నట్టు సమాచారం. మహిళ, శిశుసంక్షేమశాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా ఉండే చట్టబద్ధ కమిటీ పర్యవేక్షణలో ఈ నియామకాలు చేయాల్సి ఉంది. వాటిని కూడా రాజకీయ కోణంలో చూడటం వల్ల బాలలహక్కుల కోసం పనిచేసే సమర్థులైన వారికి అన్యాయం జరుగుతుందనే విమర్శలు వినవస్తున్నాయి.
ఇంటర్వ్యూల దశలో నోటిఫికేషన్ రద్దు
బాలలహక్కుల రక్షణ చట్టం–2005 ప్రకారం చేపట్టే రాష్ట్ర బాలలహక్కుల పరిరక్షణ కమిషన్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇప్పటికే రెండుసార్లు రద్దుచేశారు. ఇందుకు టీడీపీ నేతల రాజకీయ ఒత్తిడే కారణమని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి బాలలహక్కులపై అవగాహన కలిగి డిగ్రీ విద్యార్హత ఉన్న వారికి స్వచ్ఛందంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ కమిషన్‌లో చైర్మన్‌తోపాటు ఆరుగురు సభ్యులుంటారు.
వీరు బాలలహక్కుల చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, విద్యాహక్కు చట్టం, బాలకారి్మక వ్యవస్థ నిర్మూలన చట్టం వంటి వాటిపై పూర్తి అవగాహన ఉండి.. వాటి అమలుకు కృషిచేయాల్సి ఉంటుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో నియమించిన బాలలహక్కుల పరిరక్షణ కమిషన్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 19తో ముగిసింది. కొత్తగా కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జూన్ 5న నోటిఫికేషన్ జారీచేశారు.
సభ్యుల విద్యార్హతల విషయంలో ఆరోపణలు వచ్చాయన్న కారణంతో మొదటి నోటిఫికేషన్ రద్దుచేసి జూన్ 19న మరో నోటిఫికేషన్ ఇచ్చి అదే నెల 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ముందెన్నడూ లేనివిధంగా 600కు పైగా దరఖాస్తులు రాగా.. వాటిని పరిశీలించి 252 మందికిపైగా ఇంటర్వ్యూలు పూర్తిచేసి నియామకాలు ప్రకటించాల్సిన దశలో ఆ నోటిఫికేషన్‌ను కూడా రద్దుచేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.
మూడోసారి సెప్టెంబర్ లో ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆశించినస్థాయిలో దరఖాస్తులు రాలేదని దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబర్ నెల వరకు పొడిగించారు. ఈ నోటిఫికేషన్‌తో వచి్చన దరఖాస్తుదారులకు డిసెంబర్ 3వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రెండురోజులుగా లీకులు ఇస్తున్నారు. అధికార పార్టీ ఆశావహులకు ఆ పదవులను కట్టబెట్టేందుకే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి.
జిల్లా సమితులదీ అదే పరిస్థితి
మరోవైపు జిల్లా బాలల సంరక్షణ సమితుల (సీడబ్ల్యూసీల) పదవీకాలం గత ఏడాది నవంబర్‌తో పూర్తయింది. జిల్లా సమితిలో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉండాలి. ఈ జిల్లా సమితుల నియామకానికి కూడా మూడుసార్లు నోటిఫికేషన్ జారీచేశారు. గతేడాది డిసెంబర్‌లో మొదటి నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత నోటిఫికేషన్ రద్దుచేసి ఈ ఏడాది మార్చిలో 26న మరో నోటిఫికేషన్ జారీచేశారు.
దరఖాస్తులను పరిశీలించి జూన్ 25 నాటికి ఇంటర్వ్యూలు పూర్తిచేసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి, యునిసెఫ్ ప్రతినిధి, చైల్డ్‌లైన్ ప్రతినిధి, బాలలహక్కుల కమిషన్ సభ్యురాలు, ప్రొఫెసర్‌లతో కూడిన కమిటీ అభ్యర్థులను ఎంపికచేసి తుది జాబితాను అధికారులకు ఇచ్చింది. ఆ నియామకాలను కూడా ఆపేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ బాలలహక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని విజయవాడకు చెందిన రెయిన్‌బో మానవహక్కుల వేదిక దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డిగ్రీ విద్యార్హతతోపాటు విభిన్న రంగాల్లో పదేళ్లపాటు సేవలు అందించిన ఎన్‌జీవో ప్రతినిధులై ఉండాలన్న నిబంధనలను ఉల్లంఘించి తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.


