వచ్చేనెల 10 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఏపీటెట్–2025 దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తం 2.59 లక్షల దరఖాస్తులు అందినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు (ఇన్ సర్వీస్) 32 వేల మంది దరఖాస్తు చేయగా, రెగ్యులర్ అభ్యర్థులు 2.27 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. అర్ధరాత్రి గడువు ముగిసే సమయానికి 3 నుంచి 5 వేల దరఖాస్తులు అందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వచ్చేనెల 10 నుంచి టెట్ పరీక్షలు
ఉపాధ్యాయ అర్హత పరీక్షల (టెట్)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 25 నుంచి ఆన్‌లైన్ నమూనా టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించారు. అలాగే, వచ్చేనెల 3 నుంచి హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అదేరోజు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రధాన పరీక్షలు డిసెంబర్ 10 నుంచి రెండు సెషన్స్‌గా ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. పూర్తి వివరాలకు http:// cse. ap. gov. in లో చూడవచ్చు.


