ఏడాదిలో రైతుల పరిస్థితి మరింత దిగజారింది
రాజధాని అమరావతి ఒక ఆర్థిక గుదిబండ
రెండో దశ ల్యాండ్ పూలింగ్ విరమించుకోవాలి
వికేంద్రీకరణ చర్చావేదిక ప్రతినిధులు రామచంద్రయ్య, కుర్రా వసుంధర, సలీం మాలిక్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ‘‘ఏ రాష్ట్రంలోనైనా, ఏ సమాజంలోనైనా విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ పాత్ర బలంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సి.రామచంద్రయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తెచ్చి మంచి పనిచేసిందన్నారు. వాటిని కొనసాగించాల్సిన బాబు సర్కారు విధ్వంసానికి పాల్పడుతూ ప్రైవేటుకు ఇవ్వడాన్ని తమ వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
విద్య, వైద్య రంగాల్లో విచ్చలవిడి ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ ఉమ్మడి ఏపీలో తీవ్ర నష్టం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జీవో 590ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది సామాన్యులు తమ కష్టార్జితాన్ని ప్రయివేటు వైద్యం మీద ఖర్చుపెట్టాల్సిన అనివార్య పరిస్థితి ఉందన్నారు.
రాష్ట్రానికి ఆర్థిక గుదిబండగా అమరావతి
సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో మొదలైన అమరావతి రాష్ట్రానికి ఒక ఆర్థిక గుదిబండగా మారుతోందని రామచంద్రయ్య అన్నారు. ‘‘రాజధాని పేరుతో ఇప్పటికే రూ.70 వేల కోట్లకు పైగా చంద్రబాబు అప్పు తెచ్చారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్‌లో 40–50 వేల ఎకరాలు సేకరించాలనడం దుర్మార్గం. ఆర్థిక వ్యవస్థపై చాలా పెద్ద బరువు పడుతోంది. దీన్ని ఆపాలి.
కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా రాజధానికి నిధులు ఎందుకు తేలేకపోతున్నారో, విభజన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదో చంద్రబాబు ప్రజలకు వివరించాలి. విజయవాడ, విశాఖలో లులూ సంస్థకు భూములు కట్టబెట్టడం తప్పు. వైజాగ్‌లో 2015–18 మధ్య జరిగిన పెట్టుబడుల సదస్సు ఒప్పందాలు, వాటి అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
రైతులు చితికిపోయారు..
రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రాక లక్షలాది రైతులు పొలాల్లో, బయట పంటను వదిలేస్తున్నారని, చితికిపోయి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుభీభవ పేరుతో అరకొరగా నిధులిస్తే ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. నెల్లూరు జిల్లా కరేడు గ్రామ రైతుల పోరాటానికి సామాజిక కార్యకర్త కుర్రా వసుంధర మద్దతు ప్రకటించారు.
ఒక సోలార్ ప్లాంట్ కోసం బహుళ పంటలు పండే 8,458 ఎకరాలను సేకరించడం అమానుషం, అనైతికమన్నారు. సామాజిక కార్యకర్త సలీం మాలిక్ మాట్లాడతూ వెనుకబడిన జిల్లాలకు బడ్జెట్ కేటాయింపు, ఎంత ఖర్చు చేశారు? వంటి కొన్ని అంశాలపై తమ ఆలోచన తెలిపేందుకు అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి తమ వైఖరి స్పష్టం చేస్తామన్నారు.


