
కాకినాడ: ఉన్నత ఆశయం, పట్టుదల, చురుకుదనం మొదలైనవి వినూత్న ఆలోచనలకు దారితీస్తాయని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన రాయవరపు సుధీర్ అన్వేష్ కుమార్ నిరూపించారు. ఎటువంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా లేని సుధీర్.. పరిస్థితులకు అనుగుణంగా ఆకారాన్ని మార్చుకునే టూ ఇన్ వన్ వాహనాన్ని రూపొందించాడు. ఈ వాహనం అటు బ్యాటరీతోను, ఇటు హైడ్రాలిక్ వ్యవస్థతోనూ పనిచేయడం మరో విశేషం.
ఈ నూతన వాహనం రూపకల్పనకు సుధీర్ నాలుగు సీట్ల జీప్ మోడల్‌ను ఎంచుకున్నాడు. అది వెడల్పుకు కుదించుకుని, బైక్ మాదిరిగానూ మారిపోతుంది. తద్వారా అది భారీ ట్రాఫిక్‌లో సులభంగా ముందుకు కదులుతుంది. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నిరంతరం రద్దీగా ఉండే నగరాల్లోట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సుధీర్ దీనిని తీర్చిదిద్దాడు.
సుధీర్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నాడు. తన దగ్గర ఇంకా చాలా వినూత్న ఆలోచనలు ఉన్నాయని తెలిపాడు. విజయవాడకు చెందిన సుధీర్ కుటుంబం కొన్నేళ్ల క్రితం కాకినాడకు వచ్చి స్థిరపడింది. ఇంజినీరింగ్ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, తొలుత తండ్రి అనారోగ్యం, ఆ తర్వాత అతని మరణం కారణంగా సుధీర్ ఇంజినీరింగ్ చేయలేకపోయాడు. అయితే దీనికి బదులుగా, 2014 లో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు... హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు సుధీర్ తరచూ భారీ ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్నాడు.
ఈ నేపధ్యంలోనే ట్రాఫిక్ రద్దీని సులభంగా దాటగలిగే ప్రత్యామ్నాయ రవాణా వాహనాన్ని రూపొందించాలని అనుకున్నాడు. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు కార్లు కదలడం కష్టమవుతుందని, అదే బైక్ విషయంలో అలా జరగదని గమనించిన సుధీర్ కారు- బైక్ మోడ్ మధ్య స్థ వాహనాన్ని రూపొందించడంలో విజయం సాధించాడు. ఈ వాహనాన్ని సుధీర్ ఏడు అడుగుల పొడవు, 2.11 అడుగుల వెడల్పుతో ఉండేలా, కాంపాక్ట్‌గా ఉన్నప్పుడు 4.2 అడుగుల వెడల్పుకు విస్తరించేలా రూపొందించాడు. ఈ వాహనం బ్యాటరీతో శక్తితోనూ, హైడ్రాలిక్ వ్యవస్థతో కూడా నడిచేలా తీర్చిదిద్దాడు. ఈ వాహనానికి సుధీర్ ఎంజెడ్(మెల్చి జెడాక్) అనే పేరు పెట్టాడు. రూ. 50 కోట్ల నుంచి 75 కోట్ల వరకూ ఖర్చయ్యే ఈ తరహా వాహనాల ప్రాజెక్ట్ కోసం యూఎఈకి చెందిన ఒక కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు సుధీర్ వెల్లడించారు.