పీహెచ్‌డీ చేసిన వారికన్నా... ఎంఫిల్‌ వారికి రూ. 5వేలు ఎక్కువ! | Ambedkar University increases salaries of contract employees at will | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ చేసిన వారికన్నా... ఎంఫిల్‌ వారికి రూ. 5వేలు ఎక్కువ!

Jun 15 2026 2:53 AM | Updated on Jun 15 2026 2:53 AM

Ambedkar University increases salaries of contract employees at will

అంబేడ్కర్‌ వర్సిటీలో ఇష్టారీతిన కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంపు 

ఎంఫిల్‌ డిగ్రీ ఉంటే అదనంగా రూ.5వేలు పెంపు 

18 వర్సిటీలది ఒకదారి.. అంబేడ్కర్‌ వర్సిటీది మరోదారి 

రాజకీయ నాయకుల సిఫారసులకు అనుగుణంగా పాలన సాగిస్తున్న వీసీ 

జీవో 110ని తుంగలో తొక్కుతూ అడ్డగోలుగా జీతాల పెంపు

మిగిలిన వర్సిటీల్లో ఇదే రీతిన జీతాలు పెంచాలని కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిపాలనా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. ఒక్కో వర్సిటీ.. ఒక్కోదారి చందాన వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ జీవోలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన ఆర్థికపరమైన అంశాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల సిఫారసులు, మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా వైస్‌ చాన్సలర్, రిజిస్ట్రార్ కార్యకలాపాలు సాగిస్తూ వర్సిటీ ప్రతిష్టను మసకబారుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జీవో నంబర్‌ 110కు పూర్తి విరుద్ధంగా అంబేడ్కర్‌ వర్సిటీలో పని చేస్తున్న 15 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు ఏకంగా రూ.5వేలు జీతం పెంచిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పీహెచ్‌డీ చేసిన వారికన్నా ఎంఫిల్‌ డిగ్రీ ఉన్నవారికి రూ.5వేలు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం. అదేవిధంగా ఏపీలోని 19 యూనివర్సిటీల్లో కేవలం అంబేడ్కర్‌ వర్సిటీలో మాత్రమే కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాలు పెంచడం సర్వత్రా చర్చనీయాంశమైంది.  

గత ప్రభుత్వంలో కాంట్రాక్టు అధ్యాపకులకు మేలు చేస్తూ జీవో 110 జారీ  
దశాబ్దాలుగా యూనివర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిపై అరకొర జీతాలతో సేవలందిస్తూ మగ్గిపోతున్న అధ్యాపకులకు మేలు చేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీవో 110 జారీ చేసింది. నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(నెట్‌), స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(సెట్‌), స్టేట్‌ లెవల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(స్లెట్‌)లో యూజీసీ నిబంధనలకు అనుగుణంగా అర్హత సాధించిన వారికి రూ.35వేల ఏకరూప జీతాలను తీసుకొచ్చింది. దీనికి అదనంగా పీహెచ్‌డీ ఉన్నవారికి మరో రూ.5వేలు పెంచింది. దీనితోపాటు కాంట్రాక్టు ఉద్యోగి సర్వీసును బట్టి ఏడాదికి మరో వెయ్యి చొప్పున అదనంగా పెంచుతూ రూ.50 వేల నుంచి రూ.60వేలకు పైగా జీతాలను పెంచారు. 

ఆ తర్వాత కూడా ఏడాదిలో రెండు పరిశోధన పత్రాలు సమర్పించిన కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.వెయ్యి ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిని దిగ్విజయంగా అన్ని వర్సిటీల్లో అమలు చేసి కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అంబేడ్కర్‌ యూనివర్సిటీలో జీవో 110ను తుంగలో తొక్కి ఎంఫిల్‌ ఉంటే అదనంగా మరో రూ.5వేలు పెంచుతూ ఈ ఏడాది జనవరి 19న ఉత్తర్వులు జారీ చేశారు. 

జీవో నంబర్‌ 110లో ఎంఫిల్‌ ప్రస్తావన లేకపోయినా వర్సిటీ అధికారులు మాత్రం నెట్, సెట్, స్లెట్‌తోపాటు పీహెచ్‌డీ అర్హతలు గలవారికి గతంలో పెంచిన జీతానికి అదనంగా ఎంఫిల్‌ ఉంటే మరో రూ.5వేలు పెంచడంతో మిగిలిన వర్సిటీ అధ్యాపకులు కూడా తమకు అదే విధంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం 15 మందికి ఎంఫిల్‌ పేరుతో జీతాలు పెంచగా, ఇందులో నలుగురైదుగురికి ఎంఫిల్‌ పట్టా లేకపోవడం గమనార్హం. దీనిపై వర్సిటీల వర్గాలు చాన్సలర్, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం.  

రాజకీయ పీఠానికి వీసీ దాసోహం.. 
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 18 వర్సిటీల్లోని 17 మంది వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారు. అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ మాత్రం యథావిధిగా పదవిలో కొనసాగుతున్నారు. స్థానిక రాజకీయ నాయకుల సిఫారసుతో వీసీ కుర్చీని కాపాడుకున్న కారణంగా, వారు చెప్పింది చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఫలితంగా వర్సిటీలో పరిపాలనా వ్యవస్థ గాడితప్పింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా గతంలో ఇద్దరు ప్రొఫెసర్లకు సీనియర్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించి వార్తల్లో నిలిచారు. 11 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీలను కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా మార్పు చేశారు. 

రాజకీయ నాయకుల సిఫారసు లేఖల ఆధారంగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు కల్పించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందారనే కారణంతో ఏకంగా 34 మంది చిరుద్యోగులను అర్ధాంతరంగా తొలగించి నడిరోడ్డుపై పడేశారు. ఆ వెంటనేమరో 65 మందికి ఎటువంటి నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కొలువుల్లో కూర్చోబెట్టడం గమనార్హం. వర్సిటీలో అర్హతలు, నిబంధనలను కాలరాస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ చిరంజీవి, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ లేఖల ఆధారంగా ఉద్యోగాలు కట్టబెట్టేయడమే వీసీ పనిగా పెట్టుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం కూడా తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement