ఏపీకి వెళ్లే అన్ని రెగ్యులర్ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్
ప్రత్యేక రైళ్లలో 250 నుంచి 350 వరకు వెయిటింగ్ లిస్ట్
శబరిమలకు భారీగా డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నగరవాసులకు రైళ్లు ‘రిగ్రేట్’తో దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలోనూ ఏసీ, నాన్ ఏసీ రిజర్వేషన్‌లు పూర్తిగా భర్తీ అయ్యాయి. వెయిటింగ్ జాబితాలో సైతం బుక్ చేసుకునేందుకు అవకాశం లేకుండా రెగ్యులర్ రైళ్లలో ‘రిగ్రేట్’ కనిపిస్తుండగా, పలు మార్గాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో మాత్రం 250 నుంచి 350కి పైగా వెయిటింగ్ లిస్ట్ నమోదైంది. వివిధ మార్గాల్లో బుకింగ్ తెరిచిన కొద్ది క్షణాల్లోనే రిజర్వేషన్‌లు భర్తీ అవుతున్నాయి. దీంతో దక్షిణమధ్య రైల్వే నడిపే అరకొర రైళ్ల కారణంగా లక్షలాదిమంది ప్రయాణికులకు నిరాశే ఎదురవుతుంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు మరో 100 రైళ్లను అదనంగా ఏర్పాటు చేస్తే తప్ప ప్రయాణికులు పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లడం సాధ్యం కాదు.మరోవైపు హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీ కూడా అనూహ్యంగా పెరిగింది. కానీ ప్రస్తుతం ఒకటి, రెండు రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో భక్తులు ప్రైవేట్ వాహనాలు, బస్సులు, విమానాలను ఆశ్రయిస్తున్నారు. సొంత వాహనాల్లోనూ తరలి వెళ్తున్నారు.
సొంతూరికి చేరేదెలా...
సాధారణంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి మొదటి వారం నుంచే ప్రయాణికుల రద్దీ మొదలవుతుంది. రెండో వారానికి ఈ రద్దీ భారీగా పెరుగుతుంది. సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రతి సంవత్సరం సొంత ఊళ్లకు వెళ్తారని అంచనా. సికింద్రాబాద్, చర్లపల్లి,నాంపల్లి, లింగంపల్లి, తదితర స్టేషన్ల నుంచి సాధారణంగా రోజుకు 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తే సంక్రాంతి సందర్భంగా మరో లక్ష మంది అదనంగా బయలుదేరుతారు. దీంతో రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులకు గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా రైల్వే అధికారులు ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.సంక్రాంతి పండుగ దృష్ట్యా విశాఖపట్టణం, శ్రీకాకుళం, కాకినాడ, తిరుపతి నగరాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరే విశాఖ, ఫలక్‌నుమా, కోణార్క్, నాందేడ్ సూపర్‌ఫాస్ట్, ఈస్ట్‌కోస్ట్, గరీబ్‌రథ్, దురంతో, తదితర రైళ్లలో రిగ్రేట్ స్థాయికి చేరుకోగా,కాకినాడ వైపు వెళ్లే గౌతమి, కోకనాడ, నర్సాపూర్, తదితర రెగ్యులర్, ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 250 దాటిపోవడం గమనార్హం.
కొత్త సంవత్సర వేడుకలు కష్టమే..
మరోవైపు నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని చాలామంది పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతారు. గోవా, జైపూర్, కేరళ,బెంగళూర్,తదితర ప్రాంతాలకు డిమాండ్ ఉంటుంది.కానీ ఈ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. చివరి క్షణాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించడం వల్ల సది్వనియోగం చేసుకోలేకపోతున్నట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు. క్రిస్మస్ నుంచే ప్రయాణికుల డిమాండ్ పెరుగుతుంది. కానీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.


