బంజరు ‘బంగారం’ | Above six lakh acres of barren lands into cultivation | Sakshi
Sakshi News home page

బంజరు ‘బంగారం’

Jan 9 2022 3:21 AM | Updated on Jan 9 2022 3:21 AM

Above six lakh acres of barren lands into cultivation - Sakshi

సాక్షి, అమరావతి: ఎలాంటి పంటలకూ పనికి రాని 6.20 లక్షల ఎకరాల బంజరు భూములను వాటర్‌షెడ్‌ పథకాలతో బంగారు భూములుగా మార్చి సాగులోకి తేవడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పీఎంజీఎస్‌కేవై  2.0 కార్యక్రమంలో భాగంగా వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఈ పథకాలు చేపడతారు. ఇందుకయ్యే ఖర్చును  60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2022–26 మధ్య ఐదేళ్లలో కొత్తగా వాటర్‌షెడ్‌ పథకాలకు  ప్రణాళికలు పంపాలని కేంద్రం తాజాగా కోరింది. మన రాష్ట్రం నుంచి గరిష్టంగా 2.50 లక్షల హెక్టార్ల (6.20 లక్షల ఎకరాలు) ప్రతిపాదనలు పంపాలని సూచించింది.

ఇందుకు రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బంజరు భూములను ఎంపిక చేశారు. కనీసం 2,500 హెక్టార్ల బంజరు ఉండే ప్రాంతాన్ని ఒక ప్రాజెక్టు (ప్రాంతం)గా తీసుకొని 61 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో 5,000 హెక్టార్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాజెక్టు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు గ్రామాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అధికారులు అదనంగా మరో 30 ప్రాజెక్టులతో 75 వేల హెక్టార్లు (1.85 లక్షల ఎకరాలు) అభివృద్దికి ప్రతిపాదనలు ముందస్తుగా సిద్ధం చేశారు. ఈ నెల 4న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మొత్తం 91 ప్రాజెక్టుల పరిధిలో 3.25 లక్షల హెక్టార్లతో ప్రతిపాదనలను రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు కేంద్ర అధికారులకు అందజేశారు. వీటికి  కేంద్రం ఆమోదం లభిస్తే రాష్ట్రంలో కనీసం 4 లక్షల మంది రైతు, కూలీల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

నిధుల పెంపు, నిబంధనల్లోనూ మార్పు
పీఎంజీఎస్‌కేవై 1 లో రాష్ట్రంలో ఇప్పటికే దశల్లో వాటర్‌షెడ్‌ కార్యక్రమాలు జరిగాయి. ఆ పథకాల్లో అభివృద్దికి హెక్టారుకు గరిష్టంగా రూ.12 వేలు మాత్రమే కేటాయించారు. ఇంత తక్కువ నిధులతో చెక్‌ డ్యాంల నిర్మాణం, భూమిలో తేమ శాతం పెంపు, ఇతర కార్యక్రమాలతో పాటు ఆ ప్రాంతంలోని కూలీల కుటుంబాలకు వ్యవసాయ ఆధారిత జీవనోపాధి కల్పనలో సత్ఫలితాలు రాలేదు. ఈ నేపధ్యంలో పీఎంజీఎస్‌కేవై – 2లో వాటర్‌షెడ్‌ కార్యక్రమాల నిర్వహణకు హెక్టారుకు రూ.22 వేల నుంచి రూ.28 వేలు కేటాయించాలని నిర్ణయించారు. దీనికి తోడు గతానికి భిన్నంగా మెరుగైన ఫలితాలు దక్కేలా నిబంధనల్లోనూ మార్పులు చేశారు. ఒక ప్రాజెక్టులో చేపట్టే పనుల ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులివ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం గతంలో ఎక్కువ శాతం నిధులిచ్చిన పనులకు ఇప్పుడు తక్కువ కేటాయించాలని, గతంలో తక్కువ శాతం నిధులిచ్చిన పనులకు ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement