ఏపీ ఐసెట్‌లో 94శాతం ఉత్తీర్ణత | 94 percent pass in AP ICET and Top Ten Ranks To Boys | Sakshi
Sakshi News home page

ఏపీ ఐసెట్‌లో 94శాతం ఉత్తీర్ణత

Jun 16 2023 5:12 AM | Updated on Jun 16 2023 5:15 AM

94 percent pass in AP ICET and Top Ten Ranks To Boys - Sakshi

మొదటి ర్యాంకు టి. జగదీష్‌ కుమార్‌రెడ్డి

అనంతపురం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశా­లకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌–2023 ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. టాప్‌–10 ర్యాంకుల్లో తొలి తొమ్మిది ర్యాంకులు వరుసగా అబ్బా­యిలే దక్కించుకోగా, 10వ ర్యాంకు అమ్మాయి కైవసం చేసుకుంది. ఏపీ ఐసెట్‌ ఫలితాలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గురువారం విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కే. హేమచంద్రారెడ్డి వర్చువల్‌ విధానంలో హాజ­రు­కాగా, ఏపీ ఐసెట్‌ చైర్మన్, ఎస్కేయూ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఏపీ ఐసెట్‌ రాష్ట్ర కన్వీనర్‌ పి. మురళీకృష్ణ ఫలితాలను వెల్లడించారు.

ఏపీ ఐసెట్‌కు మొత్తం 49,122 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 44,343 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 41,799 (94.26 శాతం) మంది అర్హత సాధించారు. అబ్బాయిలు 24,864 మంది దరఖాస్తు చేసుకోగా.. 22,290 మంది హాజరయ్యారు. 21,041 (94.39 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే, అమ్మాయిలు 24,298 మంది దరఖాస్తు చేసుకోగా, 22,053 మంది హాజరయ్యారు. ఇందులో 20,758 (94.26 శాతం) మంది అర్హత సాధించారు.

ఐదు మార్కులు అదనం
ఇక ఏపీ ఐసెట్‌లో మొత్తం 2,400 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో కేవలం ఐదు అభ్యంతరాలను మాత్రమే పరగణనలోకి తీసుకుని వాటికి జవాబు రాసిన విద్యార్థులకు ఐదు మార్కులు అదనంగా కలిపినట్లు ఏపీ ఐసెట్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కన్వీనర్‌ పి. మురళీకృష్ణ తెలిపారు. 

ఉన్నత విద్యలో సంస్కరణలు..
ఫలితాల విడుదల అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కే. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరీక్షలన్నీ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. తొలిసారి ఏపీ ఐసెట్‌ బాధ్యతలు ఎస్కేయూకు అప్పగించామని, యూనివర్సిటీ పటిష్టంగా నిర్వహించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న ఖర్చును నైపుణ్య, మానవవనరులల అభివృద్ధిపై పెట్టుబడిగా పరిగణిస్తోందన్నారు. జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులు, నూతన విద్యావిధానం, ఉన్నత విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ఫలితంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల చేరిక, ఉత్తీర్ణత శాతం పెరుగుతోందన్నారు. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్‌  ఏ. మల్లికార్జునరెడ్డి, రిజిస్ట్రార్‌ ఎంవీ లక్ష్మయ్య, ఏపీ ఐసెట్‌ కో–కన్వీనర్లు రాంగోపాల్, రఘునాథరెడ్డి, శోభాలత, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement