సింహాచలం ఘటన: ముగిసిన త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ | 3 Men Committee on Preliminary Report Of Simhachalam Incident | Sakshi
Sakshi News home page

సింహాచలం ఘటన: ముగిసిన త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ

May 2 2025 6:11 PM | Updated on May 2 2025 7:13 PM

3 Men Committee on Preliminary Report Of Simhachalam Incident

విశాఖ :సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటనలో త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ ముగిసింది.  దీనిపై ప్రభుత్వానికి రేపు(శనివారం) నివేదిక ఇవ్వనుంది త్రీమెన్ కమిటీ. దీనివలో భాగంగా త్రీమెన్‌ కమిటీ చైర్మన్‌, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్ మాట్లాడుతూ ‘  సింహాచలం దుర్ఘటనపై రేపు ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప‍్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేశారు. గోడ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవు.

విచారణలో భాగంగా వివిధ శాఖల వారిని విచారించాం. వైదిక నియమాలను ఉల్లంఘించినట్లు ఆలయ అర్చకులు చెప్పారు. ఆగమ శాస్త్రపరమైన సలహాలు లేకుండానే గోడ నిర్మించారని వైదికులు మా దృష్టికి తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ ఉల్లంఘనలు కనిపించాయి. ఎవరి అనుమతిలో మాస్టర్ ప్లాన్ పై నిర్ణయాలు తీసుకున్నారో తేలాలి. ప్రసాద్ స్కీం పనులు గత ఏడాది ఆగస్టులో పూర్తి కావాల్సి ఉంది. ఆలస్యానికి కారణం ఏంటని అడిగితే భిన్నమైన సమాధానాలు వచ్చాయి. అధికారుల మధ్య సమన్వయంపై ఉ‍న్నతాధికారులతో మాట్లాడాలి’ అని స్పష్టం చేశారు.

కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్‌లో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. 

ప్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేశారు

Advertisement
 
Advertisement
Advertisement