శభాష్‌.. సుప్రియ

18 Years Old From Vaddirala Village Of YSR District Got Postal Job - Sakshi

    తల్లిదండ్రులను కోల్పోయినా ధైర్యం వీడని బాలిక

   ఆత్మస్థైర్యంతో చదువు కొనసాగించిన వైనం

   18 ఏళ్ల వయస్సులోనే పోస్టల్‌శాఖలో ఉద్యోగం

మైలవరం: (జమ్మలమడుగు రూరల్‌): తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిని, పన్నెండేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఆ బాలిక పట్టుదలతో చదువును కొనసాగించి పద్దెనిమిదేళ్ల వయసులోనే పోస్టల్‌శాఖలో ఉద్యోగం సాధించి అందరిచేత శభాష్‌ అనిపించుకుంది. మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన గడ్డం సుమలత, మద్దిరాల ప్రసాద్‌ల ఏకైక కుమార్తె సుప్రియ. దురదృష్టవశాత్తు 2013లో మిద్దె కూలి తల్లి సుమలత మరణించగా 2016లో తండ్రి ప్రసాద్‌ గుండెపోటుతో చనిపోయాడు. 

తల్లిదండ్రులిద్దరూ కానరాని లోకాలకు వెళ్లిపోయినా సుప్రియ మాత్రం ఆత్మస్థైర్యంతో చదువును కొనసాగించింది. మేనమామ గడ్డం ఓబులేసు సంరక్షణలో ఉంటూ రాజుపాలెం మండలం వెల్లాల గురుకుల పాఠశాలలో 10 వ తరగతి వరకు చదివింది. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 600కు 594 మార్కులు సాధించి ఔరా అనిపించింది. సుప్రియ ఇంటర్మీడియట్‌ రెండేళ్లు కర్నూలు జిల్లా బనగానపల్లెలోని కంకర గురివిరెడ్డి జూనియర్‌ కళాశాలలో చదివింది. అక్కడ బైపీసీ గ్రూపు తీసుకొని 1000 మార్కులకు 952 మార్కులు తెచ్చుకొని అందరి మన్ననలు పొందింది. కాగా ఈ ఏడాది జూన్‌ నెలలో పోస్టల్‌శాఖ విడుదల చేసిన ఫలితాల్లో సుప్రియ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ ఉద్యోగానికి ఎంపికైంది. ఈమెను నంద్యాల పోస్టల్‌ డివిజన్‌లోని బురుజుపల్లె పోస్టాఫీసులో బీపీఎంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

మూడేళ్లుగా అమ్మ ఒడికి దూరం..
చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన సుప్రియ జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని అందుకోలేకపోయింది. వాస్తవానికి సుప్రియ తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు బతికి ఉన్నా ఆమెకు అమ్మ ఒడి వర్తించేది. ఇద్దరూ చనిపోవడంతో సుప్రియ మేనమామ గడ్డం ఓబులేసు ఆమెకు సంరక్షకుడిగా ఉన్నారు.

అయితే ఓబులేసుకు కూడా 3వ తరగతి చదివే కుమారుడు ఉండడంతో ఆ అబ్బాయికి అమ్మఒడి వర్తించింది. ఒక కుటుంబంలో ఒక్కరికే అమ్మఒడి అనే నిబంధన ఉండడంతో సుప్రియకు అమ్మ ఒడి వర్తించలేదు. తల్లిదంద్రలు ఇరువురూ చనిపోయిన పిల్లలకు అమ్మఒడి డబ్బులను సంరక్షకుల పేరు మీద కాకుండా విద్యార్థుల బ్యాంకు ఖాతాలో పడేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సవరిస్తే తనలాంటి వారికి ఎందరికో మేలు జరుగుతుందని సుప్రియ అంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top