వాంతులు, విరేచనాలు, జ్వరం బారిన పడిన అల్లూరి జిల్లా రాజేంద్రపాలెం ‘ఆశ్రమ’ విద్యార్థినులు
కేజీహెచ్‌లో ఇద్దరు బాలికలకు చికిత్స.. మిగిలిన వారికి రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో..
కలుషిత ఆహారమే కారణం!
ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు.. గతనెలలో కురుపాం స్కూల్లో ఇద్దరు బాలికల మృతి
120 మందికిపైగా అస్వస్థత అయినా చలనం లేని చంద్రబాబు సర్కారు
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రమాదఘంటికలు మోగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇప్పటికే గతనెలలో పార్వతీపురం జిల్లా కురుపాం ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురై ఇద్దరు బాలికలు మరణించారు. 120 మంది అస్వస్థతకు గురయ్యారు. అయినా ప్రభుత్వంలో మార్పు రాలేదు. ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగు పరచడం లేదు. ఫలితంగా తాజాగా అల్లూరి జిల్లా రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 22 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
మిగిలిన వారు రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 8వ తరగతి విద్యార్థులు కీర్తి ప్రసస్న, హాసినిలకు తొలుత జ్వరంతోపాటు విరేచనాలు కావడంతో నర్సీపట్నానికి తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. ఆదివారం ఉదయం నుంచి పాఠశాలకు చెందిన మరో 20 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారంతా తీవ్ర జ్వరంతోపాటు రక్త విరేచనాలతో బాధపడ్డారు. ఇంత మంది బాలికలు ఒక్కసారే అనారోగ్యానికి గురికావడంతో కలెక్టర్ దినేష్‌కుమార్ వైద్యం అందించాలని ఆదేశాలిచ్చారు.
దీంతో రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో వైద్యురాలు స్నేహలతరెడ్డి చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం గుమ్మడి కాయ కూర, రాత్రి బంగాళదుంపల కూరతో బాలికలు భోజనం తిన్నారు. అస్వస్థతకు కారణాలు ఏమిటన్నది పూర్తిగా తెలియడం లేదు. ఆదివారం అనారోగ్యంతో భారవి,శ్రీవల్లి, గంగాభవాని, హాసిని, ప్రసన్న, పద్మ, అచ్యుత, నాలుగో తరగతికి చెందిన సునీత, హేమ, దివ్య, బంగారం, నాగమణి, రాజేశ్వరి, వి.పూజ, ఆమని, డి.లలిత, జి.మీనాక్షి భారత, కృష్ణవేణి పీహెచ్‌సీలో చేరారు. వీరిలో 15 మందికి విరేచనాలయ్యాయి.
మిగిలిన వారికి జ్వరం రావడంతో చికిత్స చేస్తున్నారు. బాలికల ఆశ్రమ పాఠశాలలో 300 మంది విద్యార్థులున్నారు. ఒకవేళ ఆహారం కలుషితమైతే వీలైనంత ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉంది. వైద్యులు స్నేహలతరెడ్డి మాట్లాడుతూ కలుషిత నీటి వల్ల అనారోగ్యంపాలై ఉండవచ్చన్నారు.
పీహెచ్‌సీలో చాలని బెడ్లు
రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న చిన్నారులకు బెడ్లు చాలలేదు. దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు బాలికలకు చికిత్స అందిస్తున్నారు. ఒక బెడ్‌పై మాత్రం ముగ్గురు బాలికలను పడుకోబట్టి చికిత్స చేస్తున్నారు.


