ఉపాధ్యాయులు రాకుంటే చదువులెలా?
ముంచంగిపుట్టు: ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే మా పిల్లల చదువులు ఎలా కొనసాగుతున్నాయని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఏనుగురాయి పంచాయతీ జంగంసరియా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు బుధవారం రోజున ఉపాధ్యాయులు రాలేదు. పాఠశాలకు తాళాలు వేసి ఉండటంతో గ్రామ గిరిజనులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుల తీరుపై పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎం.మోహన్‌రావు, తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నా ఒక్కరు కూడా రాలేదన్నారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి, వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ఒకేసారి ఇద్దరు ఉపాధ్యాయులు సెలవు పెడితే పాఠశాల మూసుకోవాల్సిన దుస్థితి ఉందని, మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం పాఠశాల తెరిచేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. దీనిపై ఎంఈవోను వివరణ కోరగా పాఠశాల ఉపాధ్యాయులు సెలవులో ఉన్నందున మరొక పాఠశాల నుంంచి ఉపాధ్యాయుడిని పంపించామన్నారు. ఆయన పాఠశాలకు వెళ్లడంలో కొంత ఆలస్యం అయిందని ఆయన పేర్కొన్నారు.
జంగంసరియాలో విద్యార్థుల
తల్లిదండ్రుల ఆందోళన
పాఠశాల మూతపడి ఉండటంపై ధ్వజం
సమస్య పరిష్కరించకుంటే ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం
గ్రామ గిరిజనుల హెచ్చరిక
ఉపాధ్యాయులు రాకుంటే చదువులెలా?


